రసాయనాలతో ప్రయాణిస్తోన్న లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. రసాయనాలతో కూడిన నౌక సముద్రంలో మునిగిపోవడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ హై అలర్ట్ ప్రకటించింది. భారీ నౌకలో 640 కంటెయినర్లు ఉన్నాయి. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. 12 కంటైనర్లలో కాల్షియం కార్భైడ్, మరికొన్నింటిలో 84.44 టన్నుల డీజిల్, 367 టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది.
రసాయనాలు, డీజిల్, ఫర్నేస్ ఆయిల్‌తో కేరళ తీరం తీవ్రంగా కలుషితం అయ్యే ప్రమాద ముందని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్లలోని ఇంధనం తీరం వైపు ప్రయాణిస్తే ఎవరూ తాకవద్దని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కంటైనర్లలోని డీజిల్, రసాయనాలు ఎంత వరకు వ్యాపించే అవకాశం ఉందనే దానిపై ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమానంతో పరిశీలన జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు.
లైబీరియాకు చెందిన భారీ నౌక కేరళ తీరానికి 38 నాటికన్ మైళ్ల దూరలో ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో ఓడలోని కంటైనర్లు సముద్రంలోకి జారిపోయాయి. విఝంజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయలు దేరిన నౌక శనివారం నాటికి కొచ్చిన్ ఓడ రేవుకు చేరుకోవాల్సి ఉంది. కంటైనర్ మునగడాన్ని గమనించిన కోస్టల్ గార్డ్ అందులోని సిబ్బందిని సుక్షితంగా తీరానికి చేర్చారు. దీంతో 24 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.