భారత్ మరో ఘనతను దక్కించుకుంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారత్ తాజాగా 4.19 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో భారత్ జర్మనీని వెనక్కునెట్టి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5.2 ట్రిలియన్ డాలర్లకు చేరనుందని ఐఎంఎఫ్ ప్రకటించింది.
జపాన్ దేశాన్ని వెనక్కు నెట్టి భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రాబోయే మూడేళ్లు 6 నుంచి 7 శాతం వృద్ధి రేటు కొనసాగించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే భారత్ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది.దీర్ఘకాలంలో భారత వృద్ధిరేటు స్థిరంగా కొనసాగితే రెండు దశాబ్దాల్లో భారత్ ప్రపంచలో అగ్ర రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.దేశంలో పెరుగుతోన్న శ్రామిక జనాభా, డిజిటలైజేషన్ ఇందుకు ఉపకరిస్తాయని చెబుతున్నారు.
భారత్ వృద్ధికి ప్రధాన చోదకాలు
అత్యధిక జనాభా భారత్‌కు వరంగా మారనుంది. ముఖ్యంగా శ్రామిక జనాభా 2030 నాటి భారత్ చైనాను అధిగమిస్తుందని అంచనా. ఇది భారత్‌కు కలసిరానుంది.
మరోవైపు డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తోంది. 2022లో జీడీపీలో 11.8 శాతం ఉన్న డిజిటలైజేన్ 2030 నాటికి 20 శాతానికిపెరుగుతుందని అంచనా.ఆర్థిక సంస్కరణల కొనసాగింపు, చమురు ధరల నియంత్రణ, ప్రభుత్వ రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం వంటి వ్యూహాలు భారత్ వృద్ధి రేటు కొనసాగింపునకు ఉపకరించనుంది.
భారత్ ముందున్న సవాళ్లు:
భారతదేశంలో పెరుగుతున్న శ్రామిక-వయస్సు జనాభాకు ఉపాధి అవకాశాలను సృష్టించడం పెద్ద సవాల్‌గా మారనుంది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. ఇక ఏఐ, జెన్ ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి విద్య, నైపుణ్యాభివృద్ధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంది.
భారతదేశ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4%కి మందగించింది. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క డొల్లతనాన్ని వెల్లడిస్తోంది.నిరుద్యోగం ఒక ముఖ్యమైన సవాలు. ఇది జీవనోపాధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వృద్ధిని నెమ్మదించేలా చేస్తుంది. భారతీయ గృహాలలో పొదుపు తగ్గడం పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది. పొదుపు, పెట్టుబడుల మధ్య పెరుగుతున్న అంతరం ఆందోళనకరంగా ఉంది. ఈ ధోరణి పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధులను పరిమితం చేస్తుంది. దీంతో ఆర్థిక వృద్ధి భవిష్యత్తులో మందగించే ప్రమాదముంది.
నిర్మాణాత్మక సవాళ్లు
భారతదేశంలోని అధిక జనాభా సాంద్రత భూమి, నీరు వంటి వనరులపై ఒత్తిడిని తీవ్రంగా పెంచుతోంది. మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సవాల్‌గా మారనుంది.భారతదేశ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా లేవు. మౌలిక సదుపాయాల కొరత ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తున్నాయి.భారతదేశంలో అక్షరాస్యత రేటు దాదాపు 74% ఉంది. ఇది నాలుగో వంతు జనాలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం లేకపోవడానికి దారితీస్తుంది.
ఆర్థిక సవాళ్లు
భారతదేశ ప్రైవేట్ అప్పు, జిడిపి నిష్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇది వ్యక్తులు, ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. చెల్లింపు క్షీణత ప్రమాదకరంగా మారనుంది. ప్రభుత్వం నుండి కాంట్రాక్టర్లు , సరఫరాదారులకు చెల్లింపులలో జాప్యం వారికి ఆర్థిక సమస్యలకు దారితీసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. పెరిగిపోతోన్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను సమతుల్యం చేయడం భారత రిజర్వ్ బ్యాంకుకు సవాలుగా మారనుంంది.
ఇతర సవాళ్లు
అవినీతి ఆర్థిక వ్యవస్థలో అసమర్థత, వ్యర్థాలకు దారితీస్తుంది. దీని ఫలితంగా సామాజిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. భారతదేశం వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. లింగ అసమానత ఫలితంగా మహిళలు పురుషులతో సమానమైన అవకాశాలను మహిళలు నేటికీపొందలేకపోతున్నారు. ఇది ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించనుంది.
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ తలసరి ఆదాయం విషయంలో చాలా వెనుకబడింది. ప్రపంచంలో తలసరి ఆదాయంలో భారత్ 143 స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో తలసరి ఆదాయం పెంచుకోవడం ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాలో తలసరి ఆదాయం 89 వేల డాలర్లు ఉండగా, భారత్‌లో అది కేవలం 2800 డాలర్లు కావడం గమనార్హం.