పదో
తరగతి వార్షిక పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లు ఈ ఏడాది కొనసాగించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. పేపర్లను రద్దు చేస్తున్నట్లు గతంలో మంత్రి బొత్స
సత్యనారాయణ ప్రకటించగా పలువురు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం
వ్యక్తం చేశారు.
విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడం సరికాదన్నారు. పెద్దఎత్తున
విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ఏడాది కొనసాగించి వచ్చే సంవత్సరం
నుంచి తొలగిస్తామని ప్రకటించింది.
కాంపోజిట్
తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. ఇదే విదానాన్ని
ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్సీ పేపర్లకు అమలు చేయనుంది.
పదో
తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఏడు పేపర్లు ఉండనున్నాయి.
భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి
ఒక పేపర్‌గా 50 మార్కులకు , జీవశాస్త్రం మరో పేపర్‌గా 50 మార్కులకు ఉంటుంది. ఈ
రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున
ప్రశ్నలు ఉంటాయి. అలాగే రెండు పేపర్లు కలిపి 35 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే.
తెలుగు,
హిందీ, ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం పేపర్లు యధావిధిగా ఉంటాయి. తెలుగు, హిందీలో
ఎక్కువ మంది ఫెయిల్ అవుతుండటంతో ప్రశ్నపత్రంలో మార్పులు చేశారు.
తెలుగు
ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించి దాని
స్థానంలో ఒక పద్యం ఇచ్చి దాని పై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై
నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 8 మార్కులు
కేటాయించారు.
రెండో
ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా, ఇకపై
గద్యాన్ని చదివి నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
హిందీలో
విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రంలో మార్పులు చేశారు. గతంలో తొలగించిన
బిట్ పేపర్ విధానాన్నే తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల
ప్రశ్నలు ఉంటాయి.