అంతరిక్షంపై పట్టుసాధించేందుకు వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మస్క్ గ్రూపు సంస్థలో ఒకటైన స్పేస్ ఎక్స్ తాజాగా ప్రయోగించిన మెగా రాకెట్ కుప్పకూలింది. అంతరిక్ష యాత్ర కోసం స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం మరోసారి విఫలమైంది. తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా, అరగంట తరవాత గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ పేలిపోవడం వరుసగా ఇది మూడో సారి కావడం గమనార్హం.
అంతర్జాతీయ కాలమానం ప్రకారం అమెరికాలో మంగళవారం రాత్రి 7 గంటల 36 నిమిషాలకు బ్రైన్స్ విల్ తీరంలోని స్పేస్ ఎక్స్ ప్రయోగశాల నుంచి స్టార్ షిప్‌ను ప్రయోగించారు. తిరిగి ఉపయోగించుకునేందుకు అభివృద్ధి పరచిన 123 మీటర్ల పొడవైన భారీ రాకెట్ ముందుగా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అరగంట తరవాత బూస్టర్ నుంచి రాకెట్ విడివడింది. తరవాత కొద్ది నిమిషాలకే కంట్రోల్ రూంకు సంబంధాలు తెగిపోయాయి. తరవాత సముద్రంలో కూలిపోయింది.
స్టార్ షిప్ సురక్షితంగా అంతరిక్షంలోకి ప్రవేశించినా, పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. అరగంట తరవాత స్టార్ షిప్ నియంత్రణ కోల్పోయింది. తరవాత పెద్ద మంటలతో భూ వాతావరణంలోకి చేరింది. తరువాత హిందూ మహాసముద్రంలోకి కూలిపోయింది.
స్టార్ షిప్ విఫలం కావడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి, మార్చిలో చేపట్టిన ప్రయోగాలు విఫలం అయ్యాయి. గాల్లోనే పేలిపోయాయి. గత రెండు సార్లు కంటే మూడోసారి రాకెట్ ఎక్కువ దూరం ప్రయాణం చేసిందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.