ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ మరో రోజు పొడిగించారు. గురువారం ఉదయం కాల్పుల విరమణ సంధి ముగియాల్సి ఉంది. అయితే కాల్పుల విరమణ మరో 24 గంటలు పొడిగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ (hamas israel seizefire) అంగీకరించాయి. దీంతో శుక్రవారం ఉదయం వరకు కాల్పుల విరమణ కొనసాగుతోంది. కాల్పుల విరమణ మరికొన్ని రోజులు పొడిగించుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 210 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. హమాస్ చెరలోని 97 మంది బందీలకు విముక్తి లభించింది. ఇంకా 138 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారని, వారిలో 20 మంది మహిళలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రకటించింది.
జెరూసలెంలో ఉగ్రదాడి
జెరూసలెంలో గురువారం ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు కారులో వచ్చిన ఇద్దరు పాలస్తీనా ఉగ్రవాదులు జెరూసలెం వైజ్‌మన్ స్ట్రీట్ బస్టాప్ వద్ద ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు.
హమాస్ చెరలో చిన్నారి మృతి
హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో 10 నెలల చిన్నారి చనిపోయాడు. అతడి తల్లి, చిన్నారి సోదరుడు కూడా మరణించారు. కాల్పుల విరుమణకు కొద్ది రోజుల ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాయపడి వీరు మరణించినట్లు తెలుస్తోంది.