మూడేళ్ల తరవాత కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 23 కోవిడ్ కేసులను గుర్తించారు. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్ బీ 1.8.1, ఎల్ ఎఫ్.7లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం ప్రకటించింది. ఎన్ బీ 1.8.1 రకం కేసు ఏప్రిల్ మాసంలో గుర్తించారు. ఎల్ ఎఫ్ 7కు సంబంధించి నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ వేరియంటును గుర్తించారు.
మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో 23 మందికి కరోనా సోకింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కేంద్రం అప్రమత్తం చేసింది. కేసులు నమోదవుతున్నా…తీవ్రత తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇటీవల హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్, చైనాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్ 1 వేరియంట్, దాని ఉపకారకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు.
జ్వరం, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కేంద్రం సూచనలు చేసింది. అనుమానిత లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచుకుంటున్నారు. ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. శ్వాసకోస నెగటివ్ రిపోర్టులను పరిశీలిస్తున్నారు. విదేశీ ప్రయాణీకులపై నిఘా పెంచారు.