చైనా ప్రభుత్వపు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బిఆర్ఐ) ప్రాజెక్టులో వివాదాస్పద భాగమైన ‘చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ను (సిపిఇసి) ఇప్పుడు అప్ఘానిస్తాన్ వరకూ విస్తరించడం భారత్ భౌగోళిక రాజకీయ ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. చైనా పాకిస్తాన్ అప్ఘానిస్తాన్ మధ్య ఆ త్రైపాక్షిక ఒప్పందం భారతదేశపు ప్రాదేశిక సార్వభౌమత్వానికి సవాల్‌గా నిలుస్తోంది. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ను తమ భూభాగంగా చూపించుకుంటూ చైనా నిర్మాణాలు చేపడుతోంది. తద్వారా భారతదేశపు ప్రాదేశిక ప్రభావశీలతను తక్కువ చేయడంతో పాటు దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతంలో చైనా తన విస్తరణవాదాన్ని చాటుకుంటోంది.
సిపిఇసి మూలాలు, వివాదాస్పద స్వరూపం :–
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను 2013లో ప్రారంభించారు. చైనా పశ్చిమ సరిహద్దులను అరేబియా సముద్ర తీరాన ఉన్న పాకిస్తాన్‌లోని గ్వదర్ ఓడరేవుతో కలుపుతూ భారీ స్థాయిలో రవాణా కారిడార్ నిర్మించడం ఆ ప్రాజెక్టు మౌలిక లక్ష్యం.
ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు అంచనా వేసిన విలువ 46లక్షల కోట్ల డాలర్లు. తర్వాత దాన్ని 62లక్షల కోట్ల డాలర్లకు పెంచారు. అంటే పాకిస్తాన్ జీడీపీలో దాదాపు 20శాతం. చైనా అధ్యక్షుడు లీ కెకియాంగ్ 2013 మేలో పాకిస్తాన్‌ను సందర్శించినప్పుడు ఈ ప్రాజెక్టు ఖరారైంది. వారి వారసులు షి జిన్‌పింగ్, నవాజ్ షరీఫ్ 51 ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా ఏప్రిల్ 2015లో ఆ ప్రాజెక్టును ముందడుగు వేయించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను చైనా ఋణాలు, ఈక్విటీ హోల్డింగ్స్ రూపంలో సమకూర్చింది. అంటే పాకిస్తాన్ ఆర్థికంగా చైనా మీద ఆధారపడిపోవలసి ఉంటుంది. చైనా వాణిజ్యపరంగా పాకిస్తాన్‌ను పీల్చిపిప్పి చేస్తోందన్న విమర్శలు ఉన్నా, భారత్‌ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ ఆ ప్రాజెక్టును కొనసాగించడానికే నిర్ణయించుకుంది.
తాజాగా సిపిఇసిని అప్ఘానిస్తాన్ వరకూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. బీజింగ్‌లో కొన్నాళ్ళ క్రితం రహస్య త్రైపాక్షిక సమావేశం జరిగింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, అప్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకీ హాజరైన ఆ సమావేశం ప్రాదేశిక ఉద్రిక్తతలను పెంచింది.
అప్ఘానిస్తాన్‌కు శాంతి, సుస్థిరత కల్పిస్తామనే వాగ్దానంతో ఈ ప్రాజెక్టులోకి ఆ దేశాన్ని చైనా ఆకట్టుకుంది. కానీ నిజానికి అప్ఘానిస్తాన్ వనరులనుచ సంపదనూ చైనా కొల్లగొడుతుంది. పైగా, వాస్తవానికి భారత భూభాగమైన, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భాగంలోనుంచి ఈ కారిడార్‌ను నిర్మించడం మీద భారతదేశం తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ విషయం తెలిసినప్పటికీ అప్ఘానిస్తాన్ ఈ ప్రాజెక్టులో చేరడానికే నిర్ణయించుకుంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేలా ఈ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా చైనా నిజమైన ఉద్దేశాలు బైటపడ్డాయి. దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతంలో ఆధిక్యతను సాధించడం, ప్రాదేశిక సుస్థిరతను దెబ్బ తీయడం, భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు గండి కొట్టడమే చైనా నిజమైన లక్ష్యాలు.
సిపిఇసి మౌలిక నిర్మాణాలు – చైనా వ్యూహాత్మక ప్రయత్నాలు :–
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్టులో భారీ సంఖ్యలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉన్నాయి. పాక్ తీర ప్రాంతంలోని గ్వదర్ ఓడరేవును చైనా తన మారిటైమ్ అవసరాల కోసం వ్యూహాత్మకంగా ఆక్రమించడానికి వీలుగా ఆ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. మెయిన్ లైన్ 1 రైల్వే లైన్, విద్యుత్ పైప్‌లైన్లు, పారిశ్రామిక జోన్లను ఉపరితలం నుంచి చూస్తే పాకిస్తాన్ మౌలిక వసతులను తీర్చేందుకు నిర్మిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ కొంత నిశితంగా పరిశీలిస్తే వాస్తవానికి అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా ఆధిక్యాన్ని సంపాదించడానికి చేస్తున్న నిర్మాణాలుగా అర్ధమవుతుంది.
ఏదేమైనా, గ్వదర్ పోర్టు అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికి ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవమే. అరేబియా సముద్రంలో తనకు బలమైన స్థావరంగా ఆ ఓడరేవును మలచుకోడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రాదేశిక భద్రతా సమీకరణాలను మార్చేస్తాయి. ప్రత్యేకించి భారత్ భద్రతకు ముప్పు వాటిల్లచేసే ప్రమాదం ఉంది.
ఆ ప్రాజెక్టు ఆర్థిక విధానాన్ని పరిశీలిస్తే… మొత్తం పెట్టుబడిలో చైనా వాటా 80శాతం ఉంది. అందులోనూ పాకిస్తాన్‌కు ఋణాల రూపంలో ఇచ్చే వాటాయే ఎక్కువ ఉంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు పాకిస్తాన్‌ను అది ఎన్నటికీ తీర్చలేని ఋణాల ఊబిలోకి దింపింది. భారత్ మీద గుడ్డి శత్రుత్వంతో పాకిస్తాన్ ఈ ప్రాజెక్టుకు ఒప్పుకుందన్న సంగతి ఇట్టే అర్ధమవుతుంది.
సిపిఇసి మౌలికంగా పాకిస్తాన్ కంటె కూడా చైనా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఎక్కువ ఉపయుక్తంగా ఉంది. బీజింగ్ తన ఆర్థిక ఆధిక్యతను ప్రయోగించి ఇస్లామాబాద్‌ను తనకు విధేయంగా ఉండేలా లొంగదీసుకుంది. గ్వదర్ ఓడరేవు వ్యూహాత్మక ప్రాధాన్యత, ప్రాజెక్టుపై చైనా ఆర్థిక ఆధిపత్యాలను గమనిస్తే అరేబియా సముద్రంలో కీలకమైన సైనిక, వాణిజ్య మార్గం మీద నియంత్రణ సాధించేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోందని అర్ధమవుతుంది. ఆ క్రమంలో స్థానిక ప్రాదేశిక శక్తులైన భారత్ వంటి దేశాల సార్వభౌమతను చైనా ధిక్కరిస్తోందన్న సంగతీ వెల్లడవుతుంది.
(సశేషం)