స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో ఏపీ సీఐడీ
చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు. ప్రాజెక్టు వందశాతం విజయవంతమైందన్న సుమన్
బోస్.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పారు. స్కిల్ కేసులో చంద్రబాబు
అరెస్టు అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ,
అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు సరైన విచారణ జరిపాక కేసు పెట్టాల్సి
ఉండగా, కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉందన్నారు.
ఒక్క శిక్షణా కేంద్రాన్ని
కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తేలుస్తారని దిల్లీలో నిర్వహించిన మీడియా
సమావేశంలో ప్రశ్నించారు. సీమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్ మధ్య ఒప్పందం ఉందని తెలిపిన
సుమన్ బోస్. అన్నీ విషయాలు అధ్యయనం చేసిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించినట్లు
తెలిపారు. ఒక సాఫ్ట్వేర్ పై యువతకి అవగాహన కల్పించినప్పుడు దానికి డిమాండ్
పెరుగుతుందన్నారు. మార్కెటింగ్ లో భాగంగానే 90: 10
ఒప్పందం జరిగిందని వివరించారు.
సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్ అని
ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా నిజమని చూపలేకపోయారన్నారు. ఇదే తరహా ప్రాజెక్టును
చాలా రాష్ట్రాల్లో అమలు చేశామన్నారు. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున అన్ని
విషయాలు అక్కడే వివరిస్తామన్నారు.
ఈ ప్రాజెక్టు
బిల్ట్- ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టామన్న సుమన్ బోస్, 2021లో
ప్రాజెక్టును శిక్షణ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. 2016లోనే
ఈ ప్రాజెక్టును కేంద్రం ప్రశంసించిందన్నారు. 2018లో ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకున్నానన్న
సుమన్ బోస్, తనపైనా ఇతరులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రాజెక్టులో అధికభాగం సీమెన్స్ సంస్థ నుంచి
డిస్కౌంట్స్ రూపంలోనే అందిందని, అలాంటప్పుడు అవినీతి ఎలా సాధ్యమైందని
ప్రశ్నించారు.