Thursday, November 30, 2023

Odisha-365
google-add

వరల్డ్ హిందూ కాంగ్రెస్ 2023 ఏర్పాట్లు ముమ్మరం

P Phaneendra | 11:11 AM, Sat Nov 18, 2023

World Hindu Congress 2023 is nearing

నాలుగేళ్ళకోసారి జరిగే వరల్డ్ హిందూ కాంగ్రెస్ ఈ యేడాది థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ ప్రపంచ హిందూ సమావేశం ఈ నెల 24, 25, 26 తేదీల్లో అంటే మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకోడానికి గడువు నవంబర్ 20తో ముగుస్తుంది.

వరల్డ్ హిందూ కాంగ్రెస్ చైర్మన్ సుశీల్ షరాఫ్ ఈ కార్యక్రమం గురించిన వివరాలు ఇలా తెలియజేసారు. ‘‘రిజిస్ట్రేషన్ల తుది గడువు నవంబర్ 20తో ముగుస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేవారికి సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నాము. డాక్టర్ మోహన్ భాగవత్, మాతా అమృతానందమయి, యోగి ఆదిత్యనాథ్, ఇంకా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది గొప్ప వక్తలు హాజరై తమ ఉపన్యాసాలతో ఆహూతులను అలరిస్తారు. దాంతో కార్యక్రమంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి థాయ్‌లాండ్, భారతదేశాల నుంచి మా స్వచ్ఛంద సేవకులు నెలల తరబడి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు’’ అని చెప్పారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది హిందువులు ఆసక్తి చూపిస్తున్నారని సుశీల్ షరాఫ్ వివరించారు. రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశాల్లో జరిగే ప్రభావశీల చర్చలు, వాటిని అమల్లోకి తెచ్చే అవకాశాలపై హిందువులు ఉత్సుకతతో ఉన్నారనీ, అందువల్లే రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయనీ ఆయన అన్నారు.  

‘‘2024 జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆ సందర్భంగా మా బృందం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది’’ అని షరాఫ్ ప్రకటించారు.

వరల్డ్ హిందూ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా నిర్ణీత ఇతివృత్తానికి సంబంధించిన ఏడు కాన్ఫరెన్స్‌లు జరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ, విద్య, మీడియా, రాజకీయాలు, సంస్థలు, మహిళా-యువజన వ్యవహారాలు వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.

ఈ ఏడు సమావేశాలూ ఒకేసారి సమాంతరంగా జరుగుతుంటాయి. ఒక్కో కాన్ఫరెన్స్‌లో ఆరు సెషన్లుంటాయి. వాటిలో రకరకాల అంశాలపై చర్చలు జరుగుతాయి. ఆసియాన్ దేశాలు-భారత్ మధ్య ఉత్పాదకరంగంలో భాగస్వామ్యం, సృజనాత్మక అంకుర సంస్థలు, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో విద్య నాణ్యత, పాశ్చాత్య అధ్యయనాల్లో సమస్యలు-పక్షపాత ధోరణులు, టెక్నాలజీ ఆధారిత మీడియా నియంత్రణ, వినోదరంగంలో సంస్కృతి ప్రాధాన్యత, హిందూ అస్తిత్వంపై మూస ముద్రలు, హిందూ దేవాలయాలు-వాటి భూములను విముక్తం చేయడం, మానవహక్కుల ఉల్లంఘనలు వంటి అంశాలపై సవిస్తారంగా చర్చలు నిర్వహిస్తారు. ఈ ప్లీనరీ సెషన్స్‌లో బహుళరంగ నిపుణులైన మేధోవేత్తలు సమకాలీన అత్యవసర అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.  

ఈ కార్యక్రమానికి థాయ్‌లాండ్‌ ప్రభుత్వం సహకారం అందజేస్తోంది. అందులో భాగంగా, మే 2024 వరకూ భారతీయ పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కార్యక్రమం కోసం థాయ్‌లాండ్‌ వెళ్ళేవారు అంకోర్‌వాట్‌ వంటి సాంస్కృతిక సందర్శనీయ స్థలాల్లో పర్యటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి మీరూ వెళ్ళాలనుకుంటున్నారా.. అయితే త్వరగా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం https://events.worldhinducongress.org/WHC2023 వెబ్‌సైట్‌ను చూడండి.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం