Sunday, October 01, 2023

Odisha-365
google-add

Madras HC: భావప్రకటనా స్వేచ్ఛ ద్వేషప్రసంగం కారాదు, సనాతన ధర్మం శాశ్వతమైన ధర్మం

P Phaneendra | 18:07 PM, Sat Sep 16, 2023

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల రగడ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సనాతన ధర్మం అనేది హిందూ జీవనవిధానాన్ని అనుసరించేవారు పాటించే శాశ్వతమైన ధర్మాల సమాహారమని హైకోర్టు పేర్కొంది. ‘దేశం పట్ల ధర్మం, దేశాన్నేలే రాజు పట్ల ధర్మం, ఆ రాజుకు ప్రజల పట్ల ఉండే ధర్మం, ప్రతీ వ్యక్తికీ తన తల్లిదండ్రులు, గురువుల పట్ల ఉండే ధర్మం, పేదల పట్ల చూపాల్సిన ఆదరణ, ఇలా ఎన్నో విధుల సమాహారమే సనాతన ధర్మం’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ శేషశాయి స్పష్టం చేసారు.

సనాతన ధర్మానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ తీవ్రస్థాయిలో జరుగుతున్న చర్చల గురించి తమకు తెలుసుననీ, సమాజంలో జరుగుతున్న విషయాలను న్యాయస్థానం నిజాయితీగా స్పందిస్తోందనీ శేషశాయి అన్నారు.

మతానికి సంబంధించిన విషయాల్లో భావప్రకటనా స్వేచ్ఛను వాడుకుంటున్నప్పుడు ఆ స్వేచ్ఛ విద్వేష ప్రకటనగా ఉండరాదనీ, ఇతరులను గాయపరిచేదిగా ఉండకూడదనీ న్యాయస్థానం స్పష్టం చేసింది.

‘సనాతన ధర్మం అంటే కులతత్వం, అంటరానితనాన్ని ప్రోత్సహించేది మాత్రమే అన్న అభిప్రాయం ఎక్కణ్ణుంచో వచ్చిపడింది. పౌరులందరూ సమానమే అనే దేశంలో అస్పృశ్యతను సహించకూడదు. ఒకవేళ సనాతన ధర్మంలోని కొన్ని నియమాల్లో అంటరానితనం ఉన్నా, దాన్ని పాటించకూడదు. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణం దాన్ని నిర్మూలించాలని స్పష్టంగా పేర్కొంది. సమానత్వం అనేది పౌరుల ప్రాథమిక హక్కు. ఇక భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం, దాని ఆదర్శాలను గౌరవించడం ప్రతీ పౌరుడి ప్రాథమిక విధి. కాబట్టి సనాతన ధర్మంలో కానీ, దాని వెలుపల కానీ అంటరానితనం అనేది రాజ్యాంగ విరుద్ధం. అయితే దురదృష్టవశాత్తూ అదింకా ఉనికిలో ఉంది’ అని కోర్టు వివరించింది.

డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా చెన్నైలోని ఒక ప్రభుత్వ కళాశాల తమ విద్యార్థినులకు ‘సనాతన ధర్మంపై వ్యతిరేకత’ అన్న అంశంపై తమ అభిప్రాయాలు చెప్పాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. దాన్ని సకోవాల్ చేస్తూ ఇళంగోవన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అంటరానితనాన్ని ఎక్కడా ఆమోదించలేదు, లేదా ప్రోత్సహించలేదు, పైగా హిందువులందరినీ సమానత్వం పాటించాలని ఆదేశించింది అన్న విషయాన్ని ఇళంగోవన్ వాదించారు.

‘మత ధర్మాల్లో కాలంతో పాటు కొన్ని చెడ్డ ఆచారాలు చొరబడతాయి. అలాంటి కలుపుని పీకి పారేయవలసిందే. అయితే పంటపొలాన్ని నాశనం చేయడం దేనికి?’ అని ఇళంగోవన్ వాదనల సారాంశంగా కోర్టు గమనించింది.

ఆ కాలేజీ వివాదాస్పద సర్క్యులర్‌ను ఉపసంహరించుకుందని తెలియడంతో కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.

‘సనాతన ధర్మం ఏ ఒక్క పుస్తకానికో పరిమితమైనది కాదు. దానికి చాలా మూలాలు ఉన్నాయి, సనాతన ధర్మం ప్రజలకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపమని చెబుతుంది. ఆ కళాశాల ఎంచుకున్న అంశాన్ని సమర్థించాలంటే ఈ ధర్మాలన్నిటినీ నాశనం చేయాల్సిందే. ఒక పౌరుడు తన దేశాన్ని ప్రేమించకూడదా? దేశసేవను ధర్మంగా పాటించకూడదా? తల్లిదండ్రులను ఆదరించకూడదా? సమాజంలో జరుగుతున్న ప్రచారాన్ని చూస్తూ దానిగురించి ఆలోచించకుండా కోర్టు ఉండలేకపోతోంది’ అని కోర్టు తన ఆదేశంలో చెప్పింది.

‘ప్రతీ వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నమాట నిజమే. అయితే తానేం మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తికి తప్పక తెలిసి ఉండాలి. రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే భావప్రకటనా స్వేచ్ఛను పరిపూర్ణ హక్కుగా చేయలేదు. దానికి కొన్ని పరిమితులు విధించారు’ అని కోర్టు గుర్తు చేసింది.

‘ప్రజలందరికీ తమకు నచ్చిన మతాన్ని అనుసరించే ప్రాథమిక హక్కును 25వ అధికరణం ఇచ్చింది. ప్రతీ మతంలోనూ కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలు అన్నీ హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఉండవు. కాబట్టి మతానికి సంబంధించిన విషయాల్లో భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకునేటప్పుడు, ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సిందే’ అని కోర్టు స్పష్టం చేసింది.

‘అంటే, సుప్రీంకోర్టు హెచ్చరించినట్టు, భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేష ప్రసంగం కారాదు. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట మాట్లాడేవారు ఆ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. దాన్నే విస్మరించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అసలు చర్చ పక్కదోవ పడుతుంది, ఆ చర్చ ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటుంది, దాని ప్రాసంగికత కోల్పోతుంది’ అని వివరించింది.

‘ఈరోజుల్లో భావప్రకటనా స్వేచ్ఛ ఎలా తయారయింది? సోషల్ మీడియానే ప్రాతిపదికగా చేసుకుని చూద్దాం. సైన్సు గురించి, రాకెట్ గురించి, లేదా అంతరిక్షం గురించి ఏమీ తెలియని వాళ్ళంతా రాకెట్ సైన్స్ గురించి ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు. అది వారి భావప్రకటనా స్వేచ్ఛే. కానీ అది వారికి కొంత గుర్తింపునివ్వడం మినహా అంతకుమించి ఏ ప్రయోజనాన్నీ సాధించదు. భావప్రకటనా స్వేచ్ఛ నిష్పక్షపాతమైన, ఆరోగ్యకరమైన చర్చలను ప్రోత్సహించాలి, సమాజాన్ని రాజ్యాంగబద్ధంగా ముందుకు నడిపించగలగాలి. ఎందుకంటే, ఆఖరికి ప్రతీ పౌరుడూ తన ఉనికిని రాజ్యాంగం ద్వారా చాటుకోవాలి. కాబట్టి రాజ్యాంగం బోధించే విలువలు, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. ఆ విషయాన్ని మరచిపోకూడదు’ అని మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

google-add
google-add
google-add

బ్లాగ్

google-add
google-add