Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు

P Phaneendra | 14:24 PM, Thu Feb 29, 2024

Library Movement Fighter Gadicherla Hari Sarvottama Rao

(నేడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు వర్ధంతి)

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజనవిద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు.

రాయలసీమ అనే పేరు వ్యాప్తిలోకి రావడానికి కారణం గాడిచెర్ల వారే. దత్తమండలాలు అన్న పేరు బానిసత్వానికి చిహ్నంగా ఉందని, ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచేవిధంగా రాయలు ఏలిన సీమ కాబట్టి దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని 1928లో సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ప్రతిపాదించాడు. అప్పటినుంచీ ఆ ప్రాంతాన్ని రాయలసీమ అనే పేరుతో పిలవడం మొదలై అది బహుళవ్యాప్తి చెంది ఆఖరికి స్థిరపడింది.

గాడిచెర్లవారు 1883 సెప్టెంబర్ 14న భగీరథమ్మ, వెంకటరావు దంపతులకు కర్నూలులో జన్మించారు. వీరి తండ్రి రెవెన్యూ ఇనస్పెక్టరుగా పనిచేసేవారు. గాడిచెర్ల వారు కంభంలో ప్రాథమిక విద్య, కర్నూలు మునిసిపల్ హైస్కూలు మరియు గుంతకల్లులో హైస్కూలు చదువు పూర్తి చేసారు. మద్రాసు కళాశాలలో బిఎ, ఎంఎ పూర్తిచేసారు. 1907లో వీరు రాజమండ్రిలోని టీచర్స్ ట్రైనింగ్ కళాశాలలో చదువుతుండగా స్వరాజ్య ఉద్యమంలోకి ప్రవేశించారు.

బ్రిటిష్ ప్రభుత్వం హిందూముస్లింల మధ్య గొడవలు పెంచి విభజించి పాలించే కుట్రలో భాగంగా పశ్చిమబెంగాల్‌ను రెండు ముక్కలుగా విడదీసింది. దానిని వ్యతిరేకిస్తూ దేశమంతా ‘వందేమాతరం’ ఉద్యమం ప్రారంభమైంది. బిపిన్ చంద్రపాల్ దేశమంతా పర్యటిస్తూ ఆంధ్రదేశంలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో రాజమండ్రి కళాశాలలో చదువుతున్న గాడిచెర్ల ఆ ఉపన్యాసాలతో ప్రభావితుడై విద్యార్థులకు నాయకత్వం వహించారు. తరువాత రోజు కళాశాల విద్యార్థులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి వందేమాతరం నినాదాలతో కళాశాలకు వచ్చారు. అక్కడి ప్రిన్సిపల్ హంటర్ బ్యాడ్జీలు తీసివేస్తే తప్ప లోపలికి అడుగు పెట్టనీయనన్నాడు. కానీ గాడిచెర్ల నాయకత్వంలో విద్యార్థులు దాన్ని నిరాకరిస్తూ ప్రదర్శన జరిపారు. దానితో ప్రిన్సిపల్ గాడిచెర్లను కళాశాల నుంచి బహిష్కరించాడు. అంతేగాక ప్రభుత్వం ఆయనకు ఎక్కడా ప్రభుత్వోద్యోగం ఇవ్వరాదని ఉత్తర్వులు జారీచేసింది.

గాడిచెర్లవారు ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకునిగా చేరారు. పత్రికారంగంలో ఎడిటర్, ఎడిటోరియల్ అనే ఆంగ్లపదాలకు తొలిసారిగా సంపాదకుడు, సంపాదకీయం అనే పేర్లు పెట్టింది వీరే. స్వరాజ్య పత్రికలో పనిచేస్తున్న సమయంలోనే బ్రిటిష్ అధికారి ‘ఏష్’ హత్య జరిగింది. దాంతో సామాన్య ప్రజలపై బ్రిటిష్ సైనికుల నిర్బంధం, దమనకాండ తీవ్రతరం అయింది.

దాన్ని ఎండగడుతూ గాడిచెర్లవారు ‘విపరీతబుద్ధి’ పేరుతో సంపాదకీయం రాసారు. దాంతో ప్రభుత్వం అతన్ని రాజద్రోహ నేరం కింద అరెస్టు చేసి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అలా ఖైదు కాబడిన మొట్టమొదటి రాజకీయ ఖైదీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారే.

రాయవేలూరు జైలులో గాడిచెర్ల వారు అనేక బాధలు అనుభవించారు. కాలికి, మెడకు సంకెళ్ళు వేసి వాటి మధ్య ఒక కొయ్యముక్క తగిలించారు. పురుగుల అన్నం, పడుకోడానికి చినిగిపోయిన చాప, కట్టుకోడానికి రెండు చిన్న బట్టముక్కలు మాత్రమే ఇచ్చారు. నూనె గానుగను నిరంతరం తిప్పించేవారు. అలా ఎన్ని బాధలు పడినా వారిలో పోరాటపటిమ కొంచెం కూడా తగ్గలేదు.

1913లో జైలునుంచి విడుదల కాగానే కాశీనాథుని నాగేశ్వరరావుగారి ఆంధ్రపత్రికకు కొంతకాలం సంపాదకునిగా పనిచేసి, 1916లో హోంరూల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1920లో గాంధీగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని వారివెంట ఆంధ్రదేశమంతా పర్యటించి గాంధీగారి ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ‘‘ది నేషనలిస్ట్’’ అనే ఆంగ్లపత్రికను కొంతకాలం నడిపారు. ప్రభుత్వం దాన్ని నిషేధించింది. తాడిపత్రిలో ‘మాతృసేవ’ పత్రిక స్థాపనకు కృషి చేసారు. తరువాత నంద్యాలలో ‘కౌమోదకి’ పత్రికను స్థాపించారు.

1927లో వీరు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం మేరకు మద్రాస్ కౌన్సిల్ ఎన్నికలో పాల్గొని జస్టిస్ పార్టీ అభ్యర్ధిని ఓడించి కర్నూలు నుంచి ఎన్నికైన మొదటి ఎంఎల్‌హెచ్‌గా గుర్తింపు పొందారు. 1937లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య సఖ్యత చేకూర్చి ‘శ్రీబాగ్ ఒప్పందం’ కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

1930 తర్వాత వీరు క్రమక్రమంగా రాజకీయాలకు దూరంగా జరుగుతూ గ్రంథాలయ, వయోజనవిద్య ఉద్యమాలకు ఎంతగానో కృషి చేసారు. 1934 నుంచి జీవితాంతం వీరు గ్రంథాలయ సంఘానికి అధ్యక్షునిగా పనిచేసారు. వయోజన విద్య డైరెక్టరుగా ఆంధ్రదేశమంతటా పర్యటిస్తూ ప్రజలను అక్షరాస్యులుగా మార్చడం కోసం ఎంతగానో కృషి చేసారు. అనేక గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పడడానికి కారణం అయ్యారు.

గాడిచెర్ల వారు విశ్రాంతి ఎరుగని వీరుడు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ, ప్రజల సేవలోనే గడుపుతూ అనారోగ్యానికి గురి అయి, చివరికి 1960 ఫిబ్రవరి 29న దేశమాత సేవలో తుదిశ్వాస విడిచారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add