ప్రపంచవ్యాప్తంగా హిందువులు పరమ భక్తిశ్రద్ధలతో కొలుచుకునే తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో అపచారం జరిగింది. మే 22న తిరుమల కొండ మీద, ఆలయం ఆవరణకు చేరువలో, కళ్యాణమండపం దగ్గర ఒక ముస్లిం వ్యక్తి నమాజు చేసాడు. ఆ సంఘటన వేంకటేశ్వర స్వామి భక్తులకు తీవ్ర మనోవేదన కలిగించింది.
తిరుమలలో సామూహిక వివాహాలు నిర్వహించే కళ్యాణ మండపం దగ్గర ఒక వ్యక్తి ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి, నేల మీద ఒక వస్త్రాన్ని పరిచి సుమారు పది నిమిషాలు నమాజు చేసాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటీవల పహల్‌గామ్ వద్ద ముస్లిం ఉగ్రవాదులు హిందువులను మతం అడిగి మరీ కాల్చి చంపిన దుశ్చర్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకూ గురి చేసింది.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఒక కారులో అక్కడికి వచ్చాడు. మొదట కొంత సమయం పార్కింగ్ దగ్గరే గడిపాడు. తర్వాత కళ్యాణ మండపం వైపు వచ్చి అక్కడ నమాజ్ చేసాడు. ఆ సంఘటనను వెంటనే టిటిడి అధికారులు, భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకువెళ్ళారు.
టిటిడి విజిలెన్స్ టీం ఆ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ వ్యక్తి వచ్చిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కనుగొన్నారు. తిరుమలకు భక్తుల బృందాన్ని తీసుకొచ్చిన డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దేవాలయం పరిసరాల పవిత్రతను, అక్కడ భద్రతనూ కాపాడడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామనీ… అదే సమయంలో మతసామరస్యం దెబ్బతినకుండా చూస్తామనీ చెప్పారు.
ఆ సంఘటన గురించి తిరుపతి పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేసారు. ‘‘ఈ ఉదయం టిఎన్ 83టి 6705 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కారు తిరుమలకు భక్తులను తీసుకుని వచ్చింది. భక్తులు దర్శనానికి వెళ్ళారు. ఆ కారు డ్రైవరు కళ్యాణ వేదిక దగ్గర నిర్ణీత ప్రదేశంలో కారును పార్కింగ్ చేసి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి ముస్లిం కావడంతో మధ్యాహ్నం నమాజ్ సమయంలో కళ్యాణ వేదిక దగ్గరున్న ఖాళీ ప్రదేశంలో నమాజ్ చేసుకుని అక్కడినుంచి కారులో వెళ్ళిపోయాడు’’ అని ఆ ప్రకటనలో చెప్పారు.
ఆ సంఘటన తిరుమల ఆలయం దగ్గర ధార్మిక విధివిధానాలు, భద్రతా చర్యల అమలులో లోపాల గురించి మరోసారి చర్చను రేకెత్తించింది.