Friday, March 01, 2024

Logo
Loading...
google-add

జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో 30ఏళ్ళ తర్వాత హిందువుల పూజలు ప్రారంభం

P Phaneendra | 10:58 AM, Thu Feb 01, 2024

Worship of Hindu Gods at Gyanvapi Masjid Cellar started after 30 years

కాశీలోని జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో హిందూభక్తులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. 30ఏళ్ళ తర్వాత అక్కడ పూజలు పునఃప్రారంభమయ్యాయి.

వారణాసి కాశీ విశ్వనాథ ఆలయంలో కొంతభాగాన్ని కూలగొట్టి కట్టిన జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో ఉన్న హిందూ దేవీదేవతా మూర్తులకు భక్తులు పూజలు చేసుకోవచ్చునని జిల్లా కోర్టు నిన్న తీర్పునిచ్చింది. మాళిగకు వేసిన సీలును తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అక్కడ పూజలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలంటూ వారం రోజులు గడువిచ్చింది. దాంతో గత అర్ధరాత్రి నుంచే పూజలు మొదలైపోయాయి.

1992 డిసెంబర్‌లో అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత జరిగిన వెంటనే ఆనాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం జరుగుతున్న పూజా పునస్కారాలను నిలిపివేయించారు. ఆ ప్రాంతాన్ని సీల్ చేసేసారు.   

కాశీ విశ్వనాథుడి దేవళానికి పక్కనే, జ్ఞానవాపి మసీదు కింద ఉన్న నేలమాళిగ ప్రాంతంలో గత రాత్రి నుంచే హడావుడి మొదలైపోయింది. కోర్టు తీర్పు హిందూ పక్షానికి అనుకూలంగా రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో హిందూ భక్తులు మసీదు కింద ఉన్న ‘వ్యాసుడి నేలమాళిగ’ అనే పేరున్న సెల్లార్‌ వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పూజలు చేసారు.  రాష్ట్రీయ హిందూదళ్ అనే సంస్థ కార్యకర్తలు మసీదు సమీపంలోని సైన్‌బోర్డుల మీద ‘ఆలయం’ అని అతికించారు.  ఆ పరిస్థితుల్లో అక్కడ అవాంఛనీయ సంఘటనలేవీ జరక్కుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.

మసీదు కింద నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘వ్యాస్ పరివార్’ అనే ఒక అర్చకుల కుటుంబం అధీనంలో ఉంది. 1993లో ఆ ప్రదేశాన్ని సీల్ చేయడానికి ముందు వారు అక్కడ నిత్యపూజలు చేస్తుండేవారు. చివరిగా 1993లో సోమనాథ్ వ్యాస్ అన్న అర్చకుడు అక్కడ పూజలు చేసారు. ఆ వివరాలతో ఆ కుటుంబ సభ్యుడైన శైలేంద్ర పాఠక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వంశ పారంపర్య అర్చకులైన తమను ఆ నిర్మాణంలోకి ప్రవేశించనివ్వాలనీ, పూజలు చేసుకోనివ్వాలనీ వాదించారు. కోర్టు నిన్న ఇచ్చిన తీర్పు హిందువులకు ఊరట కలిగించింది. దాంతో అర్ధరాత్రి నుంచే అక్కడ పూజలు చేయడానికి భక్తులు బారులు తీరారు.

వారణాసి జిల్లాకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతివాది అయిన మసీదు కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కోర్టు ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించింది. ‘‘ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతోంది. బాబ్రీ మసీదు కేసులో అనుసరించిన పద్ధతినే ఇక్కడా అనుసరిస్తున్నారు’’ అని మసీదు కమిటీ తరఫు న్యాయవాది మెరాజుద్దీన్ సిద్దికీ అన్నారు.

జ్ఞానవాపి కేసులో నిన్నటి వారణాసి జిల్లాకోర్టు ఉత్తర్వులు పెద్ద మలుపు. హిందువుల తరఫు పక్షం వారు మసీదు సముదాయంలోపల పూజలు చేసుకోనివ్వాలని కోర్టులో పిటిషన్ వేసారు. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అక్కడ సర్వే నిర్వహించి, ఆ నివేదికను పిటిషనర్లకు, ప్రతివాదులకూ అందజేసింది. మసీదు కట్టడానికి ముందు ఆ ప్రదేశంలో భారీ హిందూ దేవాలయం ఉండేదని ఆ నివేదిక తేల్చిచెప్పింది. అయితే మసీదులో కొంత భాగాన్ని సీలు చేసి ఉంచమనీ, అక్కడ సర్వే వద్దనీ కోర్టు ముందుగానే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ భాగంలో కూడా తవ్వకాలు, శాస్త్రీయ సర్వే చేయనివ్వాలని కోరుతూ పిటిషన్‌దారులైన నలుగురు మహిళలు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జిల్లాకోర్టు ఆదేశాలు, తర్వాతి పరిణామాలపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ  నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ‘‘వారణాసి కోర్టు ఏడు రోజుల సమయం ఇచ్చింది. అయితే అక్కడ హడావుడిగా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోడానికి దానివల్ల అడ్డం కలుగుతుంది’’ అని అఖిలేష్ ఆందోళన చెందుతున్నారు.

వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందంటూ బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా సంయమనం వహించింది. విశ్వహిందూపరిషత్ వంటి హిందూసంస్థలు జిల్లాకోర్టు తీర్పును స్వాగతించాయి.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add