ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు, తాడిగడప గ్రామాల చేరువలో అక్రమంగా నివసిస్తున్న 15మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తులు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడినవారు అని భావిస్తున్నారు. వారు తాడిగడపలో ఒక నిర్మాణ స్థలంలో పని చేస్తున్నారు. వారిని ఏప్రిల్ 23 శుక్రవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెనమలూరు పోలీస్ ఇనస్పెక్టర్ వివరణ ప్రకారం ఆ వ్యక్తులు 20 నుంచి 35 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. వాళ్ళు పదేళ్ళకు పైగా హైదరాబాద్‌లో నివసించారు. హైదరాబాద్ పోలీసులు అందించిన నిఘా సమాచారం వల్ల ఈ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు కృష్ణా జిల్లాకు వచ్చిన సంగతి వెలుగు చూసింది.
వివిధ భద్రతా సంస్థలు అందించిన నిఘా సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ బాలాపూర్‌లోని శరణార్థి శిబిరంలో పలువురు అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులు ఉన్నారు. వారిలో కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. వారినే ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు.
నిఘా సమాచారం మేరకు, హైదరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలిజెన్స్ బృందాలు, స్థానిక పెనమలూరు పోలీసులతో సమన్వయం చేసుకుని రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఎక్కడున్నారో కనుగొన్నారు. వారు తాడిగడపలో ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో నాలుగు రోజులుగా పని చేస్తున్నారని తెలిసింది.
హైదరాబాద్‌కు చెందిన ఒక మేస్త్రీ, విజయవాడలో నిర్మాణ పనులు చేస్తూ కూలీ పని కోసం వారిని తీసుకొచ్చాడని దర్యాప్తులో బైటపడింది. ఆ మేస్త్రీ వారిని తీసుకువచ్చే క్రమంలో ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియలూ అనుసరించలేదనీ, స్థానిక అధికారులకు సమాచారం అందించలేదనీ అధికారులు వివరించారు. ఇమిగ్రేషన్ నిబంధనలను వారు ఉల్లంఘించడం ఆందోళన కలగజేస్తోంది.
పోలీసులు అక్రమ చొరబాటుదారులను తదుపరి విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విదేశీయులను తీసుకురావడంలో కాంట్రాక్టర్ ప్రమేయం గురించి పోలీసులు విచారిస్తున్నారు. ఏ పత్రాలూ లేకుండా ఇలా దేశంలోకి చొరబడుతున్నవారికి ఏయే ప్రదేశాలకు వెళ్ళాలి, ఎక్కడ ఎలాంటి ఉపాధి పొందాలి అన్న ఏర్పాట్లు చేసేందుకు పెద్ద నెట్‌వర్క్ ఏదైనా పని చేస్తోందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ అక్రమ చొరబాటుదారుల సెటిల్మెంట్లు – మరీ ముఖ్యంగా బంగ్లాదేశీలు, రోహింగ్యాల సెటిల్మెంట్ల – ఉనికి గురించి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల ఉనికి అంతర్గత భద్రతకు పెనుముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పౌరులు అప్రమత్తంగా ఉండాలనీ, తమతమ ప్రాంతాల్లో స్థానికేతరులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలనీ పిలుపునిచ్చారు.