Friday, March 01, 2024

Logo
Loading...
google-add

ఏకాత్మతా మానవతావాద ప్రబోధకుడు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ

P Phaneendra | 10:00 AM, Sun Feb 11, 2024

Philosopher of Integral Humanism Pandit Deendayal Upadhyaya

(నేడు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి)

పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ సూత్రీకరించిన ఏకాత్మతా మానవతావాదాన్ని 1965లో భారతీయ జనసంఘ్ తన అధికారిక సిద్ధాంతంగా స్వీకరించింది. దాన్నే భారతీయ జనతా పార్టీ కూడా స్వీకరించింది. ఏకాత్మతా మానవతా వాదం స్థూలంగా భారతీయ సమాజంలోని అన్ని వర్గాలనూ లక్షించిన సిద్ధాంతం. దీనదయాళ్ జీ ఈ సిద్ధాంతం ద్వారా మానవుడు కేంద్రంగా దేశీయ ఆర్థిక నమూనాని ప్రతిపాదించారు.

ఏకాత్మతా మానవతావాదం లక్షణాలను గమనిస్తే ఇది పాశ్చాత్యుల వైయక్తిక పెట్టుబడిదారీ విధానం, మార్క్సిస్టుల సామ్యవాదం రెండింటినీ వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో పాశ్చాత్యుల శాస్త్రీయ భావనను స్వాగతిస్తుంది. ఇది పెట్టుబడిదారీ విధానానికీ, సామ్యవాదానికీ మధ్యేమార్గమైన విధానాన్ని సూచిస్తుంది. ఆ రెండు పద్ధతులలోని అనుసరణీయ విషయాలను ఆమోదిస్తూనే, వాటిలోని విపరీత విషయాలను వ్యతిరేకిస్తుంది.

ఏకాత్మతా మానవతావాదం లక్ష్యాలు ప్రధానంగా నాలుగు. మానవాళి ముఖ్యంగా శరీరము, మనసు, మేధస్సు, ఆత్మ అనే నాలుగు లక్షణాల్లో వ్యవస్థీకృతమై ఉంటుంది. ఆ నాలుగు లక్షణాలూ నాలుగు సార్వత్రిక లక్ష్యాలకు సంబంధించినవి. అవే కామము, అర్థము, ధర్మము, మోక్షము. ఇవి నాలుగూ ప్రధానమే అయినప్పటికీ, సమాజానికీ మానవాళికీ ప్రాథమిక లక్ష్యం ధర్మం కాగా, అత్యుత్తమమూ పరమమూ అయిన లక్ష్యం మోక్షం.

దీనదయాళ్ జీ ఇతర భావజాలాలను తిరస్కరించడానికి ప్రధాన కారణం ఈ లక్ష్యాలే. పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం... ఈ రెండింటితోనూ సమస్య ఏంటంటే అవి కేవలం శారీరక, మానసిక అవసరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి వస్తుగత లక్ష్యాలైన కోరిక, సంపద పైన మాత్రమే ఆధారపడి ఉంటాయి.

వైయక్తిక లేదా వ్యష్టివాదం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది. సమష్టివాదాన్ని లేదా వ్యవస్థ నియంత్రణనూ ఒప్పుకోదు. అలాంటి వైయక్తిక వాదాన్ని అనుసరించే సామాజిక వ్యవస్థను దీనదయాళ్ జీ తిరస్కరించారు. అదే సమయంలో వైయక్తికవాదాన్ని ‘హృదయం లేని పెద్ద యంత్రం’లా భావించి దాన్ని అణచివేసే కమ్యూనిజాన్ని కూడా ఆయన త్రోసిపుచ్చారు.

ఉపాధ్యాయ ప్రకారం, సంఘం అనేది వ్యక్తుల మధ్య ఒక సామాజిక ఒడంబడిక మాత్రమే కాదు. దాని పుట్టుక ప్రాథమిక దశ నుంచే సహజమైనదీ, సజీవమైనదీ కూడా. దానికి కచ్చితమైన ‘జాతీయ ఆత్మ’ లేదా ‘నైతికత’ అనేది ఉంది. వైయక్తిక అవసరాలకు సమాంతరంగా ఈ సంఘవ్యవస్థకు కూడా తనవైన అవసరాలు ఉన్నాయి... అని దీనదయాళ్ జీ సూత్రీకరించారు.  

ఏకాత్మతా మానవతావాదానికి ఆధారం ఏమిటి? భారతీయమైన ఈ సిద్ధాంతానికి ఆధారం ఆదిశంకరులు ప్రబోధించిన అద్వైత సిద్ధాంత సంప్రదాయమని దీనదయాళ్ జీ స్పష్టం చేసారు.

అద్వైతం ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులనూ ఏకీకరిస్తుంది. మానవాళి కూడా ఈ విశ్వంలోని భాగమే కదా. అందువల్ల మానవాళి కూడాని కూడా అద్వైతం ఏకీకరిస్తుంది. ఇది భారతీయ సంస్కృతి సారం, ఈ ప్రపంచానికి భారతీయత అందించిన గొప్ప కానుక అని వివరించారు.

ఏకాత్మతా మానవతావాదం దాదాపు గాంధీ సిద్ధాంతంలాగే ఉంటుంది. భవిష్య భారతానికి గాంధీ దర్శనం, దీనదయాళ్ జీ సూత్రీకరించిన ఏకాత్మతా మానవతావాదం అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటాయి.

ఆ రెండూ భారతదేశానికి ఒక విస్పష్టమైన మార్గాన్ని ఆశించాయి. రెండూ కూడా సామ్యవాదంలోనూ, పెట్టుబడిదారీ విధానంలోనూ ఉండే భౌతికవాదాన్ని తిరస్కరించాయి. ఆధునిక సమాజంలోని వ్యష్టివాదాన్ని వ్యతిరేకించాయి. పరిపూర్ణమైన, వర్ణ ధర్మ ఆధారితమైన సమాజాన్ని ఆహ్వానించాయి. రాజకీయాల్లో ధార్మిక, నైతిక విలువలను సమ్మిళితం చేయాల్సిందేనని ఈ రెండు సిద్ధాంతాలూ స్పష్టం చేసాయి. హైందవ విలువలను కొనసాగిచే అచ్చమైన సాంస్కృతిక నమూనాలో ఉండే ఆధునికతను కోరుకున్నాయి. 

ఏకాత్మతా మానవతావాదంలోని దార్శనికతలో రెండు ప్రధానమైన అంశాలున్నాయి. రాజకీయాలలో నైతికత, స్వదేశీ విధానం ఒకటి కాగా, ఆర్థిక వ్యవస్థలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం రెండవది. గాంధీ సిద్ధాంతంలోనూ ఇవి ముఖ్యమైన అంశాలు. అదే సమయంలో ఇవి రెండూ హిందూ జాతీయ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ అంశాలు సమరసత, సాంస్కృతికజాతీయ విలువలు, క్రమశిక్షణ అనే అంశాల చుట్టూ అల్లుకుని ఉంటాయి.

దీనదయాళ్ జీ ప్రతిపాదించిన ఏకాత్మతా మానవతావాదం నెహ్రూ ఆర్థిక విధానాలను పూర్తిగా తిరస్కరించింది. భారతదేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, పాశ్చాత్యుల పారిశ్రామికీకరణను, దానిమీద ఆధారపడిన ఆర్థిక విధానాలనూ ఎంతమాత్రం విమర్శనాత్మక అధ్యయనం చేయకుండా గుడ్డిగా ఎత్తుకొచ్చి యథాతథంగా అనుసరించిన నెహ్రూ ఆర్థిక విధానాలను ఉపాధ్యాయ అంగీకరించలేదు. సుసంపన్నమైన మన దేశ సాంస్కృతిక వారసత్వం, ఈ సమాజపు చలనశీల స్వభావాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ, పాశ్చాత్య ఆలోచనా ధోరణుల మధ్య సంతులనం సాధించాల్సిన అవసరం ఉందన్నది దీనదయాళ్ జీ ఆలోచన.

నెహ్రూ నమూనా ఆర్థికాభివృద్ధి విపరీతమైన పారిశ్రామికీకరణ ద్వారా భౌతిక సంపదను పెంచుకోవడం పైనే దృష్టి మొత్తం కేంద్రీకరించి భారతీయ సమాజంలో వినియోగ మనస్తత్వాన్ని పెంచి పోషించింది. ఆ విధానం మనదేశంలో సామాజిక అంతరాలను సృష్టించింది, ఆర్థికాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలను పెంచింది, చివరికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో పూర్తిగా విఫలమైంది.

దీనదయాళ్ జీ సూత్రీకరించిన ఏకాత్మతా మానవతావాదం, గాంధేయవాదం వలెనే, భారతీయ సంస్కృతికి ఏమాత్రం సంబంధం లేని వినియోగదారు విధానాన్ని వ్యతిరేకించింది. సమాజంలోని వ్యక్తులు భౌతిక సంపదల మోహంలో పడి కొట్టుకుపోకుండా, కోరికలను నియంత్రించుకోవాలని, సంతృప్తితో జీవించాలనీ మన భారతీయ సంప్రదాయ సాంస్కృతిక పద్ధతి చెబుతుంది. అదే అనుసరణీయమని గాంధేయవాదం, ఏకాత్మతా మానవతా వాదం సమర్థించాయి.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add