దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు
నిండిన అమృత కాలం. స్వతంత్ర శతాబ్ది నాటికి అగ్రరాజ్యం కావాలన్న లక్ష్యం. సరికొత్త
పార్లమెంటు, క్రొంగొత్త ఆశలు, సరికొత్త ఆశయాలు. అలాంటి పార్లమెంటులో ఈ దేశ భవిష్యత్
తరానికి మాట్లాడే గొప్ప అవకాశం. అలాంటి అరుదైన అవకాశం మన రాష్ట్రం నుంచి ఒకే ఒక్క
అమ్మాయికి దక్కింది.
జానగొండ అరుణ. కడప జిల్లా అక్కాయపల్లె
గ్రామస్తురాలు. ఆటోడ్రైవర్ హరిప్రసాద్, రమాదేవి దంపతుల కుమార్తె. పార్లమెంట్లో ఉపన్యసించే అరుదైన అవకాశం దక్కిన
తెలుగమ్మాయి ఈమే. దేశం మొత్తం మీద ఇలాంటి అవకాశం 25
మందికి దక్కగా, వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణ ఒక్కర్తే ఉంది. గాంధీ, లాల్‌బహదూర్
శాస్త్రి జయంతి సందర్భంగా అక్టోబర్ 2న నూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో
అరుణ, గాంధీ జీవితం గురించి ప్రసంగించనుంది.
అరుణ బాల్యం నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లోనే
చదువుకుంది. కడపలోని శ్రీవివేకానంద మహిళా డిగ్రీ కళాశాలలో గతేడాదే డిగ్రీ పూర్తిచేసింది.
చిన్ననాటి నుంచీ పలు వ్యాసరచన పోటీల్లో రాష్ట్ర, జిల్లా
స్థాయుల్లో విజేతగా నిలిచింది. 2017లో ఇంటాక్ రీజినల్ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది.
నెహ్రూ యువకేంద్రం
ఇటీవల ‘జాతీయ నాయకులకు నివాళి’ కార్యక్రమంలో భాగంగా ‘గాంధీ జీవనవిధానం, ఆయన పద్ధతులు:
ప్రపంచంపై ప్రభావం’, ‘అమృత కాలంలో లాల్‌బహదూర్ శాస్త్రి జీవితపాఠాలు’ అనే అంశాలపై పోటీలు నిర్వహించింది.
తొలుత జిల్లా స్థాయిలోనూ, తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ జరిగిన పోటీల్లో అరుణ విజయం
సాధించింది. ఫలితంగా జాతీయ స్థాయి గౌరవం దక్కింది. పార్లమెంటులో మాట్లాడే అరుదైన అవకాశం
ఆమె సొంతమైంది.
అరుణ ప్రస్తుతం డాక్టర్ బీఆర్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథ్స్ చదువుతూ, యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతోంది.