Monday, December 11, 2023

Odisha-365
google-add

దీపావళి – బాణాసంచా – కాలుష్యం: వాస్తవాలు 4

P Phaneendra | 00:01 AM, Tue Nov 14, 2023

Deepavali - Crackers - Pollution : Facts 4

 

నివారణ సూత్రపు అభాస

దేశంలో బాణాసంచా నిషేధానికి దారితీసిన కారణాల గురించి తెలుసుకున్నాం. వాటిని నిశితంగా పరిశీలిస్తే అవన్నీ ఓటివీ, పరిహాసాస్పదమైనవీ అని సులువుగా అర్ధమవుతుంది.

పిటిషనర్లు, బహుశా న్యాయస్థానం కూడా... ఆ కారణాలు, వాటికి అనుకూలంగా చూపిన సమాచారం అంత నమ్మదగినదిగా లేవని... భావించినట్లున్నాయి. అందుకే ‘ప్రికాషనరీ ప్రిన్సిపల్ – నివారణ సూత్రం’ అనే ఓ కొత్త పదార్ధాన్ని పట్టుకొచ్చారు. దానికి ఎలాంటి సమాచారం అక్కర్లేదు. సాక్ష్యాలూ, ఆధారాలూ, తర్కమూ ఏమీ అక్కర్లేదు. కేవలం కొద్దిమందికి విషయం మీద ఉండే ‘అభిప్రాయం’ ఒక్కటే చాలు. ఈ టపాకాయల నిషేధం కేసులో ఆ సూత్రాన్నే ఉపయోగించి, దేశ ప్రజలు అందరి మీదా తీర్పు రుద్దారు.

ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏమిటి? సరళంగా చెప్పుకోవాలంటే, ‘చికిత్స కంటె నివారణ మంచిది’ అన్న సామెతే. పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో, పర్యావరణకు తీవ్రమైన, మళ్ళీ బాగుచేయలేనంత నష్టం కలిగే ప్రమాదం పొంచివున్నప్పుడు ఈ సూత్రాన్ని వాడడానికి సాధారణ ఆమోదం ఉంది. అంటే ఏదైనా వ్యవహారం లేదా ప్రాజెక్ట్ లేదా ఉత్పత్తి వల్ల వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది అనడానికి తగినంత శాస్త్రీయ ఆధారం లేకపోయినా, దాన్ని నియంత్రించడానికో లేక నిలిపివేయడానికో ఈ సూత్రాన్ని ఉపయోగించడానికి చట్టం అంగీకరిస్తుంది.

ఇంకోలా చెప్పాలంటే ఈ ప్రికాషనరీ ప్రిన్సిపల్... ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, ఉపా యాక్ట్‌లను కలిపిన మిశ్రమం లాంటిది. కేవలం అనుమానం మీద ఎవరినైనా అరెస్ట్ చేసేయవచ్చు, ఆపై, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత అరెస్టయిన వ్యక్తిదే.

టపాసుల కేసులో నివారణ సూత్రం వైరుధ్యం

న్యాయస్థానం తీర్పును చదివాక మనం గ్రహించిందేంటంటే... వాయుకాలుష్యం పెరగడానికీ, ప్రజారోగ్యం పాడవడానికీ బాణాసంచాతో సంబంధం లేదని చెప్పే శాస్త్రీయమైన సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ ప్రమాదకర పరిస్థితులకు టపాసులతో ముడిపెట్టాలని ఆ కేసు పిటిషనర్లు, న్యాయస్థానం నిస్సందేహంగా నిశ్చయించుకున్నాయి.   

2018 తీర్పులోని 30, 31 పేరాల్లో ‘‘దీపావళి నాడు బాణాసంచా కాల్చడానికీ వాయుకాలుష్యానికీ కచ్చితంగా సంబంధం ఉంది.... దీపావళి బాణాసంచా వల్ల ప్రతికూల ప్రభావాలను నిర్ధారించే శాస్త్రీయమైన అధ్యయనం లేదని ప్రతివాదులు చేసిన వాదనలను పూర్వపక్షం చేయడానికి ఈ సమాచారం చాలు’’ అంటూ, తమ అభిప్రాయాన్ని సమర్ధించుకున్నారు.

అంత నిస్సందేహంగా వ్యాఖ్యానించినప్పటికీ... పిటిషనర్లు, కోర్టు తమ భావాలను తీర్పులో చొప్పించడం కోసం నివారణ సూత్రం మాటున దాక్కున్నారు. వారి ఆ చర్య కేవలం నివారణ జాగ్రత్తలు తీసుకోడం కోసమే కాదు, తమ వాదనకు అనుకూలంగా సరైన ఆధారాలూ, తగినంత శాస్త్రీయ సమాచారమూ లేకపోవడాన్ని కప్పిపుచ్చుకోడానికే. ఆ విషయాన్ని కూడా తీర్పులోనే చెప్పారు.

తీర్పులోని 31వ పేరాలో ఇలా ఉంది, ‘‘నివారణ సూత్రాన్ని వర్తింపజేయడానికి ఎలాంటి అధ్యయనాలూ, సమాచారమూ అక్కర్లేదన్న పిటిషనర్ల వాదన పూర్తిగా సరైనదే. ‘నివారణ’ అన్న పదం దాన్నే సూచిస్తుంది. కచ్చితమైన అధ్యయనాలు లేకపోయినా నివారణ పేరిట చర్యలు తీసుకోవచ్చు.’’

పిటిషనర్లు ఉపయోగించిన సమాచారం వారు చెప్పుకున్నట్లు నిర్దిష్టమైనదే అయితే, వారు ఈ నివారణ సూత్రం మాటున ఎందుకు తల దాచుకోవలసి వచ్చింది? అది కూడా, తమ వాదనకు అనుకూలమైన సమాచారం లేదన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది? అలా, ఈ సందర్భంలో నివారణ సూత్రాన్ని వాడడం ద్వారా వారు ముందు నుంచీ చేసిన వాదనలు, చూపిన సమాచారంపై వారికే విశ్వాసం లేదని అర్ధమవడం లేదూ?

ఆ సంగతి అటుంచండి. ఎలాగూ కోర్టు నివారణ సూత్రాన్ని ఉపయోగించింది కాబట్టి, ఈ సందర్భంలో దాని వాడకంలోని గుణదోషాలను పరిశీలిద్దాం.

బాణాసంచా కేసులో నివారణ సూత్రం వినియోగంలో దోషాలు

నివారణ సూత్రాన్ని ఉపయోగించడానికి కేసులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉండాలి. అవేంటంటే...

-      నష్టం, లేదా నష్టం జరిగే ప్రమాదం తీవ్రమైనదీ, తిరిగి పూడ్చలేనిదీ అయి ఉండాలి

-      సరైన శాస్త్రీయ జ్ఞానం అందుబాటులో లేనందున ప్రమాద తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం అసాధ్యమై ఉండాలి

-      పై రెండో కారణం వల్ల, ప్రస్తుత పరిస్థితిని మార్చాలనుకుంటున్న పక్షమే నిరూపణ బాధ్యత వహించాలి

మొదటి, మూడవ పాయింట్లకు ఆధారం రెండో పాయింటే. ప్రమాదాన్ని గణించడానికి శాస్త్రీయ పద్ధతి లేదా విధానం లేకపోవడం వల్ల మాత్రమే నిరూపణ బాధ్యతను, ఆ చర్య ప్రతిపాదకుడి మీదకో లేదా యథాతథ స్థితిని మార్చాలనుకుంటున్న పక్షం మీదకో మార్చాలా? అది తెలుసుకోడానికి, ఈ కేసులో శాస్త్రీయ పద్ధతి లేమి గురించి ముందుగా చూద్దాం.

ఇక్కడ మదింపు వేయవలసిన ముఖ్యమైన అంశాలేంటంటే...

(అ) వాయుకాలుష్యానికి కారకం ఎంతశాతం కారణం అవుతోంది: ఈ శాతాన్ని చాలా సందర్భాల్లో చాలాసార్లు గణించారు, పలు కోర్టు కేసుల్లోనూ ఉపయోగించారు. అలాంటి కొన్ని సందర్భాలు చూద్దాం.

- ఢిల్లీ వాయుకాలుష్యంలో సుమారు 20శాతం వాహనాల వల్ల కలుగుతున్నదే

- ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న 13 విద్యుత్ ప్లాంట్ల నుంచి 80శాతం సల్ఫేట్, 50శాతం నైట్రోజన్ కారకాలు విడుదలవుతున్నాయి

- ఢిల్లీలో పీఎం 2.5 కాలుష్యానికి రవాణా రంగం 41శాతం, గాలిలోని ధూళి 21.5శాతం, పరిశ్రమలు 18.6శాతం కారణం అవుతున్నాయి

ఈ గణాంకాలను బట్టి, ఈ విలువలను లెక్కగట్టడానికి శాస్త్రీయ లేమి ఎంతమాత్రం కారణం కాదని అందరికీ స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఈ కేసులో అత్యంత మౌలికమైన, అత్యంత కీలకమైన ప్రశ్న అడగడానికి ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు? ఆ ప్రశ్న ఏంటంటే ‘‘ఢిల్లీలో కానీ, భారతదేశంలో కానీ వాయుకాలుష్యానికి బాణాసంచా ఎంతశాతం కారణం అవుతోంది?’’ నిజం. ఈ కేసు విచారణలో ఈ ఫ్రశ్న ఒక్కసారి కూడా రాలేదు.

కాలుష్య శాతాన్ని గణాంకాలలో కొలవకుండా సందిగ్ధావస్థని కొనసాగించడం బహుశా కొన్ని వర్గాలకు ప్రయోజనాలను సాధించడంలో సాయపడుతుందేమో. వారు అసలైన సమాచారానికి బదులు వట్టి ఓటిమాటలతో తమ వాదనలను నింపేస్తారు. ఆ డొల్ల వాదనలు ఎలా ఉంటాయంటే ‘‘కాలుష్యానికి టపాసులు ఒక్కటే కారణం కాకపోయినప్పటికీ, టపాసుల వల్ల కలిగే కాలుష్యం తక్కువే అయినప్పటికీ, బాణాసంచా నిషేధం ఒక్కటే పర్యావరణాన్ని పరిశుద్ధం చేసేస్తుంది. అది ఎంత చిన్న మొత్తమైనా పర్వాలేదు. ఆఖరికి, ప్రతీ ఒక్క చుక్కా లెక్కలోకి వస్తుంది కదా.’’

(ఆ) ప్రజారోగ్యంపై బాణాసంచా ప్రభావం: దీన్ని కూడా సులువుగా లెక్కగట్టవచ్చు. నిజానికి ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ పని చేసింది కూడా. బాణాసంచా కాల్చడం వల్ల మానవుల ఆరోగ్యంపై ఎలాటి ప్రతికూల ప్రభావం లేదని ఆ కమిటీ నివేదిక పేర్కొంది.

అందువల్ల ఈ కేసులో, వాయుకాలుష్య కారకాల్లో బాణాసంచా వాటా లెక్కించడంలో కానీ, ప్రజారోగ్యంపై టపాసుల ప్రభావాన్ని గణించడంలో కానీ శాస్త్రీయ పద్ధతుల లేమి అనేది లేనే లేదని స్పష్టంగా కనిపిస్తోంది.

అలాంటప్పుడు ఈ కేసులో నివారణ సూత్రాన్ని వినియోగించడం, సమాచార లేమి కారణాన్ని అడ్డం పెట్టుకోవడం దేనికి? ఆ కారణాలు ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది. శాస్త్రీయ అధ్యయనాల ద్వారా సేకరించిన సమాచారం ‘కొంతమంది’కి నచ్చనట్లు అర్ధమవుతుంది. సమాచారం లేమి అనేది లేదు కాబట్టే, విశ్వసనీయమైన సమాచారాన్ని నమ్మదగినది కాదు అని చూపడానికి నివారణ సూత్రం అనే ముసుగు కప్పారని అర్ధమవుతుంది. అంతే కాదు, కథ అప్పుడే అయిపోలేదు. ఇంకా భయంకరమైన విషయం ముందుంది.

పైన చెప్పుకున్న మూడు పాయింట్లలో మూడవది – ‘నిరూపణ బాధ్యత యథాతథ స్థితిని మార్చాలనుకుంటున్న పక్షం మీదనే ఉంటుంది’ – అన్న అంశంపైన ఎవరూ తగినంత దృష్టి సారించలేదు. ఈ కేసులో యథాతథ స్థితిని మార్చింది ఏ పక్షమో గమనించండి. భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా కొన్ని శతాబ్దాలుగా బాణాసంచాను ఏ సమస్యలూ లేకుండా వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ‘యథాతథ స్థితి’ని మార్చాలంటే ఆ పనిని కోర్టులే చేయాలి. కాబట్టి తార్కికంగా చూస్తే ‘నిరూపణ బాధ్యత’ కోర్టుల మీదనే ఉంది. ఎంతో అసంబద్ధంగా అనిపిస్తోంది కదూ.

మరింత స్పష్టత కోసం కొన్ని ఉదాహరణలు చూద్దాం...

ఎంసీ మెహతా (లేక్స్ కేస్): చెరువుల వద్ద కొత్త నిర్మాణాలకు అనుమతులు అడిగారు, కానీ ఇవ్వకుండా నిలిపివేసారు.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వెర్సెస్ ఎంవి నాయుడు కేసు: కొత్త రసాయన పరిశ్రమ పెట్టాలి, నిలిపివేసారు.

జపాన్-న్యూజీలాండ్ మధ్య బ్లూస్ సీ టర్టిల్ ఫిషింగ్ కేసు: పర్యావరణ పరంగా సున్నితమైన ప్రదేశంలో కొత్తగా చేపల వేటకు ప్రయత్నాలు జరిగాయి, వాటిని నిలిపివేసారు.

లార్జ్ హేడ్రాన్ కొలైడర్ కేసు: సెర్న్ ప్రయోగశాల పరిశోధనల్లో కొత్త ఎక్విప్‌మెంట్‌ కోసం కోరారు. ఆ కేసులో నివారణ సూత్రం వాడడానికి నిరాకరించి, కొలైడర్‌ను అనుమతించారు.

వీటన్నింటిలోనూ కీలకమైన విషయం ఏంటంటే... ఓ పని మొదలుపెడదామనుకున్నవారు దానిలో ఏదో ఒక ‘కొత్త’ని ప్రతిపాదిస్తున్నారు. మరి మన బాణాసంచా కేసు దగ్గరకు వస్తే, ఆ పని చేసేవారు కాకుండా మరో పక్షం యథాతథ స్థితిని మారుస్తోంది. పైగా మొదటి పక్షం వారు చేస్తున్న పనిలో ‘కొత్త’ ఏమీ లేదు. అలాంటప్పుడు నివారణ సూత్రాన్ని అసలు ఎలా వర్తింపజేస్తారు? అది అనూహ్యం.

మొత్తంగా దీని సారాంశాన్ని టూకీగా చూస్తే...

-      బాణాసంచా తయారీలో కొత్త ఆచరణ లేదా సూత్రీకరణ ఏదీ లేదు

-      ఏ గుణం లేదా దోషాన్ని లెక్కకట్టే శాస్త్రీయ పద్ధతుల లేమి అనేది లేదు

-      బాణాసంచా వల్ల కలిగే వాయుకాలుష్యాన్ని నిర్ధారించే శాతం కానీ, ప్రజారోగ్యంపై దాని ప్రభావం లేవు

-      ప్రజారోగ్యంపై ప్రమాదకరమైన, తిరిగి పూడ్చలేనంత నష్టం కలిగించేంత ప్రభావం కాదు కదా, అసలు ఎటువంటి ప్రతికూల ప్రభావమూ లేదు

అంటే, నివారణ సూత్రాన్ని వర్తింపజేయడానికి అసలు ఇక్కడ కేసే లేదు. ఆ విషయాన్ని ఐఐటీ కాన్పూర్ నివేదిక, సుప్రీంకోర్టు కమిటీ నివేదిక తేటతెల్లంగా చెబుతున్నాయి. ఐఐటీ నివేదిక, ఢిల్లీలో వాయుకాలుష్యం కలగజేయడంలో బాణాసంచా పాత్ర దాదాపు సున్నా అని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు స్వయంగా నియమించిన కమిటీ, ప్రజారోగ్యంపై బాణాసంచా ప్రతికూల ప్రభావం ఏమీ లేదని నివేదిక ఇచ్చింది.

అలా, అసలు ప్రాతిపదికే లేని కేసును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా బాణాసంచాపై నిషేధం విధించింది దేశ సర్వోచ్చ న్యాయస్థానం.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం