మెగా డీఎస్సీ షెడ్యూల్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత నిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని, టెట్ నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంలో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
డీఎస్సీ, టెట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పరీక్షలు నిలుపుదల చేసేందుకు తగిన కారణాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. పరీక్షలు వాయిదా వేస్తూ స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉంటే ఏపీ హైకోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ, టెట్ పరీక్షలు ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సీబీటీ పద్ధతిలో నిర్వహించనున్నారు. సుప్రీం తీర్పుతో మెగా డీఎస్సీపై నీలినీడలు తొలగిపోయాయి.