దేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు సాధ్యమేనని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2019లో వైసీపీ ఈవీఎం ద్వారా నిర్వహించిన ఎన్నికల ద్వారానే గెలిచిందని గుర్తుచేశారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లు నిర్వహిస్తున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చులు తగ్గడంతోపాటు, దేశంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా పోతాయని భావిస్తున్నారు.