పాఠశాల గ్రంథాలయం పేరును సైన్‌బోర్డు మీద
ఆంగ్లంలో రాయడాన్ని నితీష్ కుమార్ తప్పుపట్టారు. బిహార్ ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ
పాఠశాలను సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది.
బిహార్ రాజధాని పట్నాకు 250 కిలోమీటర్ల
దూరంలో ఉన్న బంకా జిల్లాలో నితీష్ కుమార్ బుధవారం పర్యటించారు. ఆ సందర్భంగా ఒక
ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. బడిలోని గ్రంథాలయం దగ్గర డిజిటల్ సైన్బోర్డ్ ఏర్పాటు చేసారు. దానిమీద ‘డిజిటల్ లైబ్రరీ’ అని
ఇంగ్లీషులో రాసి ప్రదర్శిస్తున్నారు.
డిజిటల్ సైన్ బోర్డ్ ఆంగ్లంలో ఉండడాన్ని చూసిన
నితీష్ కుమార్ అక్కడ హిందీలో ఎందుకు రాయలేదని అధికారులను అడిగారు. అక్కడే ఉన్న
జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్‌పై మండిపడ్డారు. ‘‘మనమేమైనా బ్రిటిష్ వారి
కాలంలో జీవిస్తున్నామా, లేదు కదా’’ అని
వ్యాఖ్యానించారు.
ఆ సందర్భంగా మాట్లాడిన నితీష్ కుమార్
‘‘నేను ఇంగ్లీషుకు వ్యతిరేకిని కాదు. నా చదువంతా ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది.
పార్లమెంటులో సైతం చాలా సమావేశాల్లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాను. అయితే… ఒకానొక
సందర్భంలో నేను మాతృభాషని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పటినుంచీ
సంతకం కూడా ఇంగ్లీషులో పెట్టడం మానేసాను. హిందీలోనే పెడుతున్నాను’’ అని చెప్పారు. ఆ
పాఠశాలలో పెట్టిన బోర్డు మీద డిజిటల్ గ్రంథాలయం అన్న మాటలను ఇంగ్లీషులో తీసేసి
హిందీలో ఉంచాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశించారు.
నితీష్ కుమార్ ఇంగ్లీషు
భాషపై అసహనం వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం ఓ ప్రభుత్వ
కార్యక్రమంలో వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్ కుమార్ తన ప్రసంగాన్ని ఆంగ్లంలో
ప్రారంభించారు. నితీష్ అప్పుడు అతనిపై అసంతృప్తి ప్రకటించారు. ఇటీవల బిహార్ శాసన
మండలిలో కూడా ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుపై ఇంగ్లీషు పదాలను చూసి మండిపడ్డారు.
వాటిని హిందీలోకి మార్పించారు.