తిరుమల శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం ముగించుకుని గుడి బయటకు వెళ్లే వరకుమార్గ మధ్యంలో కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయనున్నారు. గంటకు ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారనే విషయాలు ప్రస్తుతం టీటీడీ వద్ద సమాచారం లేదు. ప్రతి గంటకు దర్శనాలను పర్యవేక్షణ చేస్తూ క్యూ లైన్లలో భక్తులకు సత్వర దర్శనం కల్పించనున్నారు.
సర్వదర్శనం, స్లాటు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, అదనంగా క్యూలైన్లలోకి వచ్చిచేరుతున్న భక్తులను నియంత్రించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడనుంది. ఇందుకు సంబంధించి టెండర్లు పిలవాలని టీటీడీ ఈవో నిర్ణయించారు. నాలుగు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.
దళారులకు అడ్డుకట్ట వేయడం, ఉద్యోగుల చేతివాటానికి తెర దింపడానికి కూడా ఏఐ ఉపయోగపడనుంది. జియో సంస్థ ఇప్పటికే భక్తుల ఫేషియల్ రికగ్నిషన్ ప్రారంభించింది. భక్తుల దర్శనం సమయాన్ని 2 గంటలకు తగ్గించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.