Monday, December 11, 2023

Odisha-365
google-add

దీపావళి – బాణాసంచా – కాలుష్యం: వాస్తవాలు 5

P Phaneendra | 11:18 AM, Tue Nov 14, 2023

Deepavali - Crackers - Pollution: Facts5

బాణాసంచా విషయంలో ఇతర దేశాల వైఖరి

మన దేశంలో మనదైన పండుగ దీపావళి సమయంలో బాణాసంచా విషయంలో న్యాయస్థానాల వైఖరి ఎలా ఉందో గత నాలుగు వ్యాసాల్లో చూసాం. ఇంతకీ, బాణాసంచా ఒక్క మనదేశంలోనే వాడుతున్నారా, విదేశాల్లో వాడడం లేదా? ఆ దేశాల వైఖరి ఎలా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం.

భారతదేశంలో భారతీయమైన పండుగ సమయంలో సంప్రదాయిక బాణాసంచా వినియోగం మీద ఎంత అల్లరి జరిగింది! ఆ లెక్కన విదేశాల్లో కాలుష్యం పేరిట ఇంకెంత హంగామా జరిగి ఉండాలి! విచిత్రంగా వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. టపాసులను నిషేధించడం కాదు, అసలు బాణాసంచాకు ప్రత్యేక మినహాయింపులు కూడా ఇస్తున్నారు.

ఉదాహరణకి ఇంగ్లండ్ సంగతి చూద్దాం. అక్కడ బాణాసంచాపై నిషేధం ఊసే లేదు. పైగా దీపావళి సహా పలు పండుగ సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపులు కూడా ఇస్తున్నారు. బాణాసంచా కాల్చాలన్న సరదా ప్రజల్లో కలిగేలా ప్రోత్సహిస్తున్నారు.

దీపావళితో ఎలాంటి సాంస్కృతికమైన, నాగరికత పరమైన సంబంధమూ లేని ఇంగ్లండ్ లాంటి దేశం ఆ పండుగ రోజు బాణాసంచా కాల్చడానికి ప్రత్యేక అనుమతులు ఇస్తోంది. దీపావళి పండుగ పుట్టిన గడ్డ, భారతదేశంలో మాత్రం ఆ పండుగ నాడు బాణాసంచా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తుందా? ఇంతకు మించిన విషాదం ఏముంటుంది?

బాణాసంచా వాడకం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉంది. వ్యక్తిగత వినియోగానికో, బహిరంగ ప్రదర్శనల్లోనో టపాసులు కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నిచోట్ల బాణాసంచా వాడకంపై ఆంక్షలున్నాయి. కానీ అవి భద్రతకు సంబంధించిన ఆంక్షలే తప్ప పర్యావరణానికి సంబంధించినవి కాదు. ఇక బాణాసంచాని పూర్తిగా నిషేధించిన దేశం ప్రపంచంలో ఒక్కటైనా లేదు.

కెనడాలోని మాంట్రియల్‌, మొనాకోలోని మాంటెకార్లో వంటి చోట్ల బాణాసంచా కాల్చే భారీ పోటీలు జరుగుతాయి. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ప్రతీయేటా వరల్డ్ పైరో ఒలింపిక్స్ నిర్వహిస్తారు. జపాన్‌లో హనాబీ పండుగ సమయంలో దాదాపు నెలరోజుల పాటు ప్రతీరోజూ బాణాసంచా కాలుస్తారు. ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే (జులై 14) వేడుకల్లో భారీగా బాణాసంచా కాలుస్తారు.

ఇంక దాదాపు అన్ని దేశాల్లోనూ ప్రతీ యేటా నూతన సంవత్సర వేడుకలు, హాలోవీన్ వంటి పండుగలు, జాతీయ దినాల సంబరాలు బాణాసంచా ప్రదర్శన లేకుండా ఉత్సవాలు పూర్తికావు.

అవన్నీ అటుంచండి, అమెరికా గురించి నిర్దిష్టంగా చూద్దాం. ఎందుకంటే ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో కఠినమైన చట్టాలు అమలు చేస్తున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దాన్నిబట్టి చూస్తే బాణాసంచా వినియోగంపై అమెరికాలోనూ నిషేధం ఉండి ఉండాలి అనిపిస్తుంది కదా. కానీ వాస్తవమేంటంటే, మొత్తం ప్రపంచంలో బాణాసంచా అతిఎక్కువగా వాడే దేశం అమెరికాయే. వాళ్ళు ప్రతీయేటా పదివేల కోట్ల రూపాయల విలువైన టపాసులు కాలుస్తారు. అది భారతదేశంలో బాణాసంచా వినియోగానికి ఐదు రెట్ల కంటె ఎక్కువ. మన దేశంలో ఏడాదికి కాల్చే టపాకాయల విలువ 18వందల కోట్లు.  

వింతగా ఉంది కదా... భారతదేశం కంటె అత్యున్నత ప్రమాణాలతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్ వంటి దేశాల్లో ఏ ఒక్కచోటా బాణాసంచాపై నిషేధం లేదు ఎందుకు? ఏం, ఆ దేశాలకు పర్యావరణం గురించి పట్టింపు లేదా? లేక బాణాసంచా ఈ ప్రపంచమంతటికీ కలిగించే ‘అత్యంత వినాశకరమైన’ ప్రమాదాన్ని వారు అర్ధం చేసుకోలేకపోతున్నారా?  లేక భారతదేశంలో బాణాసంచాపై నిషేధానికి కారణం పర్యావరణంపై ప్రేమ కాకుండా, మరే ఇతర కారణమైనా అయి ఉంటుందా?

ఈ అంశంపై, అమెరికాలో కాలుష్య పర్యవేక్షణ అధికారి ఒకరు ఒక సందర్భంలో ఇచ్చిన జవాబు అత్యుత్తమమైనది. అది (జులై 4) ఒక్క రోజు మాత్రమే. సంవత్సరంలోని 365 రోజుల్లో ఒకేఒక్క రోజు. దానిగురించి అంత బట్టలు చింపేసుకోవడం దేనికి?’’

ఈ వ్యాస పరంపరను ముగించే ముందు ఒక ఆఖరి ముచ్చట చెప్పుకుందాం. సుప్రీంకోర్టు బాణాసంచా నిషేధం విధిస్తూ ఒక ఆదర్శప్రాయమైన మాట చెప్పింది. చిత్రమేంటంటే, అది ఆదర్శంగా కాగితాల్లోనే ఉంది తప్ప దాని ఆచరణ సాధ్యాసాధ్యాల గురించి న్యాయస్థానం ఆలోచించనే లేదు.  

సుప్రీంకోర్టు తన 2018 అక్టోబర్‌ నాటి నిషేధ ఉత్తర్వుల్లో ఏం చెప్పింది? ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ మాత్రమే వాడాలి అంది. అవి తప్ప మామూలు టపాసుల ఉత్పత్తి, అమ్మకాల మీద నిషేధం విధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటికి దేశంలో గ్రీన్ క్రాకర్స్ అనేవి లేనేలేవు. ప్రభుత్వ ప్రయోగశాలల్లో గ్రీన్ క్రాకర్స్ గురించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా, అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఐదేళ్ళ తర్వాత కూడా, అసలు మనదేశంలో గ్రీన్ క్రాకర్స్‌ అందుబాటులో ఉన్నాయా అన్న విషయాన్ని నిర్ధారించి చెప్పగలిగేవారు ఎవరూ లేరు.

ఈ ఐదేళ్ళలోనూ వేలకోట్ల రూపాయల విలువైన టపాసులు తయారయ్యాయి, అమ్ముడయ్యాయి, వాడబడ్డాయి. వాటిలో గ్రీన్ క్రాకర్స్‌ ఎన్ని? దీనికి సమాధానం అందరూ ఊహించగలరు. నిజమేంటో అందరికీ తెలుసు, అందరూ అర్ధం చేసుకోగలరు. ఉత్పత్తిదారుడు, విక్రేత, కొనుగోలుదారు, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, మీడియా, ఆఖరికి కోర్టులకు కూడా ఏం జరుగుతోందో తెలుసు. కానీ, రాజుగారి దేవతా వస్త్రాల గురించి మాట్లాడేది ఎవరు? ప్రస్తుతానికైతే ఎవ్వరూ లేరు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం