Monday, December 11, 2023

Odisha-365
google-add

దీపావళి – బాణాసంచా – కాలుష్యం: వాస్తవాలు 3

P Phaneendra | 16:11 PM, Mon Nov 13, 2023

ఈ కేసులో తీర్పుల విశ్లేషణ

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో నాలుగు తీర్పులు వచ్చాయి. 2018 అక్టోబర్ 23న ఇచ్చిన తీర్పు వాటిలో ఆఖరిదీ, ఇఫ్పుడు అమల్లో ఉన్నదీనూ. దాన్ని అర్ధం చేసుకోడానికి అంతకు ముందరి మూడు తీర్పులనూ తెలుసుకోవాలి. ప్రత్యేకించి 2017 సెప్టెంబర్‌లో వచ్చిన రెండో తీర్పు తర్వాత కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది.

2016లో ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయులకు చేరుకున్నప్పుడు సుప్రీంకోర్టు తక్షణమే అంటే నవంబర్ 11న దేశ రాజధాని ప్రాంతంలోని బాణాసంచా అమ్మే అన్ని దుకాణాల లైసెన్సులనూ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

సుమారు పది నెలల తర్వాత, అంటే 2017 సెప్టెంబర్ 12న, ఇరుపక్షాల వాదనలూ విన్న తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. అందులో రెండు కీలకమైన పరిశీలనలున్నాయి. అవేంటంటే (1) ఢిల్లీలో కాలుష్యానికి టపాసులు కాల్చడమే కారణమని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. (2) అందువల్ల బాణాసంచాపై పూర్తిస్థాయి నిషేధం తీవ్రమైన నిర్ణయమే అవుతుంది, అది సూచనార్హం కాదు. అందువల్ల 2016 నవంబర్‌లో టపాసుల అమ్మకాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది.

ఈ తీర్పు తర్వాత పరిణామాలు భలే ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. సాధారణంగా మనలాంటి మామూలు మనుషులం మనకు వ్యతిరేకంగా ఏదైనా తీర్పు వస్తే దాన్ని మన విధి అనుకుని ఒప్పుకుని ముందుకెళ్ళిపోతాం. మహా అయితే ఆ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకుంటాం. కానీ ఈ కేసులో పిటిషనర్లు మామూలు మనుషులు కారు, మహానుభావులు. వాళ్ళకున్న బలం, ప్రభావం ఎలాంటివంటే ఆ కేసులో తీర్పు తమకు నచ్చినట్టు రాకపోయేసరికి, ఆ కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు బెంచ్‌నే మార్చివేసేలా ప్రభావితం చేయగలిగారు. ఇదేదో గుడ్డి ఆరోపణ కాదు. అక్టోబర్ 2017లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు రికార్డు చేసిన విషయమే.

‘‘... ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం ఒక నిర్దిష్ట బెంచ్ నుంచి ఈ వ్యవహారాన్ని తప్పించడమే. ఇది ఆరోగ్యకరమైన విధానం కాదు. ఈ పద్ధతిని మేం గర్హిస్తున్నాం, ఆ విషయాన్ని కూడా మా బలమైన నిరసన ద్వారా నమోదు చేస్తున్నాం....’’

పిటిషనర్ల కోరిక మేరకు కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం కంటె, ఆ కొత్త బెంచ్ అభిప్రాయాలు మారిపోవడం మరింత ఆసక్తికరమైన విషయం. ఢిల్లీలో కాలుష్యానికీ టపాసులే కారణం అనడానికి స్పష్టమైన ఆధారాలేమీ లేవని ముందరి బెంచ్ వెల్లడిస్తే, కొత్త బెంచ్ దాన్ని మార్చేసింది. 2017 అక్టోబర్ నాటి తీర్పులో పదో పేరా ‘‘ఢిల్లీలో 2016లో చోటు చేసుకున్న కాలుష్యానికి ప్రత్యక్ష, తక్షణ కారణం దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడమే అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉంది... దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చకూడదని సమాజంలో స్థూలంగా ఒక ఏకాభిప్రాయం ఉంది’’ అని చెబుతోంది.

అలా సెప్టెంబర్ 2017 నాటి తీర్పు తర్వాత వచ్చిన కొత్త బెంచ్ ఒక్క నెలలోపలే, అంటే అక్టోబర్ 2017లోనే, దీపావళికి సరిగ్గా వారం రోజుల ముందు, గత బెంచ్ తీర్పును మార్చేసింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో బాణాసంచా అమ్మకాలను అనుమతించే ఉత్తర్వులను ఉపసంహరించింది. కొత్త బెంచ్ కొత్త నిర్ణయం తీసుకోడంలో వ్యవహరించిన తీరు కూడా ప్రత్యేకమైనదే. కొత్త బెంచ్ సెప్టెంబర్ తీర్పును సమీక్షించదలచుకోలేదు, ఆ తీర్పును తిరగరాయనూ లేదు. కానీ సెప్టెంబర్ తీర్పు అమలు కావలసిన తేదీని 2017 నవంబర్ 1 నుంచి, దీపావళి పండుగ (19.10.2017) తర్వాత 12 రోజుల వరకూ మార్చింది. అలా, ముందరి బెంచ్ ‘అత్యంత తీవ్రమైనదీ, అవాంఛనీయమైనదీ’ అని వ్యాఖ్యానించిన నిషేధాన్ని విధించింది. ఆ నిషేధాన్ని సరిగ్గా దీపావళి అయిపోయిన వెంటనే ఉపసంహరించింది. అలా ఒక తీర్పును సమీక్ష లేకుండా సమీక్షించడం, అధికారికంగా నిషేధం విధించకుండా నిషేధాన్ని అమలు చేయడం అన్న లక్ష్యం నెరవేరింది. దానికి బెంచ్ ఇచ్చుకున్న సమర్ధన ఏంటంటే ‘ఢిల్లీలో దీపావళి సమయంలో కాలుష్యాన్ని తగ్గించడం మీద సానుకూల ప్రభావం చూపుతుందా లేదా అన్న అంశాన్ని పరీక్షించడానికే బాణాసంచా అమ్మకం, వాడకాన్ని నియత్రించాం’. (అక్టోబర్ 2017 తీర్పు పేరా 14)

కాబట్టి, ఈసారి ఢిల్లీలో బాణాసంచా నిషేధానికి కారణం కాలుష్యం ‘కాదు’ కానీ కాలుష్యాన్ని తగ్గించిందా లేదా అని ‘పరీక్షించడం’.  

విచిత్రంగా ఉంది కదా. కానీ ఆ ‘పరీక్ష లేదా ప్రయోగం’ ఫలితాల మీదనే ఆ కేసు ఆధారపడింది. ఆ ఫలితాలను రెండు నివేదికలుగా కోర్టుముందు ఉంచారు. ఆ నివేదికల సారాంశం, వాటికి కోర్టు చేసిన వ్యాఖ్యానం ఇలా ఉన్నాయి...

2017 దీపావళి నాడు ఢిల్లీలో కాలుష్యం స్థాయిపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇలా చెప్పింది.. ‘‘నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ స్థాయులు నిర్ణీత పరిమితుల లోపలే ఉన్నాయి. నగరంలో కొన్నిచోట్ల పీఎం 2.5, పీఎం 10 స్థాయులు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. అయితే అవి రెండు మూడు రోజుల్లో మళ్ళీ తగ్గిపోయాయి. వాటివల్ల ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావమూ లేదు.’’

ఈ నివేదిక చెప్పిన విషయం ముఖ్యమైనదే, కానీ అది చెప్పకుండా వదిలివేసిన విషయం అంతకంటె ముఖ్యమైనది. అదేంటంటే... దీపావళి కాని రోజుల్లో కాలుష్యం స్థాయులు అంతకంటె చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ఉదాహరణకి... 2017 అక్టోబర్ 20 దీపావళి రోజు పీఎం 10 స్థాయి 365 ఉంటే ఆ రోజుకు చాలా నాళ్ళ తర్వాత,  2018 జూన్ 12న పీఎం 10 స్థాయి 933 ఉంది. అంటే రెట్టింపు కంటె ఎక్కువ. అంటే, ఢిల్లీ కాలుష్యానికి కారణాలు వేరే ఉన్నాయి. కాలుష్యం పెరుగుదలలో అవి మరింత ముఖ్యమైనవి కూడా అయి ఉండవచ్చు. కానీ వాటిని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.

అంతకంటె దారుణమైన విషయం... వాయు నాణ్యత మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపించే గాలి వేగం, గాలిలో తేమ వంటి మౌలికమైన అంశాలను నమోదు చేయడం అసలు అవసరం ఉందని కూడా మండలి భావించలేదు. కాబట్టి, వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం ప్రభావం వాయు కాలుష్యం పెరుగుదల మీద ఎంతుందో, మండలి గణాంకాల ద్వారా తెలుసుకోవడం అత్యాశే.

అంతేకాదు, పార్టిక్యులేట్ మేటర్‌లో ఉన్న రసాయనాలు ఏంటన్నది పరిశీలించే ప్రయత్నం కాలుష్య నియంత్రణ మండలి చేయలేదు. అవేంటో తెలిస్తే కాలుష్యానికి అసలు కారణాలేంటి, అవి ఎంత మొత్తంలో జమ అవుతున్నాయన్న విషయం తెలిసేది. ఆ కోణంలో ఐఐటీ కాన్పూర్ అధ్యయనం చేసింది. పార్టిక్యులేట్ మేటర్‌ను పూర్తిస్థాయి రసాయనిక విశ్లేషణ చేసింది. ఆ విశ్లేషణ ప్రకారం ఢిల్లీ కాలుష్య కారకాల్లో బాణాసంచా లేదు. అంటే ఢిల్లీలో దీపావళి సమయంలో కాల్చే టపాసులే ఆ నగరంలో కాలుష్యానికి కారణం అనే వాదన శాస్త్రీయ పరీక్షకు నిలవలేదు.

అలాగే, ప్రజారోగ్యంపై ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక సైతం, ‘బాణాసంచా కాల్చడం వల్ల ప్రతికూల ప్రభావం సాంఖ్యకంగా ప్రాధాన్యం లేనిదిగా ఉంది’ అని పేర్కొంది. నివేదిక రెండో భాగంలోని నాల్గవ పాయింట్ ప్రకారం కమిటీ చెప్పిన పై మాటలకు అర్ధం ఢిల్లీ పౌరుల ఆరోగ్యం మీద బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ వారు కనుగొనలేకపోయారని అర్ధం. అలా, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన నిర్దిష్టమైన నిర్ధారణతో బాణాసంచాకు వ్యతిరేకంగా వేసిన కేసు అక్కడే ముగిసిపోవాలి. ఎందుకంటే ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని, పూడ్చలేని నష్టమూ కలుగుతాయన్న వాదనతో కదా కేసు వేసింది.

ఆశ్చర్యకరంగా, కోర్టు ఆ నివేదికను మరోరకంగా వ్యాఖ్యానించింది. ‘సాంఖ్యక ప్రాధాన్యత’ అన్న సాంకేతిక పదాన్ని దాని నిజమైన అర్ధంలో పరిగణించలేదు. ఫలితంగా కోర్టు తానే నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను దానికి పూర్తి వ్యతిరేకమైన అర్ధంలో వ్యాఖ్యానించింది.

అంతే కాదు, కోర్టు సాక్ష్యాధార సహితమైన శాస్త్రీయమైన నివేదికలను పక్కన పెట్టి, వ్యక్తిగత పిటిషనర్లు చేసిన అనిర్ధారితమైన ప్రకటనల మీద ఆధారపడింది. జాతీయ హరిత ట్రిబ్యునల్, ఐఐటీ కాన్పూర్, స్వయంగా తానే నియమించిన కమిటీ సమర్పించిన నివేదికలను పక్కన పెట్టేసింది. తీర్పు సారాంశంలో ఆ విషయం స్పష్టంగా ఉంది.  

ఫలితంగా, సుప్రీంకోర్టు 2018 అక్టోబర్ 23న ఇచ్చిన తుదితీర్పులో ఒక్క ఢిల్లీలోనే కాకుండా, దేశవ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్ కాకుండా మిగతా అన్నిరకాల బాణాసంచా తయారీ, అమ్మకాల మీద నిషేధం విధించింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023