అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి
దేశాలు వద్దు వద్దంటూ హెచ్చరిస్తున్నా, ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను
కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ‘టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్ను తయారు
చేసినట్లు వెల్లడించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన ఓ
కార్యక్రమంలో దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ పాల్గొన్నారు. జలాంతర్గామిని పరిశీలించారు.
దానినుంచి అణ్వాయుధాలను సైతం ప్రయోగించవచ్చునని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ
పేర్కొంది.
ఈ జలాంతర్గామికి ‘హీరో కిమ్ గన్ ఓకే’ అని
పేరు పెట్టారు. దీన్ని సోవియట్ కాలం నాటి రోమియో సీరీస్ జలాంతర్గామి డిజైన్
ఆధారంగా రూపొందించారు. అయితే రష్యన్ మోడల్‌లో పెద్దస్థాయిలోనే మార్పుచేర్పులు
చేసారని తెలుస్తోంది. ఈ జలాంతర్గామి నుంచి రెండు వరుసల్లో 10 న్యూక్లియర్
బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు.
కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్‌తో
యుద్ధానికి రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటోంది. ఆ నేపథ్యంలో కిమ్ రష్యాలో
పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా అంచనా వేస్తోంది. గత నెలలో రష్యా రక్షణ మంత్రి
సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి
అడ్రియన్ వాట్సన్ తెలిపారు. క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని
చెప్పారు. అదే సమయంలో సరికొత్త న్యూక్లియర్ అటాక్ సబ్‌మెరైన్‌ను ప్యాంగ్‌యాంగ్ ప్రయోగించడం
విశేషం.
ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా చేపట్టిన
సంయుక్త సైనిక విన్యాసాలు ముగియడంతోనే ఉత్తర కొరియా పెద్దఎత్తున క్రూయిజ్
క్షిపణుల్ని సముద్రం పైకి ప్రయోగించింది. 11 రోజులపాటు జరిగిన అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలు
తమపై దురాక్రమణ కోసమేనని ఆరోపించింది.