Sunday, April 14, 2024

Logo
Loading...
upload upload upload

israel hamas war

గాజాలో కాల్పుల విరమణకు ఐరాస చొరవ : మద్దతు పలికిన భారత్

ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధంతో గాజా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యుద్ధం మొదలై ఆరు నెలలు గడచిపోయింది. ఈ కాలంలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో మానవతా సంక్షోభం నెలకొందని, దాన్ని అంగీకరించలేమని ఐరాస తెలిపింది. అక్కడ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలంటూ భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి భారత్ మద్దతు పలికింది. గాజాలో మానవతా సంక్షోభం ఇక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ తెలిపింది.గాజాలో సంక్షోభం కొనసాగడం ఏ మాత్రం క్షేమంకాదని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అభిప్రాయపడ్డారు. మశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల మధ్య నెలకొన్న యుద్ధం వల్ల సామాన్యులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.గాజాలో పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని కూడా భారత్ ఐరాసను కోరింది. పాలస్తీనా ప్రజలకు సురక్షితమైన ప్రాంతం సూచిస్తూ తీసుకునే పరిష్కార మార్గానికి భారత్ కట్టుబడి ఉందంటూ తెలిపింది. ఆ దిశగా అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంది. గాజాలో ఐరాస కాల్పుల విరమణకు 14 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా ఓటింగ్‌లో పాల్గొనలేదు.

K Venkateswara Rao | 11:28 AM, Tue Apr 09, 2024

ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడులు : పదుల సంఖ్యలో మృతులు!

ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత పెంచింది. లెబనాన్ భూభాగంపై శనివారం భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ సైనిక సలహాదారు సహా, పలువురు ఎంబసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది.


ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో ఇరాన్ ఎంబసీ భవనం కుప్పకూలిపోయింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు జనరల్ అలీ రెజా జెహ్ దీ చనిపోయారు. ఇతను సిరియా, లెబనాన్ దేశాల్లో ఖుడ్స్ దళాలకు నాయకత్వం వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దాడి తరవాత సిరియా ఆ ప్రాంతంలో సహాయ చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాదులకు సహాయం అందించే వారిపై మరిన్ని దాడులు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

K Venkateswara Rao | 09:32 AM, Tue Apr 02, 2024

లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి సిబ్బందికి గాయాలు

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తోన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఐరాసకు చెందిన ముగ్గురు సైనిక అధికారులు, ఓ అనువాదకుడు గాయపడ్డారు. వారికి సమీపంలో షెల్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐరాస అందించిన వివరాల ప్రకారం.లెబనాన్‌లో పరిశీలనకు వెళ్లిన ఐక్యరాజ్యసమితి బృందానికి సమీపంలో షెల్ పడిండి. అది పేలడంతో దాని ధాటికి మొత్తం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. అయితే ఐరాస వాదనలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.

K Venkateswara Rao | 10:11 AM, Sun Mar 31, 2024

క్షిపణిదాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం జరిగిన దాడిలో పొలంలో పనిచేస్తోన్న భారతీయుడు మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన పట్నిటిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు.


లెబనాన్ నుంచి జరిపిన క్షిపణిదాడిలో ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో పొలంలో పనిచేస్తోన్న వారు గాయపడ్డారని ఐడీఎఫ్ ప్రకటించింది. ఉగ్రదాడిలో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌ ఉన్నారు. గాయపడిన వారు కూడా భారతీయులే కావడం గమనార్హం.లెబనాన్ నుంచి హిజ్బొల్లా ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్ర ముఠా హమాస్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడికి దిగినప్పటి నుంచి హిజ్బొల్లా కూడా వారికి అనుకూలంగా దాడులకు దిగుతోంది.


గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, అప్పడప్పుడు లెబనాన్‌లో ఉగ్రశిబిరాలపై కూడా దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 229 మంది మరణించారని హిజ్బోల్లా ప్రకటించింది.

K Venkateswara Rao | 09:57 AM, Tue Mar 05, 2024

గాజాలో ఆహార సంక్షోభం : ఆదుకునేందుకు ముందుకు వచ్చిన అమెరికా

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆహారం కోసం గుంపులుగా పోగైన జనాలపై ఐడీఎఫ్ బాంబు దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు రోజుకు 500 ట్రక్కుల ఆహారం కావాల్సి ఉండగా, కేవలం 97 ట్రక్కులు మాత్రమే దేశంలోని ప్రవేశిస్తున్నాయని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు అమెరికా సిద్దంగా ఉన్నట్లు బైడెన్ ప్రకటించారు. హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జారవిడుస్తామని ఆయన ప్రకటించారు. గాజా ప్రజలకు మానవతా సాయం అవసరం ఉందని, అది అందించేందుకు అమెరికా సిద్దంగా ఉందని బైడెన్ స్పష్టం చేశారు.గాజాలో మానవతా సాయం పెరగాలంటే ఈజిప్టు సరిహద్దు రఫా చెక్‌పోస్ట్ తెరుచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గాజాలో చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రోజుల తరబడి అక్కడి ప్రజలు పస్తులుంటున్నారని ఐరాస తెలిపింది. ఆకలి తట్టుకోలేక పశువుల దాణాను ఆహారంగా తీసుకుంటున్నారని ఐరాస వెల్లడించింది.


K Venkateswara Rao | 12:43 PM, Sat Mar 02, 2024

ఆరువారాల కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య ఆరు వారాల కాల్పుల విరమణకు పారిస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి.కాల్పుల విరమణపై ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 300 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా, 40 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.పారిస్‌లో జరిగిన చర్చలపై వార్ కేబినెట్‌లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ రాయబారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ చేస్తోంది నరమేధమంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వ తీవ్ర విమర్శలు చేశారు. చిన్నారులను,మహిళలను దారుణంగా హతమారుస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ నరమేధానికి తలపడతోందంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌లో 3500 ఇళ్లు నిర్మిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలను తప్పుపట్టారు.

K Venkateswara Rao | 09:55 AM, Sun Feb 25, 2024

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అగ్రనేత కుమారుడి మృతి

హమాస్ ఉగ్రవాదులు కాల్పుల విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే చనిపోయినట్లు స్థానిక వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణ గాజాలో శనివారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో హజెం హనియో చనిపోయినట్లు భావిస్తున్నారు.గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించిన కాసేపటికే దాడులు మొదలయ్యాయి. ఆ తరవాత లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు.
తాజాగా ఇజ్రాయెల్ రఫాపై చేస్తున్న దాడులను పలు దేశాలు ఖండించాయి. రాఫాను ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోందంటూ అమెరికా ఆరోపించింది. గాజాలోని సగం జనాభా రఫాలో నివశిస్తోంది. ఇలాగే దాడులు కొనసాగిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

K Venkateswara Rao | 11:34 AM, Sun Feb 11, 2024

మరోసారి హౌతీల క్షిపణి దాడులు

ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లతో వెళుతోన్న రవాణా నౌకలపై హౌతీలు (houthi rebels attak) దాడులకు దిగారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో బ్రిటన్‌కు చెందిన మార్లిన్ లాండ నౌకలో మంటలు చెలరేగాయి. నౌకా సిబ్బంది వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది సురక్షితంగా బయటపడ్డట్లు నౌక ఆపరేటర్ సంస్థ ట్రాఫిగురా ప్రకటించింది.

ఎడెన్‌కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. హౌతీల దాడి విషయం తెలియగానే యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. హౌతీలు మరిన్ని దాడులకు తెగబడే ప్రమాద ముందని బ్రిటన్ హెచ్చరించింది. ఎర్ర సముద్రంలో వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణిని బ్రిటన్ యుద్ధనౌక కూల్చివేసింది. ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ ఈ దాడులకు దిగుతున్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీల దాడులపై అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. అయినా హౌతీలు వెనకడుతు వేయడం లేదు.

K Venkateswara Rao | 10:16 AM, Sat Jan 27, 2024

సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ భీకరదాడులు

పశ్చిమాసియా ఇజ్రాయెల్ దాడులతో వేడెక్కింది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గాజాలో భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్ (israel airstrikes) తాజాగా, పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లపై కూడా విరుచుకుపడింది.తాజా దాడుల్లో ఇరాన్‌కు చెందిన సైనిక సలహాదారులు, హెజ్‌బొల్లా కమాండర్లను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ భవనంపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు కీలక సలహాదారులు చనిపోయినట్లు తెలుస్తోంది.

డమాస్కస్‌లోని ఓ భవనంలో ఇరాన్ సైనికాధికారుల సమావేశం జరుగుతోందనే పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారిలో ఐదుగురు ఇరాన్ సైనిక సలహాదారులు, ఒకరు సిరియాకు చెందిన సైనిక కమాండర్ చనిపోయినట్లు సమాచారం అందుతోంది. చనిపోయిన వారిలో ఇరాన్
సైనిక సలహాదారుడు జనరల్ సాడెగ్ ఒమిద్ జాదే చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతానికి అతి సమీపంలోనే ఇరాన్, లెబనాన్ ఎంబసీలు కూడా ఉన్నాయి.

K Venkateswara Rao | 10:01 AM, Sun Jan 21, 2024
upload
upload