టోఫెల్ శిక్షణ పేరిట
రాష్ట్రప్రభుత్వం దుబారాకు పాల్పడుతుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
ఆరోపించారు. విద్యా శాఖ పేరుతో ప్రజాదనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం
వ్యక్తం చేశారు.
పాఠశాల స్థాయి విద్యార్థులకు ఏ మాత్రం
ఉపయోగపడని టోఫెల్ శిక్షణను బలవంతంగా రుద్దుతూ, ఆ
ముసుగులో వేల కోట్ల రూపాయలను జేబులో వేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారని
ఆరోపించిన నాదెండ్ల మనోహర్.. దీనిపై సమగ్ర
విచారణకు డిమాండ్ చేశారు.
విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు
పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డిగ్రీ
పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో
చదువుకోవడానికి రాయాల్సిన అర్హత పరీక్షలో టోఫెల్ ఒకటి. ముఖ్యంగా అమెరికా వెళ్ళేవాళ్లు
ముందుగా వారి ఇంగ్లీషు పరిజ్ఞానం తెలుసుకునేందుకు నిర్వహించే టెస్ట్. ఈ పరీక్షను
ఈటీఎస్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తారు.
‘‘జగన్ ప్రభుత్వం మాత్రం టోఫెల్
పరీక్షను మూడో తరగతి నుంచి పదవ తరగతి చదివే పిల్లలకు ఈ ఏడాది నుంచి 2027 వ
సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను అన్ని తరగతుల వారీగా నిర్వహించేలా ఈటీఎస్ అనే
సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం
ప్రతి ఏటా రూ.1052 కోట్లు ఖర్చు చేయనుంది. నాలుగు సంవత్సరాలకు
కలిపి సుమారుగా రూ.4 వేల కోట్లకు పైబడి ఈ పథకంలో ఖర్చు చేయనున్నారు’’
అని మనోహర్ వివరించారు.
వచ్చే అయిదు
నెలల్లో ఇంటికి వెళ్లబోయే ప్రభుత్వం, ఈటీఎస్ సంస్థ వెంటపడి మరీ ఈ ఒప్పందం
కుదుర్చుకోవడం వెనుక వైసీపీ పెద్దల స్వలాభం దాగుందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న 1.81
లక్షల ఉపాధ్యాయుల్లో కేవలం 1200 మంది మాత్రమే ఇంగ్లిష్ ఉపాధ్యాయులు ఉన్నారని,
వారు ఈ పథకంలో విద్యార్థులకు ఎలా ఉపయోగపడతారని ప్రశ్నించారు.
ఎందరో విద్యార్థులకు
విదేశీ విద్య కల తీర్చే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కుదించిన వైసీపీ
ప్రభుత్వం, ప్రపంచంలో 100
పేరెన్నికగన్న యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు మాత్రమే సహాయం అందిస్తామని
చెప్పారు. పథకం పేరును మార్చేసి, గత నాలుగున్నర ఏళ్లలో 357
మంది విద్యార్థులకు, కేవలం రూ.45 కోట్లు సాయం చేసిందన్నారు.
వైసీపీ నేతలు చేపట్టబోయే బస్సు యాత్రపైనా నాదెండ్ల
మనోహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలతో పాటు సీఎం కూడా ఉండే రోడ్ల దుస్థితి
తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి హెలీకాప్టర్ లో చక్కర్లు కొడితే ఏం తెలుస్తుందని
ఆగ్రహం వ్యక్తం చేశారు.