నక్సలైట్ ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీలో మొదలైంది. ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల పోరాటంగా అది ప్రారంభమైంది. కాలక్రమంలో అది సిపిఐ (మావోయిస్టు) పార్టీ తిరుగుబాటుగా రూపుదిద్దుకుంది. సాయుధ పోరాటం ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది వారి లక్ష్యం. వారి సిద్ధాంతం పార్లమెంటరీ ప్రజాస్వామిక విధానాన్ని తిరస్కరిస్తుంది, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజాపోరాటం చేయాలని సూచిస్తుంది. మావోయిస్టు, నక్సలైటు గ్రూపులు ఎల్లప్పుడూ భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాంతీయ అసమానతలు, సామాజిక ఆర్థిక సమస్యలను వాడుకుని దేశాన్ని విచ్ఛిన్నం చేయడం వారి విధానం. వాళ్ళు కొన్ని చోట్ల సమాంతర ప్రభుత్వాలు నడుపుతూ, రాజ్యం అధికారాన్ని సవాల్ చేస్తూ, పరిపాలనకు అవాంతరాలు కలిగిస్తున్నారు. వాళ్ళ కార్యకలాపాలు ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, సామాన్య జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, దేశంలో అభివృద్ధినీ పురోగతినీ నిలువరిస్తున్నాయి.
ఐపిఎస్ అధికారి అంబర్ కిశోర్ ఝా తన సమగ్ర పరిశోధనా పత్రం ‘ఛేంజింగ్ స్ట్రాటెజీ అండ్ టాక్టిక్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రిమిజం ఇన్ ఇండియా’లో ఎలాంటి శషభిషలూ మొహమాటాలూ లేకుండా ఎలాంటి అలంకారాలూ అద్దకుండా నిర్మొహమాటంగా ఇలా చెప్పారు, ‘‘వామపక్ష అతివాదం దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా కొనసాగుతోంది’’.
పరిశోధకురాలు తస్నీమా మస్రూర్ కూడా అదే ఆందోళనను వ్యక్తీకరించారు. నక్సల్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా: అండర్‌స్టాండింగ్ ది మోటివేషన్స్ అండ్ స్ట్రాటెజీస్’ అనే తన పరిశోధనా పత్రంలో తస్నీమా మరింత ఆందోళనకరమైన చిత్రాన్ని చూపించారు. ‘‘నక్సలైట్ అనేది రాజ్యేతర స్వతంత్ర సంస్థ. దాన్ని మవోయిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే వారు నడుపుతారు. వారి లక్ష్యాన్ని హింస ద్వారా చేరుకోడానికి ప్రయత్నిస్తుంటారు. భారతదేశంలో అంతర్గత భద్రతకు వారు అతిపెద్ద ముప్పు. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వారు ఎన్నో ఘాతుకాలకు పాల్పడ్డారు’’ అని తస్నీమా వివరించారు.
2025 మే 21న భారతదేశపు భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో గొప్ప విజయాన్ని సాధించాయి. సిపిఐ (మావోయిస్టు) సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మట్టుపెట్టగలిగాయి. అతనితో పాటు మరో 26మంది మావోయిస్టులు సైతం హతమయ్యారు. ఆ చర్యే ఇటీవలి చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎన్‌కౌంటర్ ఒక కీలక నాయకుణ్ణి మాత్రమే నిర్మూలించలేదు, తిరుగుబాటుదారుల వ్యవస్థీకృత నిర్మాణాన్ని సైతం ధ్వంసం చేసింది. గురువారం సుక్మా జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో సిఆర్‌పిఎఫ్ బృందానికి చెందిన కోబ్రా కమాండో. ఒక నక్సలైటూ ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి, ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల ఆధిక్యాన్ని తుడిచి పెట్టేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందనడానికి నిదర్శనం.
ఆ ఆపరేషన్ ‘గొప్ప విజయం’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ ఆపరేషన్ కారణంగానే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో 54మంది నక్సలైట్లు అరెస్ట్ అయారు, మరో 84మంది లొంగిపోయారు.
‘‘నక్సలిజాన్ని తుడిచిపెట్టడం కోసం జరుగుతున్న పోరాటంలో ఇది ఘనమైన విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో మన భద్రతా బలగాలు 27మంది భయంకరులైన మావోయిస్టులను మట్టుపెట్టాయి. వారిలో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అత్యున్నత నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. నక్సలిజం మీద భారతదేశం పోరులో గత మూడు దశాబ్దాల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుణ్ణి మన బలగాలు మట్టుపెట్టడం ఇదే మొదటి సారి. మన సాహసవంతులైన భద్రతా బలగాలను, నిఘా ఏజెన్సీలను ఈ గొప్ప విజయానికి అభినందిస్తున్నాను’’ అని అమిత్ షా ఎక్స్ సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేసారు.
కొంతకాలంగా సంప్రదాయిక మావోయిస్టు తిరుగుబాట్లు విఫలం అవుతుండడంతో నగర ప్రాంతాల్లో ఓ కొత్త తరహా సైద్ధాంతిక విరోధాలను తయారు చేయడం మొదలైంది. ఆ మార్పును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అడవుల్లో నక్సలిజం ముగిసిపోతోంది కాబట్టి అర్బన్ నక్సల్స్ అనే కొత్త నమూనా తలెత్తుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఆ అర్బన్ నక్సల్స్ అనబడే వ్యక్తులు సాధారణంగా విద్యా వ్యవస్థల్లోనూ, మేధో కేంద్రాల్లోనూ ఉంటారు. సామాజిక ఉద్యమాలను హైజాక్ చేసి, వాటికి పరిష్కారం మావోయిస్టు సిద్ధాంతాలే అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు.
మావోయిస్టు అతివాదంపై అతిపెద్ద పోరులో, భారతదేశానికి అర్బన్ నక్సలిజం కూడా అంతే పెద్ద అంతర్గత ముప్పుగా పరిణమించింది. ఈ అర్బన్ నక్సల్స్ అడవుల్లో తుపాకులు పట్టుకుని దాగివుండే గెరిల్లాలు కారు, మన నగరాల్లో సూటూ బూటూ వేసుకుని అన్ని సౌకర్యాలూ అనుభవిస్తూ తిరిగే సైద్ధాంతికవేత్తలు. అర్బన్ నక్సల్స్ అంటే సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనే వ్యక్తులు కారు. వీళ్ళు మావోయిస్టు ఉద్యమానికి సైద్ధాంతికంగా వెన్నెముకగా ఉంటారు, నగరాల్లో ఉంటూ ఉద్యమానికి ప్రచారం చేస్తారు. వీళ్ళు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల ఉద్యమకారులు వంటి ముసుగుల్లో ఉంటారు. చాలా జాగ్రత్తగా, భారతదేశం అనే రాజ్య వ్యవస్థ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయేలా కథనాలను అల్లుతూ ఉంటారు. దూరదర్శన్ వార్తా కథనం ఒకదానిలో వివరించినట్లు, ఈ అర్బన్ నక్సల్స్ ఉద్దేశపూర్వకంగా విద్యార్ధులను, యువతను, వెనుకబడిన కులాల వారినీ లక్ష్యం చేసుకుంటారు. వారిలో తమను వేరు చేస్తున్నారు అన్న భావనను, బాధనూ కలిగేలా చేస్తారు. ఈ అర్బన్ నక్సల్స్ వాడే ఆయుధాలు తుపాకులు కావు, కానీ మాటలే. వాళ్ళు ఎన్‌జీఓలు ఏర్పాటు చేస్తారు, పౌర హక్కుల సంఘాలు ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా నటిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు మావోయిజాన్ని ఆకర్షణీయంగా కనబడేలా పరోక్ష ప్రచారం చేస్తూంటారు. వాస్తవంలో ఈ అర్బన్ నక్సల్స్ హింసాత్మకమైన తిరుగుబాటుకు మేధావితనం అనే ముసుగు మాత్రమే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాటల ప్రకారం అడవిలో సాయుధులైన మావోయిస్టుల కంటె అర్బన్ నక్సల్సే ఎక్కువ ప్రమాదకరమైన వారు.
మావోయిస్టు ఉద్యమానికి చిరకాలంగా బలమైన స్తంభంగా నిలబడిన నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భారత ప్రభుత్వం ఎట్టకేలకు కూల్చివేయగానే, ఈ కుహనా మేధావులు, ఒక ఉగ్రవాది అంతం అయ్యాడని ఆనందించలేదు. దానికి బదులు వాళ్ళకు అలవాటైన ఆట ప్రారంభించారు. ముసుగులు వేసుకుని ఏడవడం, ప్రభుత్వం మీద ఆగ్రహం చూపించడం, సిగ్గు లేకుండా ఎవరు ఎవరో అంటూ వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల నిండా ‘రాజ్య ప్రాయోజిత హింస’ అంటూ వేలాదిగా పోస్టులు పెట్టేసారు. పత్రికల్లోని ఓప్-ఎడ్ పేజీల్లో ఎన్‌కౌంటర్ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసేసారు. ఆ వ్యక్తి వల్ల చనిపోయిన వేల మంది అమాయకులైన సాధారణ ప్రజలు, పోలీసుల గురించి ఒక్క పదమైనా ఎవరూ మాట్లాడలేదు. ఒక ఉగ్రవాద సంస్థ అధినేత కోసం మొసలి కన్నీళ్ళు కార్చారు.
ఆ నాటకాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాలేదు. కోల్‌కతాలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి మరీ ప్రదర్శన చేపట్టారు. వారు దేశ భద్రతా బలగాలు విజయం సాధించినందుకు ఉత్సవం చేసుకోలేదు, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతుడైనందుకు ఆవేదన చెందారు. అది కేవలం వినీ వినకుండా వదిలేసే విషయం కాదు, అది భయంకరమైన సంగతి. మన దేశ పౌరులను పలుమార్లు సామూహికంగా చంపేసిన వ్యక్తి మరణానికి మన అర్బన్ సమాజం వాపోతోంది అనే వాస్తవాన్ని మనం ఎదుర్కోవలసి వస్తోంది. సైద్ధాంతిక యుద్ధం అడవుల్లో జరగడం లేదు. ఇక్కడ, సమాజంలోనే మన మధ్యనే జరుగుతోంది.
అర్బన్ నక్సలైట్లు చీకట్లలో తచ్చాడరు. వాళ్ళు మన మధ్యనే చాలా ధైర్యంగా తిరుగుతారు. వాళ్ళ దగ్గరా ఆయుధాలు ఉంటాయి. అవే చదువుకు సంబంధించిన డిగ్రీలు, న్యాయపరమైన తగాదాలు, హ్యాష్‌ట్యాగ్‌లూనూ. అవి గొంతు లేనివారికి గొంతుగా నిలుస్తాయి, వాళ్ళు పౌరహక్కులు అనే ముసుగు ధరించి సుకుమారంగా కనిపిస్తూ దేశ వ్యతిరేక ప్రచారంలో గాఢంగా ములిగిపోయిన కరడు గట్టిన రాజకీయ వాదులు. జెఎన్‌యూ తరగతి గదుల నుంచి హైకోర్టుల వరకూ, మీడియా సంస్థల స్టూడియోల నుంచి సోషల్ మీడియా ఫీడ్స్ వరకూ వాళ్ళు విస్తరించని ప్రదేశమే లేదు. అక్కడకు వెళ్ళి భారతదేశ ఐక్యతకు వ్యతిరేకంగా, అదే భారతదేశ వ్యవస్థలను కించ పరుస్తూ, తిరుగుబాటుదారులను గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఈ వ్యక్తులే మావోయిస్టుల ప్రచారానికి సైద్ధాంతిక భూమిక సమకూర్చే అనుమానాస్పద స్వచ్ఛంద సంస్థలతోనూ, మానవహక్కుల సంస్థలతోనూ భుజం భుజం రాసుకుని తిరుగుతూ కనిపిస్తారు.
ఎఫ్‌సిఆర్ఎ చట్టం ద్వారా స్వచ్ఛంద సేవ పేరిట విదేశాల నుంచి నిధులు సేకరించి, వాటిని అతివాద కార్యకలాపాలకు వాడుతుండడం, లేదా ఆర్థిక సమాచారాన్ని సరిగ్గా రిపోర్ట్ చేయకపోవడం వంటి కారణాలతో అలాంటి పలు స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను భారత ప్రభుత్వం 2020లో నిలిపివేసింది. ఆ చర్య, భారతదేశాన్ని లోపలినుంచే బలహీన పరిచేందుకు పని చేస్తున్న ఎకోసిస్టమ్ కుట్రలను బట్టబయలు చేసింది.
ఇది ఇంకెంత మాత్రం శాంతి భద్రతల సమస్య కాదు. అర్బన్ నక్సలిజానికి వ్యతిరేక పోరాటం అంటే భారతదేశపు మౌలిక ఆత్మను – నాగరికత, సంస్కృతి, రాజ్యాంగ వ్యవస్థలను – రక్షించుకోడానికి చేసే పోరాటం. ఆ యుద్ధాన్ని స్పష్టతతో, నిబద్ధతతో, ఎలాంటి రాజీ లేకుండా చేయాల్సి ఉంది.