Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

ధైర్యం, సాహసం, త్యాగాల సుదీర్ఘ ప్రస్థానం వీర సావర్కర్

P Phaneendra | 17:40 PM, Mon Feb 26, 2024

Savarkar’s enduring journey of courage, freedom and sacrifice

(నేడు వినాయక్ దామోదర్ సావర్కర్ వర్ధంతి)  

వినాయక్ దామోదర్ సావర్కర్ ఒకేసారి రెండు జీవితఖైదు శిక్షలను అనుభవించిన అమరవీరుడు. ఆయన జీవితం మొత్తం అంతులేని ఘర్షణల మధ్య సహనం, పట్టుదలలకు ప్రతీకగా నిలిచింది. ఒక ఘర్షణ బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం సాధించడానికీ, మరో ఘర్షణ దేశపు సంస్కృతీ సంప్రదాయాల పునరుద్ధరణ కోసం చేసారాయన. ఇక మూడవ ఘర్షణ, తన దేశపు స్వంత ప్రజల అవమానాలూ ఛీత్కారాలను సహనంతో ఎదుర్కోడానికి చేయాల్సి వచ్చింది.

విదేశీ ఆక్రమణదారుల చేతిలో ఓడిపోయి భారతదేశం వారికి బానిస అయిందంటే దానికి కారణం ఆ విదేశీయుల శక్తి సామర్థ్యాలు కాదు, స్వయానా ఈ దేశ ప్రజల్లో సహకారం, నిర్ణయాత్మకత లోపించడమే ప్రధాన కారణం. ఆ రెండు కారణాలనూ సావర్కర్ తన జీవితాంతం సహించారు. ఆయన పోరాటం అధికారం కోసమో, రాజకీయాల కోసమో కాదు... భారత దేశపు ఆత్మగౌరవం, హిందూసమాజపు జాగృతి కోసం పోరాడారాయన. సావర్కర్, ఆయన కుటుంబ సభ్యుల జీవితాలు మొత్తం భారతదేశపు ఉనికిని చాటడానికే అంకితమైపోయాయి.

సావర్కర్ 1883 మే 28న మహారాష్ట్ర ప్రోవిన్స్‌లోని పుణే జిల్లా భాగూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి రాధాబాయి, తండ్రి దామోదర్ పంత్ సావర్కర్. ఆయనకు ఇద్దరు సోదరులు... అన్నయ్య గణేశ్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణ్ దామోదర్ సావర్కర్. వినాయక్‌కు తొమ్మిదేళ్ళ వయసులోనే ప్లేగు మహమ్మారితో అతని తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఏడేళ్ళ తర్వాత అదే మహమ్మారి కాటుకు తండ్రి కూడా దూరమయ్యారు. ఆ సమయంలో కుటుంబం బాధ్యతలను అన్నయ్య గణేశ్ స్వీకరించారు. ఆ కష్టకాలంలో అన్నయ్య చూపిన వ్యక్తిత్వం వినాయక్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. తన అన్నయ్యలా సొంతకాళ్ళ మీద నిలబడి, కుటుంబం బరువు బాధ్యతలను తలకెత్తుకొంటూ, సమాజం పట్ల కూడా తన బాధ్యత నిర్వర్తించాలని వినాయక్ నేర్చుకున్నాడు.   

కొన్ని వ్యక్తిత్వాలు సాధారణమైనవి కావు. అవి ఈ ప్రపంచంలోకి రావడమే అదనపు శక్తిసామర్థ్యాలతో వస్తాయి. అలాంటి అరుదైన వ్యక్తిత్వాలు తమచుట్టూ జరిగే సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుంటాయి, సమాజానికి నేర్పించే ప్రయత్నం చేస్తాయి. అలాంటి అసాధారణమైన ప్రతిభ వినాయక్ సావర్కర్‌లో పుష్కలంగా ఉంది. అలా అతను సమాజాన్ని ఒకేసారి పలుదిశల్లో పరిశీలించడం, నేర్చుకోవడం, నేర్పించడం మొదలుపెట్టాడు. ప్లేగు మహమ్మారి సావర్కర్ తల్లిదండ్రులను మాత్రమే కాదు, దేశంలో లక్షల మంది ప్రజల ప్రాణాలను హరించివేసింది. ఆ సమయంలో కూడా బ్రిటిష్ సైనికుల దౌర్జన్యాలూ దోపిడీలూ ఆగలేదు. ఆ రెండు పెనువిపత్తులనూ భారతీయ సమాజం సహించింది, భరించింది. ఆ రెండు విపత్తుల నుంచీ భారతీయ సమాజాన్ని మేలుకొలపాలని వినాయక్ భావించాడు. అతను కొంతమంది యువకులతో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసాడు, సమాజంలో సంస్కృతిని పునరుద్ధరించే పని ప్రారంభించాడు. దాంతోపాటుగా, 1901లో నాసిక్‌లోని శివాజీ హైస్కూల్‌ నుంచి పాస్ అయ్యాడు. సావర్కర్‌కు చదువంటే ఎంతో ఇష్టంగా ఉండేది. అదే సమయంలో అతను రచనలు చేయడం కూడా ప్రారంభించాడు. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై వ్యాఖ్యానాలు రాయడంలోనూ, వాటికి సాహిత్యరూపం ఇవ్వడంలోనూ సావర్కర్ తనదైన శైలిని పుణికిపుచ్చుకున్నాడు. ఆ క్రమంలో సావర్కర్ మిత్రబృందాల సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆ సమావేశాల్లో దేశం, సంస్కృతి, భారతమాత ఎదుర్కొంటున్న సంక్షోభాలు, ఆ సంక్షోభాలకు పరిష్కారాలు వంటి అంశాలపై చర్చలు జరిగేవి. ఆ సమావేశాల ద్వారా నాటి యువతరంలో జాతీయతాభావనలు బలపడసాగాయి. 17ఏళ్ళ వయసులో సావర్కర్‌కు యమునాదేవితో పెళ్ళయింది. నాటినుంచీ సావర్కర్ ఉన్నత విద్యాభ్యాసం బాధ్యత, మామగారు రామచంద్ర తీసుకున్నారు. సావర్కర్ 1902లో పుణేలోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ డిగ్రీలో చేరాడు. కాలక్రమంలో వినాయక్‌కు ఇద్దరు పిల్లలు పుట్టారు. కొడుకు విశ్వాస్ సావర్కర్, కూతురు ప్రభాత్ సావర్కర్. (పెళ్ళి తర్వాత ఆమె ప్రభాత్ చిప్లూంకర్ అయింది.)

వినాయక్ సావర్కర్ 1904లో పుణేలో ‘అభినవ భారత్’ అనే సంస్థను ప్రారంభించారు. అదొక విప్లవ సంస్థ. దాన్ని అనంతరకాలంలో బ్రిటిష్‌వారు నిషేధించారు. 1905లో బెంగాల్ విభజన తర్వాత అభినవ భారత్ సంస్థ పుణే, చుట్టుపక్కల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర దహన కార్యక్రమం నిర్వహించింది. వినాయక్ సావర్కర్, అభినవ భారత్ కార్యకర్తలు పుణే, చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్లో దేశభక్తిని జాగృతం చేసేలా శక్తివంతమైన ఉపన్యాసాలు చేస్తుండేవారు. వారి బృందాన్ని బాలగంగాధర తిలక్ ఆశీర్వదించారు. తిలక్ కృషి వల్ల వినాయక్ దామోదర్ సావర్కర్‌కు ఉపకారవేతనం లభించింది. అప్పట్లో ఆయన వ్యాసాలు ‘ఇండియన్ సోషలిస్ట్’ అనే పత్రికలోనూ, కోల్‌కతా నుంచి వెలువడే ‘యుగాంతర్’ పత్రికలోనూ ప్రచురితమవుతుండేవి.

కళాశాల విద్య పూర్తయిన తర్వాత సావర్కర్ న్యాయవాద విద్య చదవడం కోసం లండన్ వెళ్ళాడు. ఆయన అక్కడ మ్యూజియాలలో 1857 సిపాయిల తిరుగుబాటు ఎలా మొదలైంది, బ్రిటిష్ వారు ఆ ఉద్యమాన్ని ఎలా అణచివేసారో చదివి తెలుసుకున్నాడు. అవన్నీ చదివిన సావర్కర్ 1907 మే 10న మొట్టమొదటి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాడు. లండన్‌లోని ఇండియా హౌస్‌లో సాక్ష్యాధారాలను ఉటంకిస్తూ ఆయన చేసిన అద్భుత ప్రసంగం, 1857 తిరుగుబాటును భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటంగా గుర్తింపు పొందేలా చేసింది. దాంతో పాటు సావర్కర్ ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ అనే పుస్తకాన్ని రాసాడు. ఆ పుస్తకం రాయడం 1908 జూన్‌లో పూర్తయింది. కానీ దాన్ని అచ్చువేయడానికి ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించడం కోసం ఎన్నోప్రయత్నాలు చేసాడు. ఎట్టకేలకు ఆ పుస్తకం మొదటిసారి హాలెండ్‌లో ప్రచురితమైంది. దాని ప్రతులను ఫ్రాన్స్‌ పంపించారు. ఆ రచనలో సావర్కర్ 1857 సిపాయిల తిరుగుబాటును 1877లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించాడు. ప్రచురణకు ముందే సెన్సార్ అయిన అతితక్కువ ప్రపంచ పుస్తకాల్లో ఈ పుస్తకమూ ఒకటి.

1909 మే నెలలో సావర్కర్ లండన్‌లో బార్-ఎట్-లా పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ లా ప్రాక్టీస్ చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం, బ్రిటిష్ సింహాసనానికి విధేయుడిగా ఉంటాను అన్న ప్రతిజ్ఞ చేయకపోవడమే.

లండన్‌లోని గ్రేస్ ఇన్‌ న్యాయకళాశాలలో చేరాక సావర్కర్ ఇండియాహౌస్‌లో ఉండసాగాడు. ఆ సమయంలో ఇండియాహౌస్ భారతీయుల రాజకీయ కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఉండేది. అక్కడే సావర్కర్‌కు భారత స్వాతంత్ర్య సంగ్రామానికి రహస్యంగా మద్దతునిస్తున్నవారితో పరిచయాలు పెరిగాయి.

సావర్కర్ లండన్‌లో లాలా హర్‌దయాళ్‌ను కలుసుకున్నారు. ఆయన అప్పట్లో ఇండియాహౌస్ బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. 1909 జులై 1న విప్లవవీరుడు మదన్‌లాల్ ధింగ్రా, సర్ విలియం హట్ కర్జన్ వైలీని కాల్చిచంపారు. ఆ సంఘటన గురించి సావర్కర్ ‘టైమ్స్ ఆఫ్ లండన్’ పత్రికలో ఒక వ్యాసం రాసారు. ఆ వ్యాసం ప్రచురితమయ్యాక సావర్కర్ అరెస్టుకు వారంటు పుట్టింది. 1910 మే 10న సావర్కర్ పారిస్ నుంచి లండన్ రాగానే అరెస్టయ్యాడు. అయితే 1910 జులై 8న ఎస్ఎస్ మోరియా అనే ఓడలో భారతదేశానికి తరలిస్తుండగా సావర్కర్ ఆ ఓడ  డ్రైనేజీ గొట్టాల్లోనుంచి సముద్రంలోకి జారి తప్పించుకున్నాడు. ఇంగ్లీష్ చానెల్‌ను ఈదుకుని ఫ్రాన్స్ చేరే ప్రయత్నం చేసాడు. అయితే అతని ప్రయత్నం విఫలమై, బ్రిటిష్ వారికి దొరికిపోయాడు.

1910 డిసెంబర్ 24న తెల్లప్రభుత్వం సావర్కర్‌కు జీవితఖైదు విధించింది. 1911 జనవరి 31న ఆయనకు మరోసారి యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. అలా ఒక వ్యక్తికి ఒకేసారి రెండు జీవితఖైదు శిక్షలు విధించడం, ప్రపంచ చరిత్రలో అదే మొదటిసారి. అయితే మాతృభూమి కోసం తనను అంకితం చేసుకున్న సావర్కర్ ఆ శిక్షలను అంగీకరించాడు. ఆ తర్వాత పటిష్టమైన భద్రత నడుమ సావర్కర్‌ను భారత్‌కు తరలించారు. నాసిక్ జిల్లా కలెక్టర్  జాక్సన్‌ను హత్య చేసిన నాసిక్ కుట్ర కేసులో సావర్కర్ ప్రమేయం ఉందంటూ ఆయనను 1911 ఏప్రిల్ 7న అండమాన్ దీవులలోని సెల్యులార్ జైలుకు తరలించారు. ఆ కేసులో సావర్కర్ సోదరులిద్దరినీ కూడా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు.

సెల్యులార్ జైలులో ఖైదీల నరకయాతనలకు అంతేలేదు. ఎద్దులకు బదులు ఖైదీలను పెట్టి నూనెగానుగ తిప్పేవారు. జైలుచుట్టుపక్కల అటవీప్రాంతాలను శుభ్రం చేయించడం, కొండప్రాంతాలను చదును చేయించడం వంటి కఠినమైన పనులు చేయించేవారు. పనిచేయలేకపోయినవారిని కొరడాలతో, ఇనపచువ్వలతో దారుణంగా కొట్టేవారు. అంత పనీ చేయించుకుని, వారికి కనీస ఆహారం పెట్టేవారు కాదు. ఆ చిత్రహింసలన్నింటినీ సావర్కర్ భరించారు. పోర్ట్‌బ్లెయిర్‌లోని సెల్యులార్ జైలులో సావర్కర్ 1911 జులై 4 నుంచి 1921 మే 21 వరకూ ఉన్నారు.  

1919లో వల్లభభాయ్ పటేల్, బాలగంగాధర తిలక్‌ల సలహా మేరకు సావర్కర్ క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించడం, తిరుగుబాట్లు లేవదీయడం వంటివి చేయకూడదన్న షరతు మీద సావర్కర్‌ను విడుదల చేసారు. జైలులో జీవితం నిరర్థకంగా ముగిసిపోవడం కంటె బ్రతికిఉండి దేశానికీ సమాజానికి సేవ చేయడం మేలు అని తెలుసు. సావర్కర్ జైలులో కంటె బైట ఉంటే తనకు నచ్చిన పని చేసుకోవచ్చని తిలక్ ఆయనకు సందేశం పంపించారు. దాన్ని సావర్కర్ పరిగణనలోకి తీసుకున్నారు.

1921లో విడుదల తర్వాత సావర్కర్ హిందుత్వ మీద ఒక పరిశోధనా గ్రంథం రాసారు. 1925లో సావర్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్‌ను కలుసుకున్నారు. సావర్కర్ ప్రయత్నాలు ఫలించి 1931 ఫిబ్రవరిలో బొంబాయిలో పతిత పావన మందిరానికి పునాది పడింది. హిందువులైన అందరికీ ఆ మందిరంలోకి సమానంగా ప్రవేశం ఉంది. 1931 ఫిబ్రవరి 25న బొంబాయి ప్రెసిడెన్సీలో అస్పృశ్యత నిర్మూలన అనే సమావేశానికి సావర్కర్ అధ్యక్షత వహించారు. 1937లో అహ్మదాబాద్‌లో ఆల్ ఇండియా హిందూమహాసభకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఆయన ఏడేళ్ళున్నారు. 1938 ఏప్రిల్‌లో మరాఠీ సాహిత్య సమ్మేళన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1941 జూన్‌లో ఆయన నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ను కలిసారు. 1942 అక్టోబర్ 9న భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలంటూ సావర్కర్, విన్‌స్టన్ చర్చిల్‌కు తంతి పంపించారు. భారతదేశ విభజనకు వ్యతిరేకంగా, దేశం సమైక్యంగా ఉండాలనే వాదనకు సావర్కర్ తన జీవితాంతం కట్టుబడి ఉన్నారు. 1943 తర్వాత సావర్కర్ ముంబైలో నివసించసాగారు.

1945 ఏప్రిల్‌లో అఖిల భారత రాజసంస్థానాల హిందూ సభ సమావేశానికి సావర్కర్ అధ్యక్షత వహించారు. 1946 ఏప్రిల్‌లో బొంబాయి ప్రభుత్వం సావర్కర్ రచనలపై నిషేధాన్ని ఎత్తివేసింది. 1947లో దేశ విభజనను సావర్కర్ వ్యతిరేకించారు. ఆ విషయంలో ఆయన వాదన ఏంటంటే... భారతదేశాన్ని విభజించనే కూడదు. ఒకవేళ విభజించాల్సి వస్తే అది సమగ్రంగా ఉండాలి. ముస్లిముందరూ ఒకచోట, హిందువులందరూ ఒకచోట ఉండాలి. ఆయన వాదనలు ఎంత బలంగా ఉండేవంటే సర్దార్ పటేల్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు సావర్కర్ సిద్ధాంతాలను అంగీకరించేవారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వానికీ, ముస్లింలీగ్‌కూ ఆందోళన పట్టుకుంది. కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. గాంధీ దేశ విభజనకు ఒప్పుకున్నారు. కానీ అది స్వచ్ఛందంగా జరగాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ తమ మాతృభూమిలో ఉండాలి అని గాంధీ భావన. దేశ విభజన ఏర్పాట్లలో బెంగాల్, పంజాబ్ ప్రాంతాల్లో భారీ హింస చెలరేగింది. సావర్కర్ గాంధీపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఏదేమైనా భారత విభజన అనివార్యమైంది. ఆ సమయంలో భారీ హింస జరిగింది. అప్పుడు సావర్కర్ గాంధీని బహిరంగంగానే విమర్శించారు.

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో సావర్కర్‌ భారతదేశపు త్రివర్ణ పతాకాన్నీ, కాషాయ ధ్వజాన్నీ కలిపి ఎగురవేసారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చినందుకు సంతోషంగా ఉంది, కానీ దేశవిభజన జరిగినందుకు బాధగా ఉంది’’ అని సావర్కర్ స్పందించారు. నదులు, కొండలు లేదా ఒప్పందాలతో ఒక దేశపు సరిహద్దులు నిర్ణయించబడవని ఆయన అన్నారు. ఆ దేశపు యువతరం ధైర్యం, సహనం, త్యాగం, సాహసాలతోనే దేశ సరిహద్దులు నిర్ణయమవుతాయని సావర్కర్ వ్యాఖ్యానించారు.

1948 జనవరి 30న గాంధీ హత్య చేయబడ్డారు. ఫిబ్రవరి 5న సావర్కర్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసారు, అయితే గాంధీ హత్యకు కుట్రలో ప్రమేయం ఉన్నట్లుగా ఆయన మీద చేసిన ఆరోపణలు నిరూపణ కాలేదు. దాంతో ఆయన విడుదలకు ఉత్తర్వులు జారీ చేసారు. 1950 ఏప్రిల్ 4న పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి లియాఖత్ అలీ భారతదేశానికి వచ్చాడు. ఆ సందర్భంలో సావర్కర్‌ను బెల్గాం జైలులో నిర్బంధించారు. లియాఖత్ అలీ వెళ్ళిపోయిన తర్వాత సావర్కర్‌ను విడిచిపెట్టారు. 1857 నాటి ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం శతాబ్ది ఉత్సవాలు 1957 నవంబర్‌లో ఢిల్లీలో జరిగాయి. ఆ సమావేశాల్లో ప్రధాన వక్త సావర్కరే.

1949 అక్టోబర్ 8న పుణే విశ్వవిద్యాలయం సావర్కర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1963 నవంబర్ 8న ఆయన భార్య యమునాబాయి మరణించారు. 1965 సెప్టెంబర్‌లో ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ తర్వాత నుంచీ ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. 1966 ఫిబ్రవరి 1న సావర్కర్ నిరాహార దీక్ష చేపట్టారు. చివరికి 1966 ఫిబ్రవరి 26న బొంబాయి నగరంలో వినాయక్ దామోదర్ సావర్కర్ తుదిశ్వాస విడిచారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add