ఈపీఎఫ్ నిధుల వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక శాఖ ఖరారు చేసింది. ఉద్యోగ భవిష్య నిది సంస్థ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన వడ్డీ రేటు 8.25 శాతంను కేంద్రం యథాతథంగా ఆమోదించింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి కూడా వడ్డీ రేటు 8.25 శాతం చెల్లించారు. త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.
ఉమాంగ్ యాప్ ద్వారా పీఫ్ వడ్డీ జమ అయ్యిందా? లేదా తెలుసుకునే అవకాశం కల్పించారు. పీఫ్ ఖాతా నిల్వల వివరాలు కూడా ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. నమోదు చేసుకున్న మొబైల్ నంబరు ద్వారా యాప్‌లో లాగిన్ అయ్యాక, ఈపీఎఫ్‌ఓ సేవల విభాగంపై క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయాలి. పీఫ్ నిల్వ, పాస్‌బుక్ వివరాలు కనిపిస్తాయి.
ఈపీఎఫ్ ఇండియావెబ్ సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. యూఏఎన్ నెంబరు ఎంట్రీ చేసి పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 996644425 నెంబరుకు మిస్డ్ కాల్ చేయడం ద్వారా ఈపీఎఫ్ నిల్వలు తెలుసుకోవచ్చు. త్వరలో డెబిట్ కార్డు ద్వారా ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది.