కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో భాగంగా మరో ముందడుగు పడింది. గిరిజనుల్లో విద్యను పెంచేందుకు విజయనగరం జిల్లా మెంటాడ వద్ద ప్రతిష్ఠాత్మక గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో గిరిజన యూనివర్శిటీకి 561 ఎకరాలు కేటాయించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.834 కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించింది. విశాఖ, రాయగడ జాతీయ రహదారికి సమీపంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరం సిటీ, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్ల నుంచి ఈ విశ్వవిద్యాలయానికి సులువుగా చేరుకునే విధంగా స్థల ఎంపిక చేశారు. వసతుల కల్పనకు రూ.28 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు
గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, బయోటెక్నాలజీ, ట్రైబల్ స్టడీస్, జర్నలిజం, కెమిస్ట్రీ, ఎంబీఏ కోర్సులు ఉంటాయి. డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం, బి.కామ్ కోర్సులు అందిస్తారు. వీటికి అదనంగా స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్ కోర్సులు ఉంటాయి. ప్రత్యేకంగా గిరిజన తెగల సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ప్రోత్సహించే కోర్సులు అందిస్తారు. ఇప్పటికే ఆంధ్రా విశ్వవిద్యాలయం పీజీ భవనాల్లో గిరిజన యూనివర్సిటీ తరగతులు నిర్వహిస్తున్నారు.