అమెరికాలో నకిలీ ఉద్యోగాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు అమ్ముకుంటోన్న ముఠా కుంభకోణం బయటపడింది. అక్రమంగా వీసాలు పొందుతోన్న కేటుగాళ్ల గుట్టరట్టయింది. అక్రమంగా వీసాలు పొంది, విదేశీయులకు విక్రయిస్తోన్న ముఠాలోని ఇద్దరు పాకిస్థానీయులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాశ్ పటేల్ మీడియాకు వెల్లడించారు.
అమెరికా టెక్సాస్‌లో పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ హది, మహమ్మద్ సల్మాన్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు ప్రభుత్వానికి సమర్పించి అక్రమంగా వీసాలు పొందారని తేలింది. నకిలీ వీసాలను విదేశీయులకు పెద్ద మొత్తం తీసుకుని విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. నకిలీ వీసాల కోసం ఈబీ 2, ఈబీ 3, హెచ్ 1బీ వీసా ప్రోగ్రాములను ఉపయోగించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలు పత్రికల్లో ప్రచురించి లేబర్ డిపార్టుమెంటు అధికారులను కూడా తప్పుదారి పట్టించారు. లేబర్ శాఖ నుంచి అనుమతులు రాగానే వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్ కార్డులను మంజూరు చేయాలంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని అభ్యర్థించారు.
ముర్షిద్ అనే పాకిస్థానీయుడు చట్టవిరుద్దంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. గత కొన్నేళ్లుగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి బలమైన చట్టాల అవసరం ఉందని ఎఫ్‌బిఐ స్పెషల్ ఏజంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. దోషులుగా రుజువైతే వీరికి 20 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా పడే అవకాశముంది.