స్వతంత్ర భారతంలో పార్లమెంట్ భవనం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సెంట్రల్ హాల్లో ఆయన ఉద్విగ్న ప్రసంగం చేశారు. సభ్యులంతా పాత పార్లమెంట్ భవనం నుంచి పాదయాత్రగా కొత్త భవనంలోకి వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా మిగిలిన ప్రముఖులంతా ఆయనను అనుసరించారు.భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో పార్లమెంటు పరిసరాలు మార్మోగాయి. కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెడుతూ సభ్యులు భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నూతన భవనంలోకి తరలించారు.
పార్లమెంట్లో జరగుతోన్న ఈ చివరి సమావేశం ఎంతో భావోధ్వేగంతో కూడుకుందని ప్రధాని మోదీ అన్నారు. సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాధికారం అందుకుంది కూడా ఈ సెంట్రల్ హాల్లోనేనని ఆయన చెప్పారు. 1952 నుంచి ఇప్పటి వరకు 41 దేశాల అధ్యక్షులు కూడా ఇక్కడే ప్రసంగించారని ప్రధాని తెలిపారు. భారత రాష్ట్రపతులు సెంట్రల్ హాల్లో 86 ప్రసంగాలు చేశారు. పాత పార్లమెంటులో 4 వేల చట్టాలను ఆమోదించుకున్నామని మోదీ గుర్తుచేశారు. అనేక చట్టాలను ఉభయ సభల ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదింపజేసుకున్నట్టు పేర్కొన్నారు.
370 అధికరణ రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టాలు, తీవ్రవాద వ్యతిరేక చట్టాలు ఇక్కడే రూపొందాయంటూ పాత పార్లమెంటు విశేషాలను ప్రధాని మోదీ సభ్యులకు గుర్తుచేశారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాల వల్లే జమ్మూ కశ్మీర్ శాంతిపథంలో పయనిస్తోందన్నారు. మా ప్రభుత్వం తీసుకుంటోన్న కీలక నిర్ణయాలతో భారత్ పురోగమిస్తోందని ప్రకటించారు. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతంపాడి కొత్త చట్టాలకు ఆహ్వానం పలకాలని ప్రధాని పిలుపునిచ్చారు.