తిరుమల కాలినడక మార్గం సమీపంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మరో చిరుత కదలికలు ట్రాప్ కెమెరాల్లో చిక్కాయి. అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచార దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతల కదలికలు గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు కాలినడక మార్గానికి ఇరువైపులా అటవీ ప్రాంతంలో 200 ట్రాప్ కెమెరాలు అమర్చారు.
గత నెలలో నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితపై ఓ చిరుత దాడిచేసి చంపిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అటవీ శాఖ అధికారులు కాలినడక మార్గానికి ఇరువైపులా ట్రాప్ కెమెరాలతోపాటు, బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నాలుగు చిరుతలు చిక్కాయి. వాటిని తిరుపతి జూ పార్కుకు తరలించారు. తాజాగా ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత దృశ్యాలు రికార్డు కావడం నడకదారి భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.