విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మూడో రోజు నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసు శిక్షణ కళాశాలలో అధికారులు విచారిస్తున్నారు. పోలీసులకు మరో మూడు రోజులు విచారణకు గడువు ఉంది. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విచారణ కొనసాగుతోంది.
తాజాగా విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది.తెలంగాణలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ వేసినట్లు గుర్తించారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ ఓ వ్యక్తి మెసేజ్ పంపించాడు. నమ్మకం కుదిరాక అతని వివరాలు సిరాజ్‌కు అందించాడు. అతడు విశాఖకు చెందిన ఓ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఓ మతానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు. ఆ అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారి అంతర్జాతీయ కాల్స్‌పై ఆరా తీస్తున్నారు.