Friday, March 01, 2024

Logo
Loading...
google-add

పీఠాధిపతి కాబోయి ప్రధాని అయిన నిష్కామ కర్మయోగి

P Phaneendra | 16:30 PM, Fri Feb 09, 2024

Wanted to be a Seer, turned out to be a Prime Minister

ఆర్థికంగా అత్యంత సంక్షుభిత కాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిని అధిరోహించి దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించినవాడు, దేశ గతిని సమూలంగా మార్చేసి ఆధునిక భారతదేశపు ప్రగతిని పరుగులు తీయించినవాడు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంతో మొదలుపెట్టి ఆర్థిక స్వాతంత్ర్యం తేవడం వరకూ దేశమాత సేవలో అహరహం శ్రమించినవాడు.... మన తెలుగుబిడ్డ పాములపర్తి వేంకట నరసింహారావు. ఆయనను వరించి, భారతరత్న తన కీర్తికి కొత్త వన్నెలద్దుకుంది.

తెలంగాణ వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు నరసింహారావు జన్మించారు. ప్రాథమిక విద్య ప్రారంభించిన కొన్నాళ్ళకే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. తెలంగాణలోని నిజాము పాలనను వ్యతిరేకిస్తూ 1938లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరారు. వందేమాతరం గీతాలాపన చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరిస్తే నాగపూర్ వెళ్ళి అక్కడి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తిచేసారు. అటు భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ, ఇటు హైదరాబాదు విమోచన పోరాటంలోనూ పాల్గొన్నారు. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావులు పీవీకి రాజకీయ గురువులు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడయ్యారు.

పీవీ నరసింహారావు ప్రతిభ అనన్యసామాన్యం. ఆయన 17 భాషలలో పండితుడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలు సైతం నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా జీవితం మొదలుపెట్టిన పీవీ, సాహిత్యరంగంలో ఎనలేని కృషి చేసారు. కథలు, కవితలతో పాటు అదే సమయంలో రాజకీయ వ్యాసాలు రాసారు. జ్ఞానపీఠ పురస్కారం గెలుచుకున్న విశ్వనాథ సత్యనారాయణ గారి రచన ‘వేయిపడగలు’ను హిందీలోకి ‘సహస్రఫణ్’గా అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్నారు.

రాజకీయాల్లో పీవీ ప్రస్థానం విశిష్టమైనది. 1957లో మంథని నియోజకవర్గం నుంచి ఎన్నికవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాలుగుసార్లు వరుసగా అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 1962లో మొదటిసారి మంత్రిపదవి చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 1971లో ముఖ్యమంత్రి పదవి ఆయనను వరించింది. అయితే జై ఆంధ్ర ఉద్యమం తర్వాత 1973లో రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఆయన ముఖ్యమంత్రిత్వం ముగిసింది. 1977వరకూ పీవీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్నారు. 1977లో లోక్‌సభకు ఎన్నికైనప్పటినుంచీ పీవీ కార్యరంగం ఢిల్లీకి మారింది. 1980 నుంచి 1989 మధ్యకాలంలో కేంద్రంలో హోం శాఖ, విదేశాంగ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేసారు.

పీవీ ప్రధానమంత్రి అవడం విచిత్రంగా జరిగింది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకునే ఉద్దేశంతో ఆయన 1991 ఎన్నికల్లో అసలు పోటీయే చేయలేదు. కుర్తాళం పీఠాధిపతిగా సన్యాసాశ్రమం స్వీకరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతర పరిస్థితుల్లో ఆయన తిరిగి వెనక్కి రావలసి వచ్చింది. అప్పటికి కాంగ్రెస్‌లో అందరూ ప్రధానమంత్రి పదవిని కోరుకునేవారే. ఏ గ్రూపుకూ చెందని పీవీ అందరికీ కావలసిన వాడయ్యాడు. మెతక మనిషిగా కనిపించే పీవీని తోలుబొమ్మలా ఆడించవచ్చని అప్పటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది. ఓ పక్క కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. దాంతో రాజకీయంగా సంక్లిష్టమైన పరిస్థితి. మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితి అప్పటికి ఛిన్నాభిన్నమైపోయింది. అలాంటి సమయంలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి, దక్షిణభారతం నుంచి మొట్టమొదటిసారి ప్రధాని అయ్యారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకూ ఐదేళ్ళ పూర్తికాలం ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసారు.

మూత లేని పీతల పీపా లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులందరూ వెనక్కి లాగాలని ప్రయత్నిస్తుంటే వారందరికీ అందనంత ఎత్తులో నిలిచి, ఎవరి రాజకీయాలకూ అందని వ్యూహాలతో తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ దిశను ఒక్క కుదుపుతో ఉదారవాదం వైపు మార్చి పట్టాలమీదకెక్కించిన ఘనుడు పాములపర్తి వేంకట నరసింహారావు.

అయోధ్య రామజన్మభూమి విషయంలో మాత్రం పీవీ నరసింహారావు పాత్ర విమర్శనీయమైనది. ‘రాముడేమైనా బీజేపీ సొంతమా’ అని ఒకపక్క అంటూనే, ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్’ తీసుకొచ్చి ముస్లిములు ధ్వంసం చేసిన ఆలయాలను మళ్ళీ అడగకూడదంటూ చట్టం చేసిన ఘనత ఆయన సొంతం. వివాదాస్పద కట్టడం కూల్చివేత ఆయన హయాంలోనే జరిగింది. ఆజన్మాంతం కరడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా ఉన్న ఆయనమీద సొంత పార్టీ వారే ఆ సమయంలో నిందలు వేసారు. పీవీ ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద కట్టడం కూల్చివేత సమయంలో నిదానంగా, మౌనంగా ఉండిపోయారని విమర్శించారు. అలా... ప్రతిపక్షం నుంచే కాదు, తన పక్షం నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి పీవీ నరసింహారావు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా సొంత వెన్నెముకతో నిలబడడమే ఆయన చేసిన పాపం. సోనియాగాంధీకి లొంగి ఉండలేదన్న కారణంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎంతగా అవమానించాలో అంతగా అవమానించింది. 2004 డిసెంబర్ 23న పీవీ మరణించినప్పుడు కేంద్రంలో యూపీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ, ఆయన అంత్యక్రియలు దేశ రాజధానిలో జరగనివ్వలేదు. ఢిల్లీలో సమాధి, స్మృతి మందిరం లేని ఏకైక ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. అంతేకాదు, ఆయన జీవితాంతం సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి సైతం ఆయన పార్థివదేహాన్ని తీసుకెళ్ళనీయలేదు. పీవీ మృతదేహాన్ని నేరుగా హైదరాబాద్ పంపించేసారు. అక్కడ శవదహనం సైతం సరిగ్గా జరగలేదు. ఓ గొప్ప రాజనీతిజ్ఞుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివాళి అది.

పీవీ నరసింహారావుకు, భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీకి ఉన్న స్నేహం అపురూపమైనది. ఒకరి కవితలు ఒకరికి అంకితం ఇచ్చుకున్నారు. సాహిత్యంలో, రాజకీయాల్లో అత్యుత్తమ మైత్రికి వారు నిదర్శనంగా నిలిచారు. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశంపై భారత్ తరఫున మాట్లాడడానికి ప్రధాని పీవీ పంపించినది వాజ్‌పేయీనే. పార్టీలకు అతీతమైన అపురూపమైన వ్యక్తిత్వం ఆయనది. అందుకే ఆయనను నరేంద్రమోదీ ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించుకుంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add