సంస్కృత
భాష అభ్యున్నతి కోరుతూ పలువురు ప్రముఖులకు సంస్కృత భాషా పరిరక్షణ సమితి వినతి
పత్రాలు అందజేస్తోంది. ఈ క్రమంలో సంస్కృతభాషా ఉపాధ్యాయ సంఘం సభ్యులు(ఆంధ్రప్రదేశ్),
విశాఖ శ్రీశారదాపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి
వినతిపత్రం అందజేసి తమ సమస్యలు విన్నవించారు. ప్రభుత్వాధికారులతో మాట్లాడి తమ
సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.
రాష్ట్రప్రభుత్వం
అమలు చేసే నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాల స్థాయిలో సంస్కృతాన్ని కొనసాగించడంతో
పాటు, సీబీఎస్‌ఈకి ఎంపికైన పాఠశాలల్లో ఆప్షనల్
గా ఎంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో
వెయ్యి స్కూళ్ళలో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు స్వాగతించామని, ఈ విధానంలో భాగంగా వంద మార్కులకు
సంస్కృతాన్ని బోధించే అవకాశం వస్తుందని ఆశించామని ఆవేదన వెలిబుచ్చారు.
ఇప్పటివరకు
బోధిస్తున్న 30 మార్కుల సబ్జెక్టు ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను
తెలుగు ఉపాధ్యాలుగా కొనసాగమంటున్నారని అది
కష్టసాధ్యమన్నారు.
సీబీఎస్‌ఈలో
సంస్కృతాన్ని ఐచ్ఛికంగా తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. తమిళం, కన్నడం,
ఉర్దూ కు అవకాశం కల్పించి సంస్కృతం లేకుండా చేశారన్నారు. దేశవ్యాప్తంగా
సంస్కృతానికి ఉన్న అవకాశాలను రాష్ట్రంలో కూడా కల్పించాలన్నారు.
సనాతన ధర్మాన్ని
కాపాడేందుకు సంస్కృతం అవసరమన్నారు. మనకు తెలియని విషయం ఉందేమోకానీ సంస్కృతంలో
లేనిదే లేదన్నారు. సంస్కృతం అన్నీ భాషలకు మూలమని, అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో
ఈ భాష మూలాలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో
పాఠశాల స్థాయిలో ఆరు లక్షల మందికిపైగా విద్యార్థులు సంస్కృతాన్ని అభ్యసిస్తుండగా,
ఆరు వేల మంది ఉపాధ్యాయులు దీనిని బోధిస్తున్నారు. కళాశాల స్థాయిలో 1800 కాలేజీల్లో
8 లక్షల మంది చదువుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.