మయన్మార్ సముద్రంలో రెండు పడవలు ముగినిపోవడంతో 437 మంది రొహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మే 9, 10న జరిగిన ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మరణాలు నిర్ధారణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అంత్యంత విషాద ఘటనగా మిగిలిపోనుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
పడవల ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ శరణార్థి విభాగం ఈ ప్రమాదంపై విచారణ జరుపుతోంది. మే 9న ఓ పడవ మునిగిపోయింది. అందులో 267 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఐరాస తెలిపింది. మే 10న మరో ప్రమాదం చోటు చేసుకుంది. అందులో 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఐరాస అంచనా వేసింది.
రొహింగ్యాలు మయన్మార్‌లో జీవిస్తుంటారు. 2017 నుంచి వలసలు పెరిగాయి. లక్షలాది మంది తూర్పు బంగ్లాదేశ్ చేరుకున్నారు. అక్కడి శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోవడంతో వారంతా పలు దేశాలకు సముద్ర మార్గంలో అక్రమంగా వలసలు పోతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగాయని ఐరాస తెలిపింది.