ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ (sikhs for justice) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని భగ్నం చేశామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హత్య కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తా అనే ఒక వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ప్రకటించింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తోన్న సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని భగ్నం చేశామని అమెరికా పోలీసులు తెలిపారు. దీనిపై భారత్‌కు సమాచారం అందించారు.
నిఖిల్ గుప్తాను జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. పన్నూ హత్యకు నిఖిల్‌కు భారత్ నుంచి సంకేతాలందాయనే వాదనను భారత్ కొట్టిపారేసింది. పన్నూ హత్య కుట్రలో నిఖిల్‌కు ఉన్న సంబంధాలపై ఎలాంటి ఆధారాలు అమెరికా వద్ద లేవని భారత్ తెలిపింది. ఈ కేసు కారణంగా భారత్ అమెరికా దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ ఈ కేసులో నిఖిల్ గుప్తా దోషిగా తేలితే 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది.