ఏపీలో వైసీపీ పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృదం..సెట్ రూ.3200 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. ఆధారాలు లభించిన అవినీతి రూ.3200 కోట్లుగా అంచనా వేశారు. అయితే మద్యం అమ్మకాల్లో దాదాపు 19 వేల కోట్లు దుర్వినియోగం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాడు అధికారం వెలగబెట్టిన వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకుని విదేశాలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు, విచారణ జరపాలంటూ ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వ దుకాణాల ద్వారా చేపట్టారు. అప్పటికే అందుబాటులో ఉన్న జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను రద్దు చేశారు. 38 కొత్త బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు.
మద్యం అమ్మకాల్లో రూ.19 వేల కోట్లు దుర్వినియోగం చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సమర్పించినట్లు ఆయన చెప్పారు. వేల కోట్లు హైదరాబాద్‌కు చెందిన సునీల్‌రెడ్డి కంపెనీ నుంచి దుబాయ్ తరలించినట్లు ఆధారాలు సేకరించి అమిత్ షాకు ఇచ్చినట్లు కూడా ఆయన మీడియాకు వెల్లడించారు.
మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లకు స్వస్తి చెప్పి, నగదు రూపంలో వ్యాపారం నిర్వహించి వైసీపీ పెద్దలు ప్రతి నెలా రూ.50 నుంచి 60 కోట్లు అవినీతికి పాల్పడినట్లు సిట్ విచారణలో తేల్చింది. ఇప్పటికే ఈ కేసును పది నెలలుగా విచారిస్తోన్న సిట్ అధికారులు ఆరుగురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, డిజిటల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని విచారించారు.
మద్యం పాలసీని అనుకూలంగా మలచుకుని రూ.19 వేల కోట్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి రాగానే 38 కొత్త బ్రాండ్లను తీసుకురావడంతోపాటు, 26 డిస్టిలరీలను స్వాధీనం చేసుకుని మద్యం తయారు చేసి అమ్మినట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. ఎక్కువ కమీషన్లు ఇచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చే విధంగా మ్యాన్యువల్ విధానాలను పాటించినట్లు అధికారులు గుర్తించారు.అధికార పార్టీ సహచరుల నియంత్రణలోని డిస్టిలరీల బ్రాండ్లకు అనుకూలంగా వ్యవహరించి కిక్ బ్యాక్ పొందారని సిట్ విచారణలో గుర్తించారు. దీనిపై లోతైన విచారణ కొనసాగుతోంది.
ఏపీ మద్యం కేసు విచారణ ప్రారంభం కాగానే ఐదుగురు కీలక నిందితులు విదేశాలకు పరారైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురు దుబాయ్, మరొకరు థాయ్‌లాండ్‌లో దాక్కున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేసిన చాణక్య అనే వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణలో రాజ్ కసిరెడ్డి అనుచరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్, సికింద్రాబాదుకు చెందిన వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్ పరారీలో ఉన్నారు. వీరంతా మద్యం అవినీతి సొమ్మును డొల్ల కంపెనీలకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలింది. వీరి కోసం అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
సైబర్ నేరగాళ్ళ తరహాలో తరలించేశారు :–
మద్యం కుంభకోణంలో సిట్ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. మద్యం అమ్మకాల ద్వారా వేలకోట్లు కొల్లగొట్టిన ముఠా, మ్యూల్ ఖాతాల ద్వారా సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. నిరుపేదలు, రోజు వారీ కూలీల ఖాతాలకు అవినీతి సొమ్ము బదిలీ చేసి, ఖాతాదారులకు 2 శాతం కమిషన్ చెల్లించి మిగిలిన డబ్బు విదేశాలకు తరలించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
మద్యం కుంభకోణంలో అవినీతి సొమ్ము విదేశాలకు తరలించినట్లు సిట్ విచారణలో తేలింది. విదేశాలకు అక్రమంగా నిధులు తరలించిన వ్యవహారం కావడంతో విచారణ జరపాలంటూ సిట్ అధికారులు ఈడీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈడీ కీలక ఆధారాలను సేకరించే పనిలో పడింది. ఇప్పటికే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు ఈడీ అధికారులు కోర్టు అనుమతి కోరారు.
వైసీపీ అధికారం కోల్పోగానే మద్యం అమ్మకాలకు సంబంధించిన డేటా మొత్తం విదేశీ నిపుణులతో డిలీట్ చేయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏకంగా 350 టెరాబైట్ల డేటాను శాశ్వతంగా డిలీట్ చేయించి, డేటా ఎలా పోయిందో తమకు తెలియదని నిందితులు చెప్పడంతో సిట్ అధికారులు విస్తుపోయారు. 2019 నుంచే ఎప్పటి కప్పుడే డేటాను కావాలనే డిలీట్ చేయించినట్లు గుర్తించారు. మద్యం ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు, సుంకం రహిత కొనుగోళ్లు, అబ్కారీ పన్ను మినహాయింపులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల సమాచారం మొత్తం ఎప్పటి కప్పుడే ధ్వంసం చేసినట్లు తేలింది. దీనిపై లోతైన విచారణ కొనసాగుతోంది.
బంగారం రూపంలో అవినీతి వసూళ్ళు :–
మద్యం కుంభకోణంలో వందల కోట్ల అవినీతిని గుర్తించిన సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ కుంభకోణంలో ఓ కీలక వ్యక్తి కారు తనిఖీ చేయగా బంగారానికి సంబంధించిన ఓ రసీదు వెలుగు చూసింది. ఏపీకి పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేసిన ముంబైకి చెందిన తిలక్ ఇండస్ట్రీస్ నుంచి ముడుపులు బంగారం రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు. ఇలా ఏపీలోనూ పలు డిస్ట్రలరీల నుంచి వందల కేజీల బంగారాన్ని ముడుపుల రూపంలో తీసుకుని దుబాయ్ తరలించి డబ్బుగా మార్చి డొల్ల కంపెనీలకు తరలించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ లింకులు లాగేందుకు ఈడీ సహాయం కోరారు. విదేశాలకు అవినీతి సొమ్ము ప్రవాహం జరగడంతో ఈడీ అధికారులు విచారణకు అంగీకరించారు. సిట్ అధికారుల నుంచి ఆధారాలు తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు సిట్ అధికారులు ఆరుగురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారిలో ఒక్కరికి కూడా కోర్టులు బెయిల్ మంజూరు చేయలేదు. నిందితులు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. వారి రిమాండును జూన్ 3 వరకు పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరికొందరు కీలక వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.