ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో చీకట్లు కమ్ముకున్నాయి. మహాలయ అమావాస్య రెండో శనివారం కావడంతో నిన్న భక్తులు భారీగా తరలివచ్చారు. మరమ్మతుల పేరుతో విద్యుత్ అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఆలయ అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు. వేలాది మంది భక్తులు చీకట్లోనే సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్, ఈవో అక్కడే ఉన్నా చూస్తూ ఉండిపోయారు.
చిన్న పిల్లలతో దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవాలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇంతపెద్ద పుణ్యక్షేత్రంలో ఒక చిన్న జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేరా అంటూ భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. భక్తుల నుంచి వచ్చే ఆదాయంపై తప్ప, సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకమండలి, అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని మహిళా భక్తులు మండిపడ్డారు.