భారత్ బంగ్లాదేశ్ బంధం మరింత బలపడింది. మూడు కీలక ప్రాజెక్టులను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అకవురా అగర్తలా క్రాస్ బోర్డర్ రైల్ లింక్, ఖుల్నా మోంగ్లా పోర్ట్ రైల్ లైన్, మైత్రీ సూపర్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్‌ను ఇరువురు నేతలు ప్రారంభించారు.
మూడు కీలక ప్రాజెక్టులు ప్రారంభించడం ద్వారా బంగ్లా భారత్ మధ్య స్నేహబంధం మరింత బలపడుతుందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాల మధ్య బంధం బలపడేలా మీరు చూపిన నిబద్దతకు ధన్యవాదాలంటూ బంగ్లా ప్రధాని హసీనా ఆనందం వ్యక్తం చేశారు.
ఖుల్నా మోంగ్లా పోర్ట్ రైల్ లింకు ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం రూ.388 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 65 కి.మీ. బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మించారు. ఖుల్నా
బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద ఓడరేవు. ఈ రేవుకు రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును బంగ్లాదేశ్, భారత్ సంయుక్తంగా చేపట్టాయి. రూ.13వేల కోట్ల ఖర్చుతో 1320 మెగావాట్ల ఈ థర్మల్ పవర్ ప్లాంటు ద్వారా వచ్చే విద్యుత్‌ను భారత్, బంగ్లా చెరిసగం ఉపయోగించుకోనున్నాయి. భారత ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ ఈ ప్రాజెక్టు చేపట్టింది.
మూడు కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంపై బంగ్లా ప్రధాని హసీనా…ప్రధాని మోదీకి ధన్యావాదాలు తెలిపారు. బంగ్లా ప్రధాని హసీనా భారత ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.