మొదటి భాగం ఇక్కడ చదవండి
ఆ తరువాయి….
::: సందర్భం 1: కాంగ్రెస్ – చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఒప్పందం :::
2008 ఆగస్టు 7వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఐఎన్‌సి), చైనా దేశానికి చెందిన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో (సిపిసి) అవగాహనా ఒప్పందం మీద సంతకాలు చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఉంది. ఆ ఒప్పందం మీద కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వాంగ్ జియారుయ్ సంతకాలు చేసారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అప్పటి చైనా దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది. ద్వైపాక్షిక అంశాల విషయంలో పరస్పర సహకారం, ఉన్నత స్థాయి సమాచార మార్పిడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని లక్ష్యం చర్చలు, యూత్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాలు అని మాత్రం వెల్లడించారు.
మన దేశంలో అత్యంత పురాతమైనదిగా చెప్పుకునే రాజకీయ పార్టీ ప్రత్యర్ధి దేశమైన చైనాకు చెందిన రాజకీయ పార్టీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం అనేది దేశంలో చాలామంది ప్రజలకు తెలియను కూడా తెలియదు. తెలిసిన ప్రజలు, ఆ ఒప్పందం గురించిన వివరాలు ఏమిటో తెలుసుకోవాలని భావించారు. ఆ అవగాహనా ఒప్పందం గురించి బైటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేసినా కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదు. 2020లో సమాచార హక్కు చట్టం ప్రకారం పిటిషన్ వేసి అడిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అదొక రహస్య ఒప్పందం అని మాత్రమే ఆనాటి విదేశాంగ శాఖ వివరించింది. దాంతో కాంగ్రెస్ – సిపిసి మధ్య అవగాహనా ఒప్పందం గురించి సమగ్ర వివరాలు కావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వొకేట్ శశాంక్ శేఖర్ ఝా, గోవా క్రానికల్ పత్రిక సంపాదకుడు సేవియో రోడ్రిగ్స్, మరికొందరు న్యాయవాదులూ కలిసి ఆ పిటిషన్ వేసారు. 2008లో యూపీయే హయాంలో కాంగ్రెస్ పార్టీ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం గురించి వారు అనుమానాలు వ్యక్తం చేసారు. భారత ప్రాదేశిక సార్వభౌమత్వంపై చైనా నిరంతరాయంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో – ఆ రెండు దేశాలకూ చెందిన రెండు రాజకీయ పార్టీలు పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పరం సహకరించుకోవడం గురించి ఒప్పందం కుదుర్చుకోవడం భారతదేశ భద్రతకు ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేసారు.
కాంగ్రెస్‌కు నేతృత్వం వహిస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఉన్న సంబంధాల గురించి జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్ఐఏ) దర్యాప్తు జరిపించాలని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ సర్వోచ్చ న్యాయస్థానాన్ని కోరారు. సోనియా, జిన్‌పింగ్ సమక్షంలో రాహుల్ గాంధీ, వాంగ్ జియారుయ్ సంతకాలు చేసిన ఒప్పందం, భారతదేశ భద్రతపై తీవ్రమైన దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆయన అనుమానించారు. అందుకే అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం – యుఎపిఎ – ఉపా’ కింద ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరారు. అంతే కాకుండా ఆ ఒప్పందం ప్రతిని ఎన్ఐఏ సంపాదించాలని ఆయన డిమాండ్ చేసారు.
భారతదేశంలో బహుళ రాజకీయ పక్షాలు కలిగిన వ్యవస్థ. కానీ చైనా ఏక పార్టీ వ్యవస్థ. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీయే అధికారంలో ఉంటుంది. ఆసియాలో ప్రజాస్వామికంగా ఎదుగుతున్న భారతదేశం పట్ల చైనాకు మొదటినుంచీ ప్రత్యర్ధి భావమే ఉంది. అందువల్లనే జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాల దగ్గర ఆక్రమణలకు దిగుతోంది, భారత భూభాగాలను వివాదాస్పద భాగాలుగా ప్రపంచం ముందు చిత్రీకరిస్తోంది. భారత్ చుట్టూ ఉన్న చిన్నచిన్న దేశాలను నయానో భయానో లొంగదీసుకుని భారత్‌కు వ్యతిరేకంగా మారుస్తోంది. అలాంటి దేశపు శాశ్వత నాయకత్వ పార్టీతో ప్రజాస్వామిక భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ ఒప్పందం కుదుర్చుకోవడం దేశ భద్రతకు ప్రమాదకరమనడంలో సందేహమే లేదు. దాన్నే పిటిషనర్లు వివరంగా ప్రస్తావించారు. వారు ఈ పిటిషన్ వేసేనాటికి అధికారం చేతులు మారి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం గద్దెనెక్కింది.
‘‘చైనా లేక పాకిస్తాన్‌తో వివాదాల గురించి భారత ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను రహస్య చర్చలకు పిలిస్తే, చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ చర్చల సారాంశాన్ని వారికి పంచుకోవలసి వస్తే, అలాంటి అవగాహనా ఒప్పందం దేశ భద్రతకు ప్రమాదకరం కాదా’’ అని వారు ఆందోళన వ్యక్తం చేసారు.
‘చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ‘కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్న 2008 నుంచి 2013 వరకూ, అంటే ఐదేళ్ళ వ్యవధిలో భారత సరిహద్దుల వద్ద చైనా సుమారు 600 సార్లు చొరబాట్లు లేదా ఘర్షణలకు పాల్పడింది. అప్పుడు మనదేశంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. 600 చొరబాట్లు లేక ఘర్షణ సంఘటనల వల్ల భారతదేశానిక తీవ్ర నష్టం వాటిల్లింది’’ అని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు. దాన్నిబట్టి ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం వల్ల మన దేశపు కీలక సమాచారం ఆ దేశానికి చేరి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మన దేశంలో సమాచార హక్కు చట్టాన్ని చేసింది కాంగ్రెస్ హయాంలోనే. కానీ ఆ పార్టీయే ప్రత్యర్ధి దేశంతో చేసుకున్న ఒప్పందం వివరాలను రహస్యంగా దాచిపెట్టింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదు అని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు.
(సశేషం)