దేశమంతా కాషాయ జెండా రెప రెపలాడుతున్న వేళ.. భారతీయ జనతాపార్టీ ఆవిర్బావం ఎప్పటికీ ఆసక్తి కరంగా నిలుస్తుంది. 1980 ప్రాంతంలో జనతా పార్టీ నుంచి విడిపోయి బీజేపీ కి ఏర్పాటు అయింది. అంతకు ముందు జనతా పార్టీలో కలిసిపోయిన జనసంఘ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా బీజేపీ కి వచ్చేశారు. అందుచేత బీజేపీ కి మూలం అయిన పార్టీ గా జన సంఘ్ ను చెబుతారు. ఈ జనసంఘ్ పార్టీ స్థాపకులే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. జూలై నెల ఏడో తేదీ ఆయన జయంతి గా పాటించటం ఆనవాయితీ.
డాక్టర్ శ్యామా ప్రసాద్ దేశ భక్తుల కుటుంబం నుంచి వచ్చారు. బెంగాల్‌లో 1901 జూలై 7వ తేదీన అసుతోష్ ముఖర్జీ, రాణి జోగ్మయాదేవిలకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు. 1919లో ఇంటర్ పూర్తి, 1921లో బిఏ ఆనర్స్, 1923లో ఎంఏ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు.1924లో హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తిని మొదలు పెట్టారు. అయితే తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ నియుక్తులయ్యారు.
చిన్న వయస్సులోనే ఆయన పెద్ద పదవులు స్వీకరించారు. 1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావడం మరో పెద్ద మైలురాయి. 1938లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది. 1937లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడిన సమయంలో బెంగాలసహాయ సమితి అనే సంస్థ ద్వారా పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
తర్వాత కాలంలో ఆయన రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకొంది. 1946లో జరిగిన ఎన్నికల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ మరోసారి బెంగాల్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బెంగాల్‌ను పాకిస్తాన్‌లో పూర్తిగా విలీనం చేస్తే భవిష్యత్తులో దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్‌ను తిరిగి భారత దేశంలో కలుపుతారని స్పష్టం చేశారు. బెంగాల్‌లోని హిందూ ఆధిక్య ప్రాంతాలను ఇండియన్ యూనియన్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. దీంతో ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లాయి. అదే విధంగా పంజాబ్‌లోని హిందూ ప్రాంతాలను భారత్‌లోనే కొనసాగించారు. రెండున్నర సంవత్సరాలు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం, సింద్రీ ఎరువుల కర్మాగారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే మూడు భారీ పరిశ్రమలను రూపొందించారు.
శ్యాంప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగు దిద్దుకుని భారతీయ జన సంఘానికి, ఆ తరువాత భారతీయ జనతాపార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయింది. దేశ భవిష్యత్తు కోసం ఆయన తీవ్రంగా ఆలోచించే వారు. విభజన కష్టాలను ఎదుర్కొన్న భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను శ్యాంప్రసాద్ నిశితంగా విమర్శించేవారు. హిందూ శరణార్థుల విషయంలో నెహ్రూ ధోరణిని నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ముఖర్జీ.
కాశ్మీర్ సమస్యను ఇక్కడ మనం పూర్తి గా అర్థం చేసుకోవాలసి ఉంది. 1939లో షేక్ అబ్దుల్లా తన కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్సు పార్టీ పేరును “జమ్మూ – కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్సు” గా మార్చాడు. తద్వారా భారత జాతీయ కాంగ్రెస్ సహకారాన్ని, జాతీయ మీడియా ప్రాబల్యాన్ని సంపాదించగలిగాడు. దీంతో పండిట్ జవహర్లాల్ నెహ్రూకు సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు అయినాడు. నెహ్రూ అబ్డుల్లాని అఖిల భారత సంస్థానాల ప్రజానీకపు మహాసభ అధ్యక్షునిగా నియమించాడు.
1946 మే 10న ‘క్విట్ కాశ్మీర్’ పిలుపునిచ్చి మహారాజా హరిసింగ్ కు, జమ్మూకు చెందిన డోగ్రా వంశపు అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన షేక్ అబ్దుల్లా మరియు ఆయన అనుచరులను కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరాడు నెహ్రూ. వారి విడుదల కోసం అవసరమైతే తానే స్వయంగా కాశ్మీర్ కు వస్తానన్నాడు. షేక్ అబ్దుల్లా ఉద్యమం వెనుక బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నదని, భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగానే ఉద్యమం నడుస్తోందని మహారాజా ఒక లేఖ ద్వారా నెహ్రూకు వివరించే ప్రయత్నం చేశారు. నెహ్రూ వినిపించుకోకుండా షేక్ అబ్దుల్లా, మరియు ఆయన అనుచరుల విడుదల కోసం కాశ్మీర్ కు రావడానికి ప్రయత్నించడంతో మహారాజు కాశ్మీర్లోకి నెహ్రూ రాకను నిషేధించడమే కాక, నిషేధాన్ని ఉల్లంఘించి కాశ్మీర్లోకి ప్రవేశించిన నెహ్రూను కూడా అరెస్టు చేయించారు. దీనితో అహం దెబ్బతిన్న నెహ్రూ అవకాశం వచ్చినప్పుడు మహారాజాకు బుద్ధి చెప్పాలనే ద్వేషభావనతో రగిలిపోతూ వచ్చారు.
అంతేకాక దేశంలోని 600 సంస్థానాలకు భారత్, పాకిస్థాన్ రెండింటిలో ఏ దేశంలోనైనా చేరే స్వేచ్ఛ కల్పించాడు. ఇందులో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన సర్దార్ పటేల్ ముందు చూపుతో వేగంగా వ్యవహరించిన కారణంగా హైదరాబాద్, జునాగడ్, జమ్మూ – కాశ్మీర్ లు మినహా మిగిలిన సంస్థానాలన్నీ 1947 ఆగష్టు 15 నాటికి విలీనం గురించి నిర్ణయం తీసుకున్నాయి. బేషరతుగా భారతదేశంలో విలీనమవుతూ ‘ఇంస్ట్రుమెంట్ ఆఫ్ ఏక్సెషన్’ పత్రంపై ఆయా సంస్థానాధీశులు సంతకాలు చేశారు. హైదరాబాద్, జునాగడ్ సంస్థానాల నవాబులు పాకిస్థాన్లో కలవాలనుకున్నారు. కానీ ఆయా సంస్థానాల ప్రజల ఆకాంక్షలకు సర్దార్ పటేల్ చొరవ తోడవడంతో అవి రెండూ భారత్లోనే విలీనం కాక తప్పలేదు. జమ్మూ – కాశ్మీర్ మహారాజా హరిసింగ్ కు పాకిస్థాన్లో కలవాలన్న ఆలోచన లేదు. కానీ ఆగష్టు 15 లోపు విలీనం విషయమై నిర్ణయం తీసుకోలేకపోయారు. దానికి కారణం నెహ్రూ.
మిగిలిన అన్ని సంస్థానాలను విలీనం చేసికొనే అంశాన్ని సర్దార్ పటేల్ నిర్వహించగా, జమ్మూ – కాశ్మీర్ ను విలీనం చేసికొనే విషయాన్ని ప్రధానమంత్రి నెహ్రూ తన చేతిలోనే ఉంచుకొన్నారు. జమ్మూ – కాశ్మీర్ ను విలీనం చేసుకోవటం సహజమైన విషయంగా కానీ, దేశ భద్రత దృష్ట్యా ప్రాధాన్యంగల అంశంగా గానీ గుర్తించకుండా మహారాజా హరిసింగ్ తో తనకు గల చేదు అనుభవాలకు బదులు తీర్చుకునే ఒక అవకాశంగా నెహ్రూ భావించారు. కాబట్టి షేక్ అబ్దుల్లాకు పాలనా బాధ్యతలు బదిలీ చేసి, మహారాజా తప్పుకోవాలని, అప్పుడే విలీనం విషయం ఆలోచిస్తామనే ధోరణిలో మాట్లాడారు. ఒక వైపు మౌంట్ బాటెన్ భారతా, పాకా ఏదో ఒకటి తేల్చుకోమని మహారాజాని ఒత్తిడి చేయసాగాడు. తన రాజ్యాన్ని పాక్ లో విలీనం చేసిన మరుక్షణం ముస్లిం మతోన్మాదుల బారి నుండి హిందువుల ధన మాన ప్రాణాలను కాపాడటం అసాధ్యమని మహారాజాకు తెలుసు. పోనీ భారత్లో విలీనమవుదామంటే తన బద్ధ శతృవు షేక్ అబ్దుల్లాకు అధికారం అప్పగించమంటూ పండిట్ నెహ్రూ వత్తిడి మరో వైపు. ఇలాంటి పరిస్థితుల మధ్య రామచంద్ర కాక్ అనే తన ప్రధానమంత్రి సలహా మేరకు భారత్, పాక్ లతో ఒప్పందం చేసుకుని తన రాజ్యాన్ని ఏ దేశంలోనూ విలీనం చెయ్యకుండా స్వతంత్రంగా ఉంచుకునే అవకాశమున్నదని భావించి మిన్నకుండిపోయారు మహారాజా.
మౌంట్ బాటెన్ కూడా ఆశ్చర్యపోయే విధంగా భారత సేనాధిపతులు వేలాది సైనికులను విమానాల ద్వారా కాశ్మీర్ కి అతి తక్కువ వ్యవధిలో పంపారు. లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ రాయ్, మేజర్ సోమనాథ్ శర్మల వంటి వారి తోపాటు వేలాది సైనికుల తెగువ, సాహసం, బలిదానాల కారణంగా శ్రీనగర్ ఎయిర్ పోర్టుతో సహా బారాముల్లా, ఉరీ వంటి ప్రాంతాలు మన సేనల వశమయ్యాయి. 11,578 అడుగుల ఎత్తులోని జిజోలా కనుమలపై ఉన్న శత్రువుల బంకర్లను నమ్మశక్యం కాని తెగువతో ధ్వంసం చేసి శత్రు మూకలను తరిమి కొట్టాడు మేజర్ జనరల తిమ్మయ్య.
సైనికులను అలాగే వదిలి వుంటే ఆ జైత్ర యాత్ర అలాగే కొనసాగి ఉండేది. కానీ మూడు వంతుల భూభాగం శత్రువుల చేతిలో ఉండగానే, దురాక్రమణ దారుల గెంటివేత పూర్తి కాకుండానే తనను తాను శాంతి దూతగా ప్రపంచానికి చాటుకోవాలనే దిక్కుమాలిన కీర్తి కండూతి కారణంగా పండిట్ నెహ్రూ అర్ధంతరంగా యుద్ధాన్ని ఆపేసి ఎవరి మాటా వినకుండా 1948 జనవరి 1న కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి అప్పజెప్పి అనవసరంగా సమస్యను అంతర్జాతీయం చేశాడు. దాంతో ఐక్య రాజ్య సమితి ఏకపక్షంగా 1949 జనవరి 1న కాల్పుల విరమణ ప్రకటించింది. మొత్తానికి నెహ్రూ పుణ్యమా అని కాశ్మీర్ అంశం రాచపుండుగా మారింది. అక్కడ వారికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ 370, 35 లను తీసుకొని వచ్చారు.
కాశ్మీర్ విషయంలో ముఖర్జీ ఎనలేని పోరాటం చేశారు. భారత్‌లో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం సందర్భంగా ప్రధాని నెహ్రూ అనుసరించిన దాగుడు మూతల వైఖరితో సమస్య రాచపుండులా మారింది. తన మిత్రుడు షేక్ అబ్దుల్లాకు అధికారం కట్టబెట్టే ఆలోచనలో భాగంగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలను ఆర్టికల్ 370 రూపంలో నహ్రూ రక్షణ కల్పించారు. అవన్నీ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండడమే కాకుండా కశ్మీరీలు మిగతా బారతీయ సమాజంతో కలవకుండా ఆర్టికల్ 370 అడ్డుపడేది. దీనిపై దృష్టి సారించిన ముఖర్జీ.. ఏక్ దేశ్‌మే దో ప్రధాన్, దో నిశాన్, దో విధాన్ నహీ చలేగా.. నహీ చెలాగా.. అంటూ ఆర్టికల్ 370ని రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్నిజనసంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .1953 మేలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ యాత్ర తలపెట్టగా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖర్జీ జమ్మూకశ్మీర్ భూభాగంలోకి ప్రవేశించగానే పోలీసులు అరెస్టు చేసి శ్రీనగర్ జైలుకు తరలించారు. 1953 జూన్ 23న నిర్భందంలో ఉన్న శ్యామ ప్రసాద్ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారనే వార్త దేశ ప్రజను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీని విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాజకీయంగా విలువలు పాటించిన వ్యక్తి. కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచి వచ్చిన మహా నేత. ఈ కాలం నేతలు, కార్యకర్తలకు ఆయన సదా ఆదర్శనీయులు.