పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ వద్ద ధూలియాన్ ప్రాంతంలో ఏప్రిల్ 11న చోటు చేసుకున్న మత కల్లోలాల గురించి కలకత్తా హైకోర్టు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను న్యాయస్థానానికి బుధవారం సమర్పించింది. ఆ నివేదికలో ఆనాటి సంఘటనలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని ఉండిపోయారని, వీలైనంతవరకూ అక్కడ గైర్హాజరు అయ్యారనీ తేల్చింది. ఆ దాడులను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మెహబూబ్ ఆలమ్ జరిపించాడని నివేదిక స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సిట్ ఏమి కనుగొంది?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ‘‘2025 ఏప్రిల్ 11న స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలమ్ కొందరు వ్యక్తులతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో ఎంఎల్ఎ కూడా అక్కడే ఉన్నాడు. అతను అల్లర్లు జరుగుతున్నాయని నిర్ధారించుకుని వెళ్ళిపోయాడు. ఆ హింసాకాండ 2025 ఏప్రిల్ 12 వరకూ కొనసాగింది’’ అని ఆ నివేదిక స్పష్టంగా వెల్లడించింది.
‘‘స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలమ్ దగ్గరుండి దాడులు జరిపించాడు. స్థానిక పోలీసులు పూర్తిగా నిస్తబ్ధంగా ఉండిపోయారు, అసలు ఆ ప్రదేశానికి రాలేదు’’ అని ఆ నివేదిక వివరించింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యాయ రిజిస్ట్రార్ జోగీందర్ సింగ్, పశ్చిమ బెంగాల్ న్యాయ సేవా ప్రాధికార సంస్థ సభ్య కార్యదర్శి సత్య అర్ణబ్ ఘోషాల్, పశ్చిమ బెంగాల్ జ్యుడీషియల్ సర్వీస్ రిజిస్ట్రార్ సౌగత చక్రబొర్తిలతో కమిటీ ఏర్పాటయింది. ముర్షీదాబాద్ హింస వల్ల నిర్వాసితులైన బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, వారి పునరావాస అవసరాలను గుర్తించడం ఆ కమిటీ విధులు.
‘‘బేట్‌బోనా గ్రామంలో 113 ఇళ్ళు దారుణంగా దెబ్బతిన్నాయి’’ అని ఆ కమిటీ నివేదికలో పొందుపరిచింది. ‘‘ఆ ఇళ్ళలో నివాసం ఉండేవారిలో అత్యధికులు మాల్డాలో తల దాచుకోవలసి వచ్చింది, అయితే వారిని పోలీసు అధికారులు బలవంతంగా మళ్ళీ వెనక్కు రప్పించారు’’ అని ఆ నివేదిక ఆరోపించింది.
ఆనాటి హింసాకాండలో దేవాలయాలను కూడా ధ్వంసం చేసారని నివేదిక స్పష్టంగా వెల్లడించింది.
‘‘బాధితులకు వ్యక్తిగతమైన, వారివారి అవసరాలకు తగిన పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలి. సమర్ధమైన రికవరీ, పరిహారం చెల్లింపుల మదింపు కోసం అర్హత కలిగిన వాల్యుయేషన్ నిపుణులను నియమించాల్సిన అవసరం ఉంది’’ అని జస్టిస్ సౌమెన్ సేన్, రాజా బసు చౌధురిలతో కూడిన కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ గమనించింది.
ఆ నివేదిక లోని మరికొన్ని వివరాలు ఇలా ఉన్నాయి…
‘‘పశ్చిమ బెంగాల్ పోలీసులు స్పందించలేదు. బేట్‌బోనా గ్రామ్తులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పోలీసులకు ఫోన్ చేసారు. మళ్ళీ శనివారం కూడా ఫోన్ చేసారు. కానీ పోలీసులు కనీసం ఫోన్ ఎత్తలేదు.’’
‘‘ఒక వ్యక్తి గ్రామానికి మళ్ళీ వచ్చాడు. ఏయే ఇళ్ళ మీద దాడి జరగలేదో గుర్తించాడు. ఆ తర్వాత దుండగులు మళ్ళీ వచ్చారు. దాడి జరగని ఇళ్ళకు నిప్పంటించారు.’’
‘‘నిప్పును ఆర్పడానికి గ్రామస్తులకు నీళ్ళు దొరకకుండా చేయడం కోసం దుండగులు గ్రామంలోని నీటి కనెక్షన్లను కట్ చేసేసారు.’’
‘‘దుండగులు ఇళ్ళలోకి దూరి మహిళల దుస్తులు అన్నింటినీ కుప్పవేసి కిరోసిన్ ఆయిల్‌తో తగులబెట్టేసారు. బాధిత మహిళలు తమ శరీరాలను కప్పుకోడానికి దుస్తులు లేకుండా ఆ పని చేసారు.’’
ఆ నివేదిక ఇద్దరు వ్యక్తుల హత్య గురించి వివరించింది. మృతులు హరగోబింద దాస్ (74), ఆయన కుమారుడు చందన్ దాస్ (40). ‘‘దుండగులు ఆ ఇంటి ప్రధాన ద్వారం లోనుంచి చొరబడ్డారు. ఆమె కొడుకు చందన్‌దాస్‌ను, ఆమె భర్త హరగోబింద దాస్‌నూ లాక్కుపోయారు. వాళ్ళ వీపు మీద గొడ్డళ్ళతో నరికారు. ఒక దుండగుడు అక్కడే కూర్చుని, వారు చనిపోయేవరకూ వేచిచూస్తూ ఉన్నాడు. వారిద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాకే అక్కడినుంచి కదిలి వెళ్ళాడు’’.
అంతకుముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయస్థానానికి ఒక నివేదిక సమర్పించింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8 నుంచి 12 వరకూ నాలుగు రోజుల పాటు జరిగిన హింసాకాండ గురించి మమతా బెనర్జీ సర్కారు తనదైన నివేదిక ఇచ్చింది. పోలీసులు, అధికారుల జోక్యం వల్ల సూతీ, ధూలియాన్, షంషేర్‌గంజ్, జాంగీపూర్‌లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వ నివేదికలో చెప్పుకున్నారు. అయితే వాస్తవం ఏమిటన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికతో వెలుగు చూసింది.
సిట్ నివేదికపై విహెచ్‌పి స్పందన:
విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘‘మమతా బెనర్జీ బృందం జమ్మూకశ్మీర్ వెడదామనుకుంటున్నారు. కానీ వాళ్ళు అంతకంటె ముందు ముర్షీదాబాద్ వెళ్ళాలి. హిందువులకు క్షమాపణలు చెప్పాలి. వారికి న్యాయం చేయాలి. దీదీ ఐదుగురు సభ్యుల బృందం బెంగాల్ నుంచి జమ్మూకశ్మీర్ వెడుతుంది కానీ ముర్షీదాబాద్ వెళ్ళదు. వాహ్ దీదీ వాహ్. ఒకవైపు ఉగ్రవాదుల ప్రియురాలు పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మరణాలపై ఆవేదన చెందుతోంది. మరోవైపు దీదీ, ముర్షీదాబాద్ సంగతి వదిలేస్తే, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమైనందుకు బాధపడుతోంది.
‘‘మీరు మీ బృందాన్ని మొదట ముర్షీదాబాద్‌కు పంపాల్సింది. అక్కడ మీ టిఎంసి నాయకుడు హిందువులను ఊచకోత కోసి, ఆ ప్రాంతం నుంచి తరిమేసాడు. గౌరవనీయ హైకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ ఇచ్చిన, ఒళ్ళు గగర్పొడిచే నిజాలతో కూడిన నివేదికను మీరు చదివితే బాగుంటుంది. అక్కడ జిహాదీలు హింసాకాండకు పాల్పడుతుంటే మీ పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు, అసలు అక్కడకు వెళ్ళనే లేదు. ఆ దర్యాప్తు కమిటీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు, మీ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ సభ్యులు, జ్యుడీషియల్ సేవల సభ్యులూ ఉన్నారు. విచక్షణా రహితంగా జరిగిన దాడులు, గృహ దహనాలు, దుకాణాలూ వ్యాపార ప్రాంతాల విధ్వంసం గురించి ఆ కమిటీ నివేదిక సవివరంగా చెప్పింది. గౌరవనీయ హైకోర్టు తన తీర్పు ఇస్తుంది. ఏమాత్రమైనా సిగ్గు మిగిలుంటే, కనీసం మమతా దీదీ అయినా జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పాలి, బాధితులకు తక్షణం న్యాయం చేయాలి’’ అని విజ్ఞప్తి చేసారు.