Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

సివి రామన్ గౌరవార్థం జాతీయ సైన్స్ దినోత్సవం

P Phaneendra | 16:51 PM, Wed Feb 28, 2024

National Science Day Today

'నా మతం సైన్సు, దానినే జీవితాంతం ఆరాధిస్తా' అని ప్రకటించి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు సర్ సివి రామన్. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వారిలో సివి రామన్ మొదటివారు.విజ్ఞానశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు, ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియావాసి ఆయనే. ఆయన రామన్ ఎఫెక్ట్‌ను ధ్రువీకరించిన తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది.

చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7తిరుచినాపల్లి సమీపంలోని ఓ చిన్నగ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. వారిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. రామన్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో పూర్తిచేశారు. రామన్ తండ్రి భౌతికశాస్త్ర అధ్యాపకుడు కావడంతో ఆయనకు ఆ శాస్త్రంలో అభిరుచి ఏర్పడింది. రామన్ తన 12వ ఏటనే ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సీ ఫిజిక్స్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు.

రామన్ 18వ ఏటనే లండన్ నుంచి వెలువడే శాస్త్రీయ పత్రికలో కాంతి ధర్మాలపై పరిశోధనా వ్యాసం ప్రచురించారు. ఆయన అభిరుచిని గమనించిన అధ్యాపకులు రామన్‌ను ఇంగ్లండ్ వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ వైద్య పరీక్షలో ఫెయిల్ అవడంతో రామన్ ఇంగ్లండ్‌ ప్రయాణం విరమించుకున్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.

1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. అతని ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ... ‌రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే బాగుంటుందని బ్రిటిష్‌ ప్రభుత్వానికి సూచించారు. కానీప్రభుత్వం అంగీకరించలేదు.

రామన్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్ష రాసి పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతి తీసుకున్నాడు. ఉద్యోగం పనివేళలు తప్ప మిగతా సమయమంతా పరిశోధనల్లో గడిపేవాడు.

రామన్ తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి, నైపుణ్యం ఉండేది. అందుకే రామన్ తన తొలి పరిశోధనలు వయొలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి చేసారు. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. తర్వాత శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. లండన్‌నుంచి తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు.

సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు.

1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్ తాను కనుగొన్న విషయాన్ని ధ్రువీకరించారు. ‘కాంతి పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమం గుండా ప్రసరించినప్పుడు తన స్వభావాన్ని మార్చుకుంటుంది’ అనే దృగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో నిరూపించాడు. ఆ పరిశోధనకు బ్రిటిష్ ప్రభుత్వం రామన్‌ను 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈయన పరిశోధనలను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

భారతదేశపు శాస్త్రసాంకేతిక రంగానికి రామన్ చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహూకరించింది. ఆ సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఆయన 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధిస్తాయి' అని ప్రకటించారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడిన సర్ సివి రామన్ 1970 నవంబర్ 20 న పరమపదించారు. రామన్ ఎఫెక్ట్‌ ధ్రువీకరించబడిన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి, నిర్వహిస్తోంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add