Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

కర్ణాటక సంగీతపు అస్తిత్వంపై దాడికి సంగీతకళానిధి

P Phaneendra | 14:32 PM, Sun Mar 24, 2024

Award for attack on the identity of Carnatic Classical Music

**********************

వ్యాసకర్త : పరిమి శ్రీరామనాథ్

**********************

కర్ణాటక సంగీత ప్రపంచంలో గత కొన్ని రోజులుగాచోటు చేసుకుంటున్న పరిణామాలను గురించి ఆలోచిస్తున్నపుడు నాకు 2007 లో ప్రఖ్యాత ఆంగ్లనటుడు Danzel Washington తన ఒక సినిమాప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తలపుకు వచ్చింది.

ప్రశ్న చాలా జటిలమైనది - మీ ఈ సినిమాకు ఒక నలుపు జాతీయుడైన దర్శకుడి అవసరం ఎందుకు వచ్చింది?శ్వేతజాతికి చెందిన దర్శకుడు సినిమాను తీయలేడా అని. దానికి అతను ఠక్కున చెప్పిన సమాధానం - తేడా రంగులో లేదు, సంస్కృతిలో ఉంది అని. ఆదివారం పూట, ఉదయాన్నే ఒక వెచ్చని దువ్వెన చిక్కుబడ్డ జుట్టును తాకుతున్నపుడు వచ్చే వాసన ఒకనలుపురంగుగల వ్యక్తికి అనుభూతమౌతుంది తప్ప, అందరికీ కాదు. అక్కడ ఆ సంప్రదాయాన్ని, సంస్కృతినీ పాటించడం ప్రధానమైన తేడా అని చాలా చక్కగా వింగడించాడతడు.

ఆంగ్లంలో నేడు చాలా అభివృద్ధి చెందిన Rap సంగీతాన్ని ప్రధానంగా నలుపు జాతివారు ప్రభావితం చేస్తూ వచ్చారు. ఇది బహిరంగంగా వారు చెప్పుకుంటారు కూడా. 50 cents, Tupac, Snoop Dog తదితరులైన గొప్పగొప్ప rap సంగీతకారులందరూ ఒక సంప్రదాయాన్ని తయారు చేశారు. వారు ఎన్నుకునే వస్తువులలో, పదాలలో, సంగీతాన్ని ప్రదర్శించే తీరులో ఒక పద్ధతిని గుర్తుపట్టవచ్చు. ప్రధానంగా లౌకికమైన సంగీతం ఇది. డ్రగ్స్ బారిన పడడమూ, దానినుండి వెలికి రావడమూ, పేదరికమూ, వివక్ష, లౌకికసంబంధమైన కనీస అవసరాలు కూడా తీరని తనమూ ఇత్యాదుల నుండి వారిలో పుట్టిన ఒక కేక ఫలితంగా వారి అన్ని గీతాల్లోనూ సంపన్నమైన కార్లు, ఖరీదైన ఆభరణాలూ, డబ్బూ ఇత్యాదులను ప్రదర్శించడం, అందమైన అమ్మాయిలను దక్కించుకోవడం కోసం వారిని ఆకట్టుకునే విధంగా మాటలుండడం, సుఖాలను తీర్చుకోవడం ఇత్యాదులు ఎక్కువగా కనబడుతాయి. అసభ్యపదాలు, ఏ కంచె లేనటువంటి మకిలి పట్టినవస్తువునైనా వర్ణించే ఒక ధోరణి ఇది. Eminem వంటి ఒక శ్వేతజాతీయుడు Rap లో తన ప్రభావాన్ని చూపించినా, కేవలం ప్రతిభను మాత్రమే కనబరుస్తూ వచ్చాడు తప్ప, బ్లాక్ సంగీతకారులను, వారి జీవన విధానాన్నీ తక్కువ చేసే విధంగా ఏనాడు ప్రయత్నించలేదు.

సంగీతంలో రెండు ప్రవాహాలు సమాంతరంగా ప్రవహిస్తుంటాయి. వినేవాడికి ఇంపుకలిగించే లాక్షణికాంశాల ఒడుపు ఒక ప్రవాహం. ఇది అందరికీ ఒకలాగే ఉంటుంది. స్వరాలు, స్కేళ్ళు ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఒకటే. కానీ ఒక సంప్రదాయంలేదా ఒక ధోరణి తయారు కావాలంటే, లాక్షణిక జ్ఞానం ఒకటే సరిపోదు. రెండవది సంస్కృతి. Rap సంగీతంతో ఏ మతపెద్ద రచించిన ఆధ్యాత్మిక గ్రంథంలోని మాటలనో ఒక పాటగా తీసుకువస్తే ఏమిటి ఇబ్బంది అంటే, ఒకటి, ఆధ్యాత్మిక గ్రంథపుటాదర్శం చెడిపోతుంది: లౌకికతను నిగ్రహించి వేరే తలం వైపు ప్రయాణించమని చెప్పడం దాని ఉద్దేశం కనుక. రెండు, Rap ఆదర్శమూ చెడిపోతుంది: ఇప్పుడు అది ఒక ఉప్పెనలా రేకెత్తిస్తున్న లౌకిక లైంగిక భావాల శక్తిని చప్పన చేసుకోవలసి వస్తుంది కనుక. ఇది ఉదారతకో, లేదా సంగీత సమానతకో చెందిన ప్రశ్న కాదు: ఆ సంగీతం చూపే ప్రభావానికి, ఏర్పరిచే మానసిక వికారానికి చెందిన ప్రశ్న.

ఇప్పటికే ప్రసిద్ధి చెందిన మెలొడీ పాటలను కొందరు remix చేయడం మనం గమనిస్తాం. సినిమాల్లో వీటిపై హాస్యరసాన్ని పండించడానికి ప్రయత్నించారు కూడా. ఏమిటి ఇక్కడ జరిగేది అంటే, yo yo వంటి పదాలను చొప్పించడం, ఆ ధోరణిగా ఒక beatను కలపడం; బరువు తీసుకువద్దామనే ఉద్దేశంతో కొందరు f, b అక్షరాలతో మొదలైయ్యే అసభ్య పదాలను చేర్చడం. ఇలా తయారైన ఒక పాటను విన్నపుడు కాసేపు నవ్వు వస్తుంది. కానీ, మెలోడీని ఇష్టపడే వాడు పూర్తిగా ఈ పాటను పెదవి విరవకుండా ప్రేమించలేడు. పాశ్చాత్య సంగీతప్రేమికి కూడా మెలొడీలోని ధోరణి పంటి కింద రాయిలా అడ్డు తగులుతూనే ఉండి, ఒక పూర్తి Rap నో hiphop నో అనుభవించినంత ఆనందాన్ని ఇవ్వలేదు.

నేటి కాలంలో ప్రసిద్ధి చెందిన పాశ్చాత్య సంగీతకళాకారుల వేదన ప్రధానంగా లౌకిక స్వేచ్ఛ.లైంగికపరమైన స్వేచ్ఛ, ధనం ద్వారా పేదరికం నుండి, కష్టాల నుండి స్వేచ్ఛ. ఏది కోరుకుంటే అది చేయగలిగే ఒక మానసిక స్వతంత్రత. ఈ భావాలే వారి మాటలుగా, వాయిద్య సంపుటులుగా, పాటను చిత్రించేటప్పటి themes గా వ్యక్తమౌతున్నాయి.

ఇలా ఆలోచిస్తే మనకు తెలిసే సంగతి ఏమిటంటే, కర్ణాటక శాస్త్రీయ సంగీతం పూసింది ఒక ‘‘జీవుడి వేదన’’ అనే మొక్కకు. సుఖము, దుఃఖము, ఆశ-నిరాశ; ఆనందం- బాధ వంటి జతలతో ఇబ్బందిపడిన ఒక జీవుడైన మనిషి యొక్కమనస్సు వాటికతీతమై తనకు జన్మనిచ్చి, తనను పోషిస్తూ తనను లయం చేసుకోబోయే తన దేవతముందరశరణాగతి బుద్ధితో తన సర్వస్వాన్నీ పణంగా పెట్టి, ఈ లంపటచక్రం నుండి తనను వేరు చేయమనీ, చేసి భగవత్ శాశ్వతానంద సామ్రాజ్యంలో తనను కలుపుకొమ్మనీ ఒక బలమైన కోరికతో గొంతువిప్పి పాడిన పాటలతో ఏర్పడ్డ తోట ఇది. ఇదే దాని రుచి. దాని శరీరం. దాని ప్రాణం, దాని ఆత్మ; దాని పర్పస్. ఇది గానాబజానా కాదు. గానయోగము. సన్మార్గానికీ, తద్వారా పుట్టే ఆనందానికీ, విలువనిచ్చే ఒక సంప్రదాయం. ప్రపంచంలో ఏ సంగీత మార్గంలోని వాడైనా తన పాట గొప్పగా రావడానికి సాధన చేయవచ్చు. కానీ కర్ణాటక సంగీత మార్గానుయాయి సాధన చేసేది లౌకికమైన తన గానకళను పరిపుష్టం చేసుకోవడంతో పాటుగా తాను ఒక హంసల్లే తన జీవపంజరం నుండి పైకి ఎగిరిపోవడానికి. ఈ మార్గానికి ఈ చింతనే ప్రాణం. భారతీయ దైవభక్తి, శరణాగతి, తత్త్వ ప్రతిష్ఠాపన, స్తుతి ఇత్యాదులు ఈ మార్గానికి మూలస్తంభాలు.ఈ మార్గంలోని గొప్పవారంతా ధర్మజీవనులుగా నియమాలతో, సన్మార్గంలో ఉన్నవారుగా, ఉపాసకులుగా, లౌకికవాంఛలపై ఏవగింపుతో, సత్త్వబుద్ధి కలవారుగా కనిపిస్తారు. ఇది ఆ మార్గ ప్రభావం వల్ల ఏర్పడిన జీవనవిధానం. యోగాన్నీ, సంగీతాన్నీ ముడివేసిన ఈ మార్గం, ఈ మార్గంలోని ఆచార్యులైన మహాత్ములూమనిషికి కల్పించిన ఒక గొప్ప అవకాశం ఇది.

కర్ణాట శాస్త్రీయ సంగీతానికి చెందిన ఈ ఆత్మ దాని పరిధిని కుదిస్తుందా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం చెబుతాను నేను. శాస్త్రీయ సంగీత రాగాలను బట్టి, మనోహరమైన పాటలతో నేటికీ వెల్లివిరుస్తున్న సినీసంగీతానికి ఎవరూ అడ్డుకట్ట వేయడం లేదు. అక్కడ లౌకికభావాలు సైతం విచ్చుకుంటూనే ఉన్నాయి. ఆ ధోరణి ప్రసరిస్తూనే ఉంది. ఏ విధంగా సినీ సంగీతం అంటే దాని ప్రత్యేకత, దాని పద్ధతులు ఒక ఆకళింపుగాకలుగుతాయో మనిషికి, అలాగేశాస్త్రీయ సంగీతం అంటే దాని ప్రత్యేకత స్ఫురణలోకి రావాలి. ఆ ప్రత్యేకతలోపరిధిని విస్తృతపరిచే పేరుతో సడలింపు చోటుచేసుకోవడం ఆ ప్రత్యేకతను చంపివేయడమే.

సంగీతం విశ్వవ్యాప్తమైనది. సార్వజనీనమైనది, సర్వసమానమైనది అన్న ఉదాత్తభావనలకు అర్థం ఈ ప్రపంచంలో వివిధరకాలుగా భిన్నభిన్నవ్యక్తిత్వాలతో ఉన్న మనుషులందరికీ తమ తమ మనస్సులకు నచ్చినవిధంగా పాడుకునే అవకాశాన్ని అది కల్పిస్తుందని మాత్రమే. ఉన్న సంప్రదాయాలనూ, వాటి ఆదర్శాలనూ, వాటి వాతావరణాన్నీ ప్రభావాలనూ మార్పు చేసే లేదా నాశనం చేసే అవకాశం ఇస్తుందని, ఇవ్వాలనీ కాదు.

ఈ భూమిమీద ఏ మూలకు వెళ్లినా స్వరం ఒక్కటే, తాళం ఒక్కటే, స్థాయి ఒక్కటే. ఇవన్నీ సూర్యరశ్మి, మట్టి, నీళ్ళు వంటివి.కానీ వాటివల్ల పూచేటువంటిపూలు వేరు. రోజాపూవు, మల్లెపూవు ఒకటి కావు. వాటి వాటి వాసనలు వేరు, ఋతు సమయాలు వేరు, మెత్తదనాలు వేరు. అలాగే ఒకే మూలభావనలైన స్వరం, స్థాయి ఇత్యాదులనుండి పుట్టిన hiphop వేరు, దాని హృదయం వేరు; పంజాబీ భాంగ్రా సొగసులు, దాని వస్తుసంచయం వేరు; శాస్త్రీయ సంగీతం వేరు, దాని హృదయం వేరు; అక్కడ సమానత్వం లేదు, ప్రత్యేకతమాత్రమే ఉంది.

ఈ ప్రపంచంలో Rap కూ, melody కీ, hiphop కూ hindustani కీ, cinema musicకీ, సూఫీ బాణీలకూ, చర్చ్ మ్యూజిక్ కూ, కొండజాతి వారి జాతర పాటలకూ, అయ్యప్ప గీతాలకూ ఎలా చోటు ఉందో అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతానికీ చోటు ఉంది. ఉండాలి. దాని హృదయమైన భక్తి, తత్త్వ, శరణాగతి, దేవతాస్తుతి ఇత్యాదులతో సహా ఉండాలి.మనుషులకు రకరకాల సంగీత ప్రవాహాలను వాటి లక్ష్యాలతో ఉద్దేశాలతో పాటుగా అంతే జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. అది లేనపుడు ఆయా సంగీతాలకు ఉనికి ఉండదు. ఉనికి లేనపుడు ఆనందించే హక్కు అన్న ప్రశ్నే పుట్టదు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add