భద్రాచలం దక్షిణాపథాన అయోధ్యగా పేరు గాంచిన క్షేత్రం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఆరాధనీయం. ఆ రామయ్య కళ్యాణం కమనీయం, నయన మనోహరం. భద్రాచల రాముడిని అర్చించని తెలుగు వాడు ఉండడు. అంతటి స్వామికి సైతం ఆధునిక ప్రభుత్వాల పాలనలో ఆక్రమణలు తప్పలేదు. ఆ స్వామి దేవస్థానం అధికారులకు కోర్టులకు ఎక్కకా తప్పలేదు. రామయ్య భూముల ఆక్రమణలను ప్రశ్నించిన నేరానికి ఆలయ ఈవోపై ఏకంగా దాడే జరిగింది. ఈ దుర్ఘటన గత మంగళవారం అంటే జూలై 8వ తేదీన చోటు చేసుకుంది.
గ్రామస్తుల దాడిలో స్పృహ తప్పిన ఈఓ:
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారిణి అయిన ఎల్ రమాదేవి మంగళవారం నాడు పురుషోత్తపట్నం వెళ్ళారు. అక్కడ భద్రాద్రి రామయ్య భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటి గురించి వివరాలు సేకరించడానికి, ఆక్రమణదారులను అడ్డుకోడానికీ ఆమె అక్కడికి వెళ్ళారు. అయితే పురుషోత్తపట్నం గ్రామస్తులు ఈఓ రమాదేవిపై దాడికి పాల్పడ్డారు.
రామయ్య భూముల ఆక్రమణల గురించి అడిగిన ఈవోతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఇరు పక్షాల మధ్యా వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఆ క్రమంలోనే అదుపు తప్పిన గ్రామస్తులు ఈఓ మీద దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఈఓ రమాదేవి స్పృహ తప్పిపోయారు. వెంటనే ఈఓను భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఆమెతో పాటే ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి కూడా గాయాలయ్యాయి. అతన్ని కూడా ఆస్పత్రిలో చేర్చారు.
భూమి వివాదం ఏమిటి?
రామయ్య క్షేత్రమైన భద్రాచలం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాచలం ఆలయానికి పురుషోత్తపట్నం గ్రామంలో సుమారు 917 ఎకరాల భూమి ఉంది. ఆ పురుషోత్తపట్నం అనే గ్రామం భద్రాచలానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పరిధిలోకి చేరింది.
పురషోత్తపట్నంలోని దేవుడి మాన్యంలో ఎక్కువ భాగం భూమి ఆక్రమణల్లో ఉంది. దానిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు కూడా నడిచింది. హైకోర్టు ఇటీవలే ఆ మాన్యం భూమి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందుతుంది అని విస్పష్టంగా తీర్పునిచ్చింది. ఇంక ఆలయ భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు కూడా దేవస్థానం వద్దనే ఉన్నాయి. అయినప్పటికీ ఆక్రమణదారులు ఏమాత్రం తగ్గలేదు. స్వామి భూములను ఆక్రమించడమే కాకుండా అక్కడ నిర్మాణాలు సైతం మొదలు పెట్టేసారు.
మన్యం అటవీ ప్రాంతంలో గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చేసారు. అందువల్ల ఆ ప్రాంతంలో క్రైస్తవ జనాభా ఎక్కువ. ఇటీవల ముస్లిం జనాభా కూడా పెరుగుతోంది. స్వామివారి దేవస్థానం భూములను ఆక్రమించుకున్న వారిలో ఎక్కువమంది క్రైస్తవులే అని తెలుస్తోంది. వారు ఆక్రమిత భూముల్లో చర్చిలూ, మసీదులూ ఇప్పటికే కట్టేసుకున్నారు. అలా చాలా కాలం నుంచీ ఆ భూములను ఆక్రమించేసుకున్నారు. హిందూ భక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలూ ఆ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల విషయంలో తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల ముందు ఉంచుతూనే వచ్చారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు కూడా నడిచింది. కోర్టు కేసు తీర్పు దేవాలయానికి అనుకూలంగా వచ్చింది. వివాదంలో ఉన్న భూములు దేవాలయ మాన్యం భూములేనని కోర్టు స్పష్టం చేసింది.
రామాలయం ఈఓపై దాడి:
పురుషోత్తపట్నం గ్రామంలో రామయ్య భూములను ఆక్రమించుకున్న వారిలో ఒకరు ఇటీవల అక్కడ శాశ్వత నిర్మాణం ప్రారంభించారు. ఆ విషయం తెలియడంతో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సిబ్బంది సోమవారం నాడు అక్కడకు వెళ్ళి నిర్మాణ పనులు ఆపేందుకు ప్రయత్నించారు. అయినా దురాక్రమణదారులు తమ పనులు ఆపలేదు. దాంతో భద్రాచలం ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారిణి ఎల్ రమాదేవి మంగళవారం జూలై 8వ తేదీన తన సిబ్బందితో కలిసి స్వయంగా పురుషోత్తపట్నం వెళ్ళారు. దేవస్థానం భూముల్లో నిర్మాణ పనులు చేపట్టకూడదంటూ సూచించారు.
అయితే ఆక్రమణదారులు ఆ భూమిపై హక్కులు తమకే ఉన్నాయని వాదించడం మొదలుపెట్టారు. దాంతో దేవాలయ ఉద్యోగులువారిని నిలదీసారు. భూమిపై హక్కులు వారికే ఉంటే ఆ మేరకు దస్త్రాలు చూపించాలని కోరారు. దానికి స్థానికులు తిరగబడ్డారు. తమ భూములకు సంబంధించిన హక్కు పత్రాలను తాము ఎందుకు చూపించాలంటూ అడ్డగోలుగా వాదించడం ప్రారంభించారు. ఆ దశలో ఈఓ జోక్యం చేసుకున్నారు. దేవాలయ భూములను కబ్జా చేయడం సరైనది కాదనీ, న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందనీ గుర్తు చేసారు. కాబట్టి ఆ భూముల్లో కొత్తగా ఎలాంటి నిర్మాణాలూ చేయవద్దంటూ హితవు పలికే ప్రయత్నం చేసారు.
ఆ క్రమంలోనే ఆక్రమణదారులు ఈఓ మీదకు దూసుకుని వెళ్ళారు. వాగ్వాదం చినికి చినికి గాలి వాన అయింది. గొండవ ముదిరి పెద్దదైంది. ఆ క్రమంలోనే తోపులాట కూడా జరిగింది. గ్రామస్తులు ఈఓను బలంగా నెట్టివేయడంతో ఆమె కింద పడిపోయారు, వెంటనే స్పృహ కోల్పోయారు. ఆమెతో పాటు వెళ్ళిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వినీల్‌కు కూడా దెబ్బలు తగిలాయి.
ఈఓ రమాదేవిని ఆలయ సిబ్బంది భద్రాచలంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వినీల్‌కు కూడా చికిత్స అందించారు. వారు బాగానే కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. ఆ సంఘటనపై కేసు నమోదు చేసామని ఎటపాక సర్కిల్ ఇనస్పెక్టర్ కన్నప్ప రాజు తెలియజేసారు.
ఆక్రమణదారులకు మంత్రుల హెచ్చరికలు:
తెలంగాణ రాష్ట్రప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, గోదావరీ తీర ప్రాంత పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య గుడి మాన్యం భూముల ఆక్రమణలను అడ్డుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
విషయం తెలిసిన వెంటనే భద్రాచలం ఎంఎల్ఎ తెల్లం వెంకట్రావు ఈఓపై దాడి ఘటనను ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేసారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఈఓ రమాదేవిపై దాడిని ఖండించారు. ఆమెతో ఫోన్‌లో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై విచారణ జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలనీ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఈఓపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. దేవాలయ అధికారులపై దాడులను ఎంతమాత్రం సహించబోమంటూ ప్రకటించారు. దేవాలయ భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా మిగిలిపోయిన భద్రాచలం దేవాలయ భూముల వ్యవహారం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు కూడా వచ్చిన నేపథ్యంలో ఆ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆమె విజ్ఞప్తి చేసారు.
రాష్ట్ర విభజనలో భద్రాచలం కథ:
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత భద్రాచలం పట్టణం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం తెలంగాణ భూభాగంలో ఉండిపోయాయి. అయితే ఏడు మండలాలలోని 211 గ్రామాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యాయి. పోలవరం ముంపు మండలాలు కావడంతో ఆ ఏడు మండలాలనూ ఏపీలో కలపాలంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వం కోరగా 2014లో నాటి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తాజాగా వివాదం జరిగిన పురుషోత్తపట్నం గ్రామం కూడా అలా ఆంధ్రప్రదేశ్‌లో చేరిన గ్రామమే.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో ఒకటి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరీ నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం అది. 2021లో భారత ప్రభుత్వం ఐఆర్‌సిటిసి రైల్వే యాత్రా స్పెషల్ ‘రామాయణ సర్క్యూట్’లో భద్రాచలాన్ని కూడా చేర్చింది. తద్వారా రామాయణ సంప్రదాయంలో భద్రాచలం దేవస్థానానికి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని గుర్తించింది.
రామయ్య క్షేత్రం చుట్టూతా క్రైస్తవ ప్రాబల్యం:
ఆంధ్రప్రదేశ్‌లో చేర్చిన ఏడు ముంపు మండలాల్లో అత్యధిక ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు. అందువల్లనే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను ఎస్సీ నియోజకవర్గాలుగా రిజర్వు చేసారు. అయితే గిరిజన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల ప్రాబల్యం చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీలు అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకుని వారిలో చాలామందిని మతం మార్చేసారు. ఎన్నో ఏళ్ళ నుంచీ ఆ మత మార్పిడులు నిరాఘాటంగా సాగుతున్నాయి. అందుకే భద్రాచలం చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాల్లో సైతం అడుగడుగునా చర్చిలు కనిపిస్తాయి. తాజాగా వివాదం జరిగిన పురుషోత్తపట్నంలో సైతం రామయ్య భూముల ఆక్రమణల్లో చర్చిలు కట్టేసిన సందర్భాలు కోకొల్లలు. శ్రీరామచంద్రమూర్తి మీద అమాయక గిరిజనులకు ఉన్న భక్తి విశ్వాసాలను చెదరగొట్టి, వారిని మతం మార్చిన కుట్రల ఫలితాలు ఇప్పుడు భూముల ఆక్రమణల రూపంలో కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.