ఏపీలో కరోనా కేసు నమోదైంది. విశాఖ నగరం మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా సోకింది. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతోంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లగా అనుమానంతో డాక్టర్లు కరోనా పరీక్షలు చేయించారు. పాజిటివ్ రావడంతో వైద్యం అందించారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
గత రాత్రి కరోనా సోకి చికిత్స తీసుకున్న యువతిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె ఎలాంటి ప్రయాణాలు చేయలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి అన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వైద్యుల సూచనల మేరకే వైద్యం తీసుకోవాలి. ఈ లక్షణాలు సోకిన వారిని ప్రత్యేకంగా గదిలో ఉంచాలి. లక్షణాలు కనిపించినవారు తప్పనిసరిగా మాస్క్ ఉపయోగించాలి. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.