ఆపరేషన్ సిందూర్ విజయంతో ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. అదే సమయంలో పాకిస్తాన్ చావుదెబ్బ తింది. ఆ రెండు పరిణామాలనూ కాంగ్రెస్ అసలు జీర్ణించుకోలేకపోతోంది. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ భారత విదేశాంగ విధానం విఫలమైందంటూ దారుణమైన విమర్శలు చేసారు. నిజానికి కాంగ్రెసే దేశ భద్రత విషయంలో ఎన్నోసార్లు రాజీ పడింది. ఆ విషయాలు రాహుల్ గాంధీకి తెలియవేమో కానీ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి.
2025 మే 22న రాహుల్ గాంధీ తన ఎక్స్ హ్యాండిల్‌లో భారత విదేశాంగ మంత్రిని విమర్శిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ‘‘పాకిస్తాన్‌ను ఖండించే విషయంలో మనకు ఏ ఒక్క దేశమూ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను ఎవరు అడిగారు? భారత విదేశాంగ విధానం కుప్పకూలిపోయింది’’ అంటూ ఎస్ జయశంకర్ మీద ఆరోపణలు చేసారు.
రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు :–
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాహుల్ గాంధీ, మన విదేశాంగ మంత్రి మీద విమర్శలు చేయడం అదే మొదలు కాదు. ఆపరేషన్ ప్రారంభానికి ముందు జయశంకర్ పాకిస్తాన్‌కు చెప్పడం తప్పు కాదు, నేరం అని వ్యాఖ్యానించారు. అలా చెప్పడం వల్ల భారతదేశం ఎన్ని విమానాలను కోల్పోయింది అంటూ దారుణమైన ఆరోపణను ప్రశ్నలా సంధించారు. అది కూడా ఒకసారి కాదు, విదేశాంగ మంత్రి దేశానికి ద్రోహం చేసారన్న స్థాయిలో పదేపదే అడిగారు.
‘‘నా ప్రశ్నలకు విదేశాంగ మంత్రి జయశంకర్ మౌనంగా ఉండిపోవడం సరి కాదు. అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను. మీ ప్రకటన వల్ల పాకిస్తాన్‌కు సమాచారం ముందుగా తెలిసిపోవడం వల్ల ఎన్ని భారత విమానాలను కోల్పోయాం? అది తప్పో లోపమో కాదు, అది పెద్ద నేరం. జరిగిన నిజం ఏమిటో దేశం తెలుసుకోవాలి’’ అంటూ రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
రాహుల్ ఆరోపణలకు విదేశాంగ శాఖ స్పందన :–
భారత విదేశాంగ శాఖ మంత్రి మీద రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ ఆ శాఖ ఒక వివరణ జారీ చేసింది. ‘‘మన దేశం ప్రారంభంలో పాకిస్తాన్‌ను హెచ్చరించాము అని మాత్రమే విదేశాంగ మంత్రి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత ప్రారంభ దశలో మాత్రమే పాకిస్తాన్‌ను హెచ్చరించడం జరిగింది. దానికి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడానికి ముందే సమాచారం ఇచ్చాము అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. వాస్తవాలను వక్రంగా వ్యాఖ్యానించడం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ విదేశాంగ శాఖ ప్రకటన విస్పష్టంగా వివరించింది.
రాహుల్ ఆరోపణలపై పిఐబి పరిశీలన :–
భారత ప్రభుత్వపు సమాచార విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల విషయంలో నిజానిజాలను పరిశీలించింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌లో కూడా ఆ ఆరోపణలు తప్పు అని తేలింది. ‘విదేశాంగ మంత్రి మాట్లాడిన విషయం గురించి తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. పైగా, పాకిస్తాన్‌ను హెచ్చరించడం గురించి మంత్రి మాట్లాడనే లేదు’ అని స్పష్టం చేసింది.
విదేశాంగ మంత్రి మీద ఆరోపణలపై బీజేపీ ఘాటు స్పందన :–
ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌ను తప్పు పడుతూ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల మీద అధికార బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాహుల్ గాంధీ మోసపూరిత ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విరుచుకుపడ్డారు. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక పారదర్శకత పాటించాలంటూ కాంగ్రెస్ మద్దతిచ్చిన ప్రభుత్వం 1991లో ఒప్పందం కుదుర్చుకున్న సంగతిని గుర్తు చేసారు.
రాహుల్ ఆరోపణలకు సమాధానంగా నిశికాంత్ దూబే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో కాంగ్రెస్ వైఖరిని బహిర్గతం చేసారు. మిలటరీ కదలికల గురించి వివరాలు పంచుకోవాలంటూ 1991లో భారత్ పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి పారదర్శకతతో వ్యవహరించిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మీద ఆరోపణలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘‘రాహుల్ గాంధీజీ… ఆ ఒప్పందం మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్ దేశాలు ఏదైనా దాడి గురించో లేక సైన్యం కదలికల గురించో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఒప్పందం దేశద్రోహం కాదా?’’ అని ప్రశ్నించారు. నిశికాంత్ దూబే అక్కడితో ఆగలేదు. ‘‘కాంగ్రెస్ పార్టీ పాకిస్తానీ ఓటుబ్యాంకుతో చేతులు కలిపింది. అలాంటి మీకు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం తగునా?’’ అని నిలదీసారు.
నిశికాంత్ దూబే అదే అంశం మీద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, రాహుల్ తీరును దుయ్యబట్టారు. ‘‘మన దేశం 1947 నుంచే పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణిస్తోంది. కశ్మీర్ అంశం మీద పాకిస్తాన్‌తో మనం 78 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాము. అయినా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. 1950 నాటి నెహ్రూ – లియాఖత్ ఒప్పందం కానివ్వండి, సింధు నదీ జలాల పంపకాల ఒప్పందం కానివ్వండి, 1975 సిమ్లా ఒప్పందం కానివ్వండి… కాంగ్రెస్ వైఖరి ఎప్పుడూ పాకిస్తాన్‌కే అనుకూలంగా ఉంటూ వచ్చింది. పైగా పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తోంది. ఏ దేశమూ కూడా తమ రక్షణ వ్యవస్థ పనితీరు గురించి పార్లమెంటులో చర్చించదు. ఇలాంటి చర్యలు దేశద్రోహం కిందకు రావా? కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశాన్ని మోసం చేసింది. ఆ ఒప్పందం చేసుకున్న వారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, దేశద్రోహం కింద విచారించాలి’’ అంటూ మండిపడ్డారు.
దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ రాజీ ధోరణి :–
1947లో స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినది కాంగ్రెస్ పార్టీ. దేశ రక్షణ విషయంలో ఆ పార్టీ ఎంతో రాజీ పడింది. ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్‌ను గుర్తిస్తూనే ఆ దేశం పట్ల సానుభూతి వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చింది. 1948 నుంచి 2008 వ్యవధిలో అలాంటి ఎనిమిది మహా అపరాధాలకు పాల్పడింది. ఆ చర్యలు దేశం మీద నేటికీ దుష్ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.
(సశేషం)