Sunday, April 14, 2024

Logo
Loading...
google-add

తెల్లవారేవరకూ బీజేపీ సమావేశం, నేడు వందమంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశం

P Phaneendra | 11:24 AM, Fri Mar 01, 2024

BJP likely to announce 100 candidates for LS elections 2024

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సుమారు వంద మంది అభ్యర్ధుల పేర్లను ఇవాళ ప్రకటించే అవకాశముంది. నిన్న గురువారం రాత్రి 11గంటలకు ప్రారంభమైన బీజేపీ అగ్రనేతల సమావేశం ఇవాళ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ కొనసాగింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... బీజేపీ సిట్టింగ్ ఎంపీల గురించి క్షేత్రస్థాయి కార్యకర్తలు, నియోజకవర్గ ఓటర్లతో సైతం చర్చించి అభ్యర్ధులను ఖరారు చేయాలని భావిస్తోంది. అవసరమైన చోట అభ్యర్ధులను వ్యూహాత్మకంగా మార్చడానికి సైతం వెనుకడుగు వేయడం లేదు. ప్రజావ్యతిరేకతకు ఎలాంటి అవకాశమూ లేకుండా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్ధులను ఖరారు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది.  

ఎన్నికల కమిషన్, 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయడం కంటె ముందే కొంతమంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించివేయాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. ఎన్‌డీయే మిత్రపక్షాల అభ్యర్ధులను కాకుండా, బీజేపీ అభ్యర్ధులను మాత్రమే ప్రస్తుతానికి ప్రకటించాలని బీజేపీ యోచిస్తోందట. దానివల్ల, ప్రత్యర్ధి కూటమి అయిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి కంటె ఒక అడుగు ముందే ఉండాలని కమలదళం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండీ కూటమిలో ఇంకా సీట్లు పంచుకునే విషయం ఇంకా తేలలేదు. వారికంటె ముందుగానే తమ అభ్యర్ధులను ఖరారు చేయడం ద్వారా ఒక అడుగు ముందుండాలని బీజేపీ భావిస్తోందని సమాచారం.

గతరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ప్రధానంగా హిందీబెల్ట్ రాష్ట్రాల్లో అభ్యర్ధుల అంశంపైనే ప్రధానంగా బీజేపీ చర్చించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్. రాజస్థాన్‌లతో పాటు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ అభ్యర్ధులపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అలాగే దక్షిణాదిలో ఉనికి కోసం బీజేపీ శ్రమిస్తున్న కేరళ, తెలంగాణ రాష్ట్రాల పైనా దృష్టి సారించినట్లు సమాచారం.  

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయం పెండింగ్‌లో ఉన్నందున అక్కడ అభ్యర్ధుల విషయాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలతో సంబంధాలను పునరుద్ధరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు ఉన్నా, ఆ పార్టీ తెలుగుదేశంతో కలిసిరావాలని కోరుతోంది. మరోవైపు అధికార వైఎస్సార్‌సీపీతో కూడా పెద్ద విభేదాలేమీ లేవు. అందువల్ల ఆంధ్రాలో బీజేపీ ఎటువైపు అడుగు వేస్తుందన్న విషయం ఆసక్తికరంగా నిలిచింది.

ఇవాళ మధ్యాహ్నం తర్వాతే జాబితా విడుదల ఉండవచ్చు. నరేంద్ర మోదీ వారణాసి నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మోదీ 2014లో 3.7లక్షల మెజారిటీతోను, 2019లో 4.8లక్షల ఓట్ల మెజారిటీతోనూ గెలిచారు. మోదీని అడ్డుకోడానికి వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రియాంకాగాంధీ వాద్రాను మోహరిస్తుందన్న ఊహాగానాలున్నాయి. పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆఢ్వాణీ, వాజ్‌పేయీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి అమిత్ షా 2019 ఎన్నికల్లో పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్ధి చతురాయిన్ చావ్డా మీద 5న్నర లక్షల ఓట్లతో విజయం సాధించారు.

ఇంకా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి, పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మధ్యప్రదేశ్‌లోని గుణ-శివపురి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లక్నో బీజేపీ కంచుకోట. వాజ్‌పేయీ 1991 నుంచి 2004 వరకూ అక్కడినుంచి పోటీచేసి విజయం సాధించారు, ఆయన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో నుంచి గెలిచారు. ఇంక గుణ స్థానం సిందియా కుటుంబానికి అంకితమైపోయిన స్థానం. 1952లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ మొత్తం 14 సార్లూ సిందియా రాజకుటుంబమే ఆ స్థానంలో విజయం సాధిస్తోంది. జ్యోతిరాదిత్య సిందియా 2002లోను, 2014లోనూ గుణ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచి గెలిచారు. అయితే బీజేపీలోకి మారిన తర్వాత ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2019లో గుణలో బీజేపీ అభ్యర్ధి కృష్ణపాల్ యాదవ్ గెలిచారు.

బీజేపీ మొదటి జాబితాలో ఉండే అవకాశమున్న పేర్లు ఇలా ఉన్నాయి.... అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేయవచ్చు.అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుంది, 3 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నిన్ననే వెల్లడించారు. అక్కడ అసోం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అనే రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఈసారి భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఆ సీటును మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇస్తారని సమాచారం. అయితే చౌహాన్, తన సొంత జిల్లాలోని విదిశ స్థానం ఆశిస్తున్నారు. అక్కడినుంచి ఆయన ఐదుసార్లు గెలిచారు. అలాగే, విదిశలో గెలుపు బీజేపీకి నల్లేరు మీద బండి నడకే. అక్కడ 1989 నుంచి బీజేపీయే గెలుస్తోంది.

నిన్నటి సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాల గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో అప్నాదళ్, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే, మార్చి 10లోగా కనీసం 50శాతం స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add